భట్టి విక్రమార్క, లింగాల కమల్‌రాజ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు పెట్టనికోట.. విశిష్ట రాజకీయాలకు పెట్టింది పేరు.. పాగా వేసేందుకు తహతహలాడుతున్న పార్టీలు.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారం చేయగా.. నియోజకవర్గ ప్రజలు ఎవరిని మెచ్చుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. టీఆర్‌ఎస్ పార్టీ ఈసారి మధిర నియోజకవర్గంలో విజయం సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ మూడోసారి ఇక్కడ విజయం సాధించేందుకు సర్వశక్తులొడ్డుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తుండగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా లింగాల కమల్‌రాజ్ బరిలో ఉన్నారు.
ఈ ఇద్దరు అభ్యర్థులు 2014 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే భట్టి విక్రమార్క అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా.. కమల్‌రాజ్ వైఎస్సార్ సీపీ మద్దతుతో సీపీఎం తరఫున పోటీ చేశారు. అనంతరం జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆయన తొలుత వైఎస్సార్ సీపీలో చేరగా.. ఆ తర్వాత ఆయనతోపాటు టీఆర్‌ఎస్ గూటికి చేరారు. కమ్యూనిస్టు పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేయడం.. ఎంపీపీగా పనిచేసిన అనుభవం, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతోపాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిస్థాయి అండదండలు..
టీఆర్‌ఎస్ సంక్షేమ కార్యక్రమాలు తనను విజయ తీరానికి చేరుస్తాయని కమల్‌రాజ్ విశ్వసిస్తున్నారు. ఇక టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర రాజకీయాల్లో తనవంతు కీలక పాత్రను పోషిస్తూనే మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌తోపాటు ఎంపీ పొంగులేటి పూర్తిగా మధిర నియోజకవర్గంపై దృష్టి సారించి.. పల్లె నిద్రలు చేయడం.. ఇంటింటి ప్రచారానికి సైతం నడుం బిగించడం పార్టీ విజయానికి దోహదపడుతుందని టీఆర్‌ఎస్ భావిస్తుండగా.. కాంగ్రెస్‌కు గల సంప్రదాయ ఓటు బ్యాంకు, విక్రమార్కకు నియోజకవర్గ ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాలకు ప్రజాకూటమి ద్వారా టీడీపీ, సీపీలు భాగస్వామ్యం కావడంతో తమకు నియోజకవర్గంలో అదనపు బలం లభించినట్లయిందని భావిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు భట్టి విజయం సాధించడానికి ఈ అంశాలు దోహదపడతాయని భావిస్తున్నారు.
మాటల యుద్ధం, విమర్శలు, ప్రతివిమర్శలు..
ఇదే నియోజకవర్గం నుంచి సీపీఎం మద్దతుతో బీఎల్‌పీ అభ్యర్థిగా డాక్టర్ కోటా రాంబాబు, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కత్తుల శ్యామలరావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థుల అభ్యర్థిత్వం దాదాపు రెండు నెలల ముందే ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారాన్ని గ్రామ గ్రామాన అనేకమార్లు నిర్వహించే అవకాశం లభించింది. మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పార పడుతూ.. ప్రజాకూటమి విజయం సాధిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని.. ప్రజా సమస్యలు తీరుతాయని, కేసీఆర్ పాలనలో చేసిందేమీ లేదని.. ఆడంబరాలతో ప్రజలను మభ్య పెట్టారని విమర్శనాస్త్రాలు సంధించారు.
భట్టి, పొంగులేటి మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం, విమర్శలు, ప్రతివిమర్శల హోరు కొనసాగింది. ఇక టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌తోపాటు ఆయన గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న ఎంపీ పొంగులేటి సైతం ఎన్నికల ప్రచారంలో వాడీవేడిగా విమర్శనాస్త్రాలను సంధించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి, ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిన తీరును ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ బలాబలాలను వివరిస్తూనే.. ప్రత్యర్థి పార్టీల బలహీనతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. లింగాల కమల్‌రాజ్ విజయం కోసం సీఎం కేసీఆర్ మధిరలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించగా.. మల్లు భట్టి విక్రమార్క విజయం కోసం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ప్రజా గాయకుడు గద్దర్ రెండు పర్యాయాలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే ఖమ్మంలో జరిగిన రాహుల్, చంద్రబాబు సభల్లో సైతం భట్టి విజయాన్ని అగ్రనేతలు కాంక్షించారు. నియోజకవర్గంలోని ముదిగొండ, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం, మధిర మండలాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు.. తమకు లభించిన ఆదరణకు అనుగుణంగా విజయం తమదంటే తమదని విశ్వసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment