లారీ ఢీకొని బీటెక్ విద్యార్థిని దుర్మరణం
మియాపూర్: ద్విచక్రవాహనాన్ని స్టార్ట్ చేస్తే కాలేదు... దీంతో ఇంజిన్ వైపు వంగి చూస్తున్న బీటెక్ విద్యార్థినిని అంతలోనే వెనుకనుంచి దూసుకొచ్చి ఇసుక లారీ బలిగొంది. ఈ హృదయ విదారక ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కొండగట్టు గ్రామానికి చెందిన మౌనిక (18) నగరంలోని మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ ఫైనల్ చదువుతూ మియాపూర్ హెచ్ఎంసీ స్వర్ణపురికాలనీలోని పెద్దన్నాన ఇంట్లో ఉంటోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు తమ ఇంటి ముందు ఉన్న రోడ్డుపై తన ద్విచక్రవాహనాన్ని నిలిపి స్టార్ట్ చేయగా స్టార్ట్ కాలేదు.
దీంతో ఆమె ద్విచక్ర వాహనాన్ని వంగి పరిశీలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. తీవ్రగాయాలకు గురైన మౌనికను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా... చికిత్సపొందుతూ రాత్రి 8.30కి మృతి చెందింది. పోలీసులు స్వగ్రామంలో ఉన్న మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు శోకసంద్రంలో మునిగిపోయారు.