Maitri Movies
-
కొత్త సినిమా షూటింగ్లో చిరంజీవి
చిరంజీవి ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. ‘ఆచార్య’, ‘బోళాశంకర్’ సినిమాల షూటింగ్లో పాల్గొంటున్న ఆయన తాజాగా కొత్త సినిమా చిత్రీకరణలో గురువారం జాయిన్ అయ్యారు. ఈ సినిమాకు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సెట్స్‌లో చిరంజీవికి సీన్ వివరిస్తున్న ఓ ఫొటోను బాబీ షేర్ చేసి, ‘‘చిరంజీవి అన్నయ్య తొలిరోజు షూటింగ్లో మాతో జాయిన్ అయ్యారు. కొంచెం నెర్వస్‌గా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రయాణానికి గొప్ప ఆరంభం ఇది’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ ఏ విల్సన్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, సహ నిర్మాత: జీకే మోహన్, సీఈఓ: చెర్రీ. -
'సర్కారు వారి పాట' నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే..
దుబాయ్‌కి టాటా చెప్పేసింది ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తీ సురేశ్ కథానాయిక. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దుబాయ్ షెడ్యూల్లో ఓ యాక్షన్ సన్నివేశం, ఓ పాట, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. తాజాగా దుబాయ్ షెడ్యూల్ పూర్తయింది. చిత్రబృందం హైదరాబాద్ తిరిగొచ్చారు. నెక్ట్స్ షెడ్యూల్ గోవాలో జరగనుందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
మహేశ్‌వారి పాటలు!
మహేశ్‌వారి పాటల సందడి మొదలైనట్లుంది. మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందనుంది. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఈ లోపు పాటలను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అలాగే షూటింగ్‌కు అనుమతులు లభించన వెంటనే చిత్రీకరణ స్టార్ట్ చేసేందుకు ఓ సెట్‌ను సిద్ధంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్. బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్ డ్రామాయే ఈ చిత్రం అని, ఓ బ్యాంకు మేనేజర్ కొడుకుగా మహేశ్ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. -
సల్మాన్‌తో మైత్రి
‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి చిత్రాలతో ఆరంభంలోనే వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు ఈ సంస్థ అధినేతలు వై. రవిశంకర్, నవీన్ యర్నేని. ఈ నిర్మాణ సంస్థ బాలీవుడ్లో తొలి అడుగు వేయనుంది. సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా నిర్మించడానికి ప్లాన్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. సల్మాన్‌తో చర్చలు కూడా పూర్తయ్యాయి. 2022లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
నాన్నకు తెలియకుండా సినిమా చేశా
‘‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశా. ఆ సమయంలోనే నేను నటుడిగా రాణించగలనని, నాతో సినిమా చేయొచ్చనే నమ్మకం నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లకు కలిగింది. ‘మత్తు వదలరా’ సినిమా అంగీకరించాక మూడు నెలలు నటనలో శిక్షణ తీసుకున్నా’’ అన్నారు శ్రీసింహా. సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.. ఈ సందర్భంగా శ్రీసింహా చెప్పిన విశేషాలు. ► నాన్నపై (కీరవాణి) ఆధారపడకుండా ఏదైనా సాధిస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. అందుకే నాన్నకు తెలియకుండానే సుకుమార్‌గారి దగ్గర ‘రంగస్థలం’కి సహాయ దర్శకుడిగా, ‘మత్తు వదలరా’తో హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టాను. బాలనటుడిగా సినిమాలు చేశాను. అప్పుడే నటన పట్ల నాకున్న ఆసక్తి ఇంట్లో వారికి అర్థమైంది. డిగ్రీ తర్వాత ‘రంగస్థలం’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. అప్పుడే ‘మత్తు వదలరా’ సినిమాలో నటించే అవకాశం రావడంతో హీరోగా మారాను. ► ‘యమదొంగ’లో చిన్ననాటి ఎన్టీఆర్ పాత్రలో కనిపించాను. చిన్నతనం నుంచి నేను ఎన్టీఆర్ (జూనియర్) అభిమానిని. ఆయన నా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం మా నమ్మకానికి ప్రోత్సాహాన్నిచ్చింది. ‘రంగస్థలం’ నుంచి రామ్‌చరణ్‌గారితో పరిచయం ఉంది. రానాగారు మా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం హ్యాపీ. ► నటన పరంగా నాన్న, రాజమౌళిగారు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. వారు పని చేసే విధానం నుంచే మేం ఎక్కువగా నేర్చుకున్నాం. హీరోగా చేస్తున్నానని తెలియగానే రాజమౌళిగారు భయపడ్డారు. అయితే నటన వద్దని చెప్పలేదు. కష్టపడి సినిమా చేయమని ప్రోత్సహించారు. ► తొలి సినిమాగా ప్రేమకథ లేదా మాస్ సినిమా ఎంచుకుంటేనో లేదా సినిమాలో ప్రేమ, పాటలు, ఫైట్స్ ఉంటేనో మంచి ఆరంభం అవుతుందనుకోవడం సరికాదు. కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను హీరోగా, అన్నయ్య సంగీత దర్శకుడిగా ఒకే సినిమాతో పరిచయం అవుతామని ఊహించలేదు. ► ఈ సినిమాలో నిద్రమత్తులో ఉండే డెలివరీ బాయ్ పాత్ర నాది. చాలీచాలని జీతంతో పని చేసే అతడు ఓ సమస్యలో చిక్కుకుని, ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మూడు రోజుల్లో జరిగే కథ ఇది. ► కీరవాణి, రాజమౌళిగార్ల కుటుంబం నుంచి వస్తున్నాను కాబట్టి కొత్తగా కనిపించాలని ఆలోచిస్తే నటనలో సహజత్వం లోపిస్తుంది. అందుకే నిజజీవితంలో ఎలా ఉంటానో అలాగే నటించాను. అలా చేస్తేనే పాత్రకు న్యాయం జరుగుతుందని నా ఫీలింగ్. ► ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచన లేదు. హీరోగానే కాదు.. కథ నచ్చితే ప్రాధాన్యం ఉన్న పాత్రలూ చేస్తాను. రాజమౌళిగారి సినిమాలో ఒక్క ఫ్రేములోనైనా కనిపించాలన్నది నా కల. మా అన్నయ్యను సంగీత దర్శకుడిగా, నన్ను హీరోగా పెట్టి రాజమౌళిగారి అబ్బాయి కార్తికేయ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. -
మస్త్ బిజీ
‘1945 (తమిళంలో ‘మడైతిరందు’), అరణ్య (తమిళంలో ‘కాడన్’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’), ‘మార్తాండ వర్మ: ది కింగ్ ఆఫ్ ట్రావెన్కోర్’, కోడి రామ్మూర్తి బయోపిక్, హిరణ్య కశ్యప, యన్టీఆర్ బయోపిక్... ఇది హీరో రానా చేతిలో ఉన్న సినిమాల లిస్ట్. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న రానా ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆశ్చర్యపోరు కదా. మరి.. ఆయన ప్లానింగ్ అలా ఉంది. రానా హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందనుందని సమాచారం. ‘ఐతే..’, అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం, మనమంతా’ వంటి భిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇందులో రానా క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందట. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇలా వచ్చే ఏడాది రానా డైరీ ఫుల్‌గా ఉంది. అయితే..‘1945, అరణ్య, యన్టీఆర్ బయోపిక్’ సినిమాల్లో రానా పాత్రలకు సంబంధించిన మేజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక.. మిగిలిన సినిమాలు కాస్త అటూ ఇటుగా సెట్స్‌పైకి వేళ్లే అవకాశం ఉందని ఊహించవచ్చు. -
మహేశ్‌తో మూవీ... సుక్కుకు భారీగా అడ్వాన్స్!
రంగస్థలం ఈ ఒక్క చిత్రం ఎందరి జీవితాలనో మార్చేసింది. హీరో, హీరోయిన్, సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులకు, ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్‌కు ఇది మరిచిపోలేని సినిమా. తన సినీ కెరీర్లోనే రంగస్థలం అతి పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా తరువాత సుక్కు తదుపరి సినిమా ఏంటి? అనే దాని గురించి ఆలోచించిన ప్రేక్షకులకు ఊరట కలిగిస్తూ... మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేశ్, సుక్కు కాంబినేషన్లో సినిమా ఉంటుందని ఇటీవలే ప్రకటించేసింది. రంగస్థలం సినిమా చిత్రీకరణ సమయంలోనే సుకుమార్ మైత్రీ మూవీకే మళ్లీ సినిమా చేస్తాడని చెప్పారట. చెప్పిన ప్రకారమే మళ్లీ అదే సంస్థలో సినిమా చేస్తున్నాడు. అయితే మహేశ్‌తో చేయబోయే సినిమాకు ఈ లెక్కల మాష్టారుకు బాగానే లెక్కలు ముట్టజెప్పారట. దాదాపు ఆరు కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ కొన్ని ఇంటర్వ్యూలో సుక్కు...తనకు అడ్వాన్స్ తీసుకోవడం ఇష్టముండదని, తీసుకుంటే తనకు భయం వేస్తుందని చెప్పాడు. అయితే ప్రస్తుతంద సుక్కు ఆరు కోట్లు అడ్వాన్స్ అంటూ ఈ రూమర్ చక్కర్లు కొడుతోంది. మరి వీటిలో ఏది నిజమో సుకుమార్, నిర్మాతలకే తెలియాలి. -
మైత్రి లేదు!
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ తెరంగేట్రం చేసిన ‘అఖిల్’ సినిమా వచ్చి ఆరు నెలలవుతోంది. మొదటి చిత్రం జయాపజయాల సంగతెలా ఉన్నా తనలో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని అఖిల్ నిరూపించుకున్నారు. ఇప్పుడు ఈ యువహీరో చేయనున్న రెండో సినిమాపై అందరి దృష్టీ ఉంది. ఈ చిత్రం ఏ బేనర్లో ఉంటుందనే చర్చ జరుగుతోంది. మహేశ్‌బాబుతో ‘శ్రీమంతుడు’ వంటి సూపర్ హిట్ మూవీ నిర్మించి, ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘జనతా గ్యారేజ్’ నిర్మిస్తున్న ‘మైత్రి మూవీస్’ ఈ చిత్రాన్ని నిర్మించనుందనే టాక్ వినిపిస్తోంది. దీని గురించి అఖిల్ ట్విట్టర్ ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చారు. ‘‘ఇలాంటి వార్తలు ఎక్కణ్ణుంచి వెబ్ మీడియా వాళ్లకి వస్తాయో అర్థం కావడం లేదు.. నా రెండవ చిత్రం ‘మైత్రి’ సంస్థలో చేస్తున్నాననడం అవాస్తవం. ఒక వార్తని ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. రెండో చిత్రం ఎప్పుడు ఆరంభమవుతుందనే విషయం గురించి మాత్రం అఖిల్ క్లారిటీ ఇవ్వలేదు. దర్శకుడు వంశీ పైడిపల్లి కథ రెడీ చేస్తున్నారట. మరి.. ఎవరు నిర్మిస్తారో చూడాలి.