జల్సాల కోసం చోరీల బాట
గోల్కొండ: జల్సాలకు అలవాటుపడి స్నాచింగ్, సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ఓ విద్యార్థుల గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. వారికి బాస్‌గా వ్యవరిస్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగితోపాటు ఇద్దరు మైనర్ విద్యార్థులు కూడా ఉన్నారు. గోల్కొండ ఇన్ స్పెక్టర్ ఖలీల్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. టోలీచౌకి జానకినగర్‌కు చెందిన మహ్మద్ ఫర్మాన్ (18) ప్రైవేట్ షాపులో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. కొంత కాలం క్రితం అతడికి పారామౌంట్ కాలనీకి చెందిన ఎంఏ అక్రం (19) తో పరిచయమైంది. అక్రం ప్రైవేట్ కాలేజిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బులు సరిపోక పోవడంతో సులువైన చైన్‌స్నాచింగ్ బాటపట్టాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకు గాను ఇద్దరూ 17 ఏళ్ల విద్యార్థులను తమతో కలుపుకున్నారు. నలుగురూ కలిసి గోల్కొండ, ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఈ గ్యాంగ్ టూంబ్స్ చౌరస్తా వద్ద ఉందని గోల్కొండ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై పి.వాసుదేవ్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి వారిని పటుకున్నారు. మార్నింగ్ వాక్కు వచ్చే వారి ఫోన్లను చోరీ చేయటానికే తామక్కడికి వచ్చామంటూ వారు విచారణలో వెల్లడించారు. వారి వద్దనుంచి రెండు బైకులు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.