నాన్నకు తెలియకుండా సినిమా చేశా | Mathu Vadalara Hero Sri Simha Interview | Sakshi
Sakshi News home page

నాన్నకు తెలియకుండా సినిమా చేశా

Published Tue, Dec 24 2019 12:03 AM | Last Updated on Tue, Dec 24 2019 4:32 AM

Mathu Vadalara Hero Sri Simha Interview - Sakshi

శ్రీసింహా

‘‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశా. ఆ సమయంలోనే నేను నటుడిగా రాణించగలనని, నాతో సినిమా చేయొచ్చనే నమ్మకం నిర్మాతలు నవీన్, రవిశంకర్‌గార్లకు కలిగింది. ‘మత్తు వదలరా’ సినిమా అంగీకరించాక మూడు నెలలు నటనలో శిక్షణ తీసుకున్నా’’ అన్నారు శ్రీసింహా. సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.. ఈ సందర్భంగా శ్రీసింహా చెప్పిన విశేషాలు.


► నాన్నపై (కీరవాణి) ఆధారపడకుండా ఏదైనా సాధిస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది. అందుకే నాన్నకు తెలియకుండానే సుకుమార్‌గారి దగ్గర ‘రంగస్థలం’కి సహాయ దర్శకుడిగా, ‘మత్తు వదలరా’తో హీరోగా కెరీర్‌ను మొదలుపెట్టాను. బాలనటుడిగా సినిమాలు చేశాను. అప్పుడే నటన పట్ల నాకున్న ఆసక్తి ఇంట్లో వారికి అర్థమైంది. డిగ్రీ తర్వాత ‘రంగస్థలం’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. అప్పుడే ‘మత్తు వదలరా’ సినిమాలో నటించే అవకాశం రావడంతో హీరోగా మారాను.  

► ‘యమదొంగ’లో చిన్ననాటి ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించాను. చిన్నతనం నుంచి నేను ఎన్టీఆర్‌ (జూనియర్‌) అభిమానిని. ఆయన నా సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయడం మా నమ్మకానికి ప్రోత్సాహాన్నిచ్చింది. ‘రంగస్థలం’ నుంచి రామ్‌చరణ్‌గారితో పరిచయం ఉంది. రానాగారు మా ట్రైలర్‌ను రిలీజ్‌  చేయడం హ్యాపీ.  

► నటన పరంగా నాన్న, రాజమౌళిగారు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. వారు పని చేసే విధానం నుంచే మేం ఎక్కువగా నేర్చుకున్నాం. హీరోగా చేస్తున్నానని తెలియగానే రాజమౌళిగారు  భయపడ్డారు. అయితే నటన వద్దని చెప్పలేదు. కష్టపడి సినిమా చేయమని ప్రోత్సహించారు.  

► తొలి సినిమాగా ప్రేమకథ లేదా మాస్‌ సినిమా ఎంచుకుంటేనో లేదా సినిమాలో ప్రేమ, పాటలు, ఫైట్స్‌ ఉంటేనో మంచి ఆరంభం అవుతుందనుకోవడం సరికాదు. కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను హీరోగా, అన్నయ్య సంగీత దర్శకుడిగా ఒకే సినిమాతో పరిచయం అవుతామని ఊహించలేదు.  

► ఈ సినిమాలో నిద్రమత్తులో ఉండే డెలివరీ బాయ్‌ పాత్ర నాది. చాలీచాలని జీతంతో పని చేసే అతడు ఓ సమస్యలో చిక్కుకుని, ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మూడు రోజుల్లో జరిగే కథ ఇది.

► కీరవాణి, రాజమౌళిగార్ల కుటుంబం నుంచి వస్తున్నాను కాబట్టి కొత్తగా కనిపించాలని ఆలోచిస్తే నటనలో సహజత్వం లోపిస్తుంది. అందుకే నిజజీవితంలో ఎలా ఉంటానో అలాగే నటించాను.  అలా చేస్తేనే పాత్రకు న్యాయం జరుగుతుందని నా ఫీలింగ్‌.  

► ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచన లేదు. హీరోగానే కాదు.. కథ నచ్చితే  ప్రాధాన్యం ఉన్న పాత్రలూ చేస్తాను. రాజమౌళిగారి సినిమాలో ఒక్క ఫ్రేములోనైనా కనిపించాలన్నది నా కల. మా అన్నయ్యను సంగీత దర్శకుడిగా, నన్ను హీరోగా పెట్టి రాజమౌళిగారి అబ్బాయి కార్తికేయ ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement