మద్యం మత్తులో ఏఎస్ఐ హల్ చల్
మద్యం మత్తులో బాధ్యత మరచి అతిగా ప్రవర్తించిన ఓ ఏఎస్ఐకి స్థానికులు దేహశుద్ధి చేసిన సంఘటన ఇక్కడి మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... చామరాజపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఈశ్వరప్ప ఏఎస్ఐ. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో తన బైక్ తీసుకుని బయలుదేరాడు. మల్లేశ్వరం దారిలో కాంతిలాల్ జైన్ అనే వ్యక్తి వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా ఎడమవైపు ఉన్న కారు అద్దాన్ని పగలగొట్టి కారులో ఉన్న కాంతిలాల్న బయటకు లాగి దాడి చేశాడు. స్థానికులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు.
దీంతో ఈశ్వరప్ప ఊగిపోయాడు. తననే అడ్డుకుంటారా అంటూ స్థానికులపై విరుచుకుపడ్డాడు. దీంతో స్థానికులు ఈశ్వరప్పను పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న మల్లేశ్వరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చావుదెబ్బలు తిన్న ఏఎస్ఐని కేసీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు నగర పశ్చిమ విభాగం (ట్రాఫిక్) డీసీపీ గిరీష్ ఈశ్వరప్పను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.