మోదీ ఉన్నారని రానివ్వలేదు!
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ 66 వ వర్థంతి సందర్భంగా ఆయన స్మృతి వనాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన జేడీయూ అధినేత శరద్ యాదవ్ కు అనుమతినివ్వకపోవడం పలు విమర్శలకు దారి తీసింది. శుక్రవారం గాంధీ వర్థంతి కావడంతో న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద ఉన్న మహాత్ముని సమాధికి అంజలి ఘటించడానికి శరద్ యాదవ్ వెళ్లారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అప్పటికే లోపల ఉండటంతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది శరద్ యాదవ్ ను అనుమతించలేదు. మోదీ లోపల ఉన్నారంటూ అభ్యంతర వ్యక్తం చేశారు. దీంతో ఆయన చేసేది లేక వెనుదిరిగాల్సి వచ్చింది.
ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది అనుసరించిన తీరుపై జేడీయూ విమర్శలు గుప్పించింది. ఒక పార్లమెంట్ సభ్యున్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ప్రశ్నించారు. ఒక గుర్తింపు పొందిన పార్టీకి అధ్యక్షునిగా ఉన్న శరద్ యాదవ్ ను నియంత్రిచడం సరైనది కాదన్నారు. ఇది చరిత్రలోనే చాలా దురదృష్టకర అంశమని త్యాగి వ్యాఖ్యానించారు. గాంధీకి నివాళులు అర్పించడానికి గాంధీయే వాది కాని మోదీకి అసలు అర్హత లేదని విమర్శించారు. గత 30 సంవత్సరాల నుంచి గాంధీజీ వర్థంతి రోజున యాదవ్ నివాళులు అర్పిస్తున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.