ఆర్టీసీ బస్సులో మహిళకు వేధింపులు
మిర్యాలగూడ టౌన్: మద్యం మత్తులో ఇద్దరు కామాంధులు అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అడ్డుకున్న డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఆ ఇద్దరినీ పోలీసులకు అప్పగించాడు. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఇటీవల మిర్యాలగూడకు వచ్చింది. పట్టణంలో ఈ నెల 20న ఈవెంట్ నిర్వహించిన అనంతరం అదే రోజు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు అర్ధరాత్రి 12:30 గంటలకు మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కింది. అదే బస్సులో మరో ఇద్దరు ప్రయాణికులతో పాటు మిర్యాలగూడకు చెందిన కిరణ్, మంగళ్‌సింగ్ కూడా ఎక్కా రు. బస్సు మిర్యాలగూడ నుంచి బయల్దేరిన తర్వాత ఇద్దరు ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు.
ఈ క్రమంలో బాగా మద్యం తాగి ఉన్న కిరణ్, మంగళ్‌సింగ్ .. ఈవెంట్ ఆర్గనైజర్ సీటుపై కాళ్లు వేయడంతో పాటు వెకిలిచేష్టలకు పాల్పడ్డారు. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్ వారి వేధింపులు తాళలేక బస్సు డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లి కూర్చుంది. దీంతో వారు కూడా డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లి ఆ ప్రయాణికురాలిని వేధించారు. దీంతో బస్సు డ్రైవర్ సైదులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిపై దాడి చేశారు.
ఈ క్రమంలో డ్రైవర్ బస్సును నేరుగా నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించాడు. అనంతరం కిరణ్, మంగళ్‌సింగ్‌ను పోలీసులకు అప్పగించాడు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కాగా, కామాంధుల నుంచి తనను కాపాడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైదులుతో పాటు సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఆదివారం ఆర్టీసీ మిర్యాలగూడ డీఎం బొల్లెద్దు పాల్‌కు లేఖ అందించింది.