మురిపించిన మలయప్ప
= మూడు వాహనాలపై స్వామివారి దివ్య కటాక్షం
= పులకించిన అశేష భక్తజనం
= అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్పస్వామి భక్తశిఖామణి హనుమంతుడిని వాహనంగా మలుచుకుని భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్భాణాలు చేతపట్టిన శ్రీరామచంద్రుడిని ఆంజనేయుడు తన భుజంపై ఉంచుకుని ఆలయ వీధుల్లో విహరిస్తూ అశేష భక్తజనులకు కనువిందు చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీవేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ హనుమంత వాహనం ద్వారా స్వామి భక్తకోటికి సందేశాన్ని ఇచ్చారు. వేకువజామున మలయప్పస్వామికి రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ చేసి, వాహన మండపంలో వేంచేపు చేశారు.
బంగారు, వజ్ర, వైఢూర్య పుష్పాలతో మలయప్పకు విశేష అలంకరణ చేశారు. మంగళధ్వనులు, పండితుల వేదఘోష, దివ్య ప్రబంధం, జానపద సాంస్కృతిక కార్యక్రమాల కోలాహలం మధ్య ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 వరకు వేడుకగా సాగింది. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొ న్నారు. గురువారం రాత్రి గజ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ముగ్ధ మనోహరుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై ఆశీనుడై రాజసంగా నాలుగు మాడ వీధుల్లో భక్తులకు కనువిందు చేశారు.
భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే తను శరణు కోరే వారిని ఎల్లవేళలా కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఈ వాహనంపై ఊరేగారు. గజ వాహన రూఢుడైన కలియుగ వైకుంఠ వాసుడిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. అశేష భక్తజనుల గోవింద నామస్మరణ, కళాకారుల నృత్యాలు, వేద ప్రబంధ గోష్ఠి నడుమ వాహన సేవ వైభవంగా సాగింది.