mangapet
-
ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
సాక్షి, వరంగల్: ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వివాహేతర సంబంధాన్ని భర్త బట్టబయలు చేశాడు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన మంగపేట మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలి భర్త, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. మరో ఉపాధ్యాయురాలితో కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఉపాధ్యాయురాలి భర్త మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. దీంతో కూతురితో అద్దె ఇంట్లో ఉంటున్న ఉపాధ్యాయురాలు, అప్పటికే ఇద్దరు భార్యలను వదిలేసి ఒంటరిగా ఉంటున్న ఉపాధ్యాయుడు నాగేందర్‌కు దగ్గరైంది. సెలవు రోజుల్లో వచ్చి వెళ్తే భర్తను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో అనుమానం వచ్చి కూతురు ద్వారా ఆరా తీయగా అసలు విషయం తెలుసుకున్నాడు. ఈ విషయంపై రెండు నెలల క్రితం పాఠశాల హెచ్ఎంకు ఫిర్యాదు చేశాడు. తన భార్యకు దూరంగా ఉండాలని నాగేందర్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. స్పందించిన అధికారులు ఉపాధ్యాయురాలిని మరో పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించారు. అయినప్పటికి నాగేందర్, ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయురాలు భర్త కానిస్టేబుల్ ఈ నెల 18న శివరాత్రి బందోబస్తు డ్యూటీపై వేములవాడకు వెళ్లాడు. సోమవారం సెలవు ఉండటంతో మంగపేటలో ఉంటున్న భార్య, కూతురును చూసేందుకు వచ్చాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నాగేందర్.. ఉపాధ్యాయురాలి సెల్‌కు ఫోన్‌చేయగా భర్త లిఫ్ట్ చేశాడు. ‘నేను వస్తున్నా తలుపు తీసి ఉంచు’అని నాగేందర్ చెప్పాడు. తన అనుమానం నిజమైందని భావించిన భర్త తలుపు తీసి బాత్రూంలో దాక్కున్నాడు. నాగేందర్ ఇంట్లోకి రాగానే గడియ పెట్టి ఇంతరాత్రి ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్న క్రమంలో పడుకుని ఉన్న తన భార్య, నాగేందర్ ఇద్దరు కలిసి అతనిపైనే దాడి చేసేందుకు యత్నించారు. దీంతో భయపడిన అతను ఇంటి గడియపెట్టి బయటకు వచ్చి ఇరుగుపొరుగుకు చెప్పాడు. ఉదయం తాళ్లతో ఇద్దరిని బంధించి పోలీసులకు అప్పగించారు. -
మన్యంలో మళ్లీ అలజడి
సాక్షి, ములుగు/మంగపేట: ములుగు జిల్లాలో వారం రోజుల్లో రెండోసారి అలజడి రేగింది. మంగపేట మండలం నర్సింహసాగర్ పరిధి ముసలమ్మగుట్ట సమీపంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఆదివారం జరిగిన ఎదు రు కాల్పుల్లో మావోయిస్టు మణుగూరు ఏరియా దళ కమాండర్ సుధీర్ అలియస్ రాముతో పాటు ఒక దళ సభ్యుడు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ సంగ్రాంసింగ్ పాటిల్ తెలిపారు. వారి వద్ద ఒక ఎస్ఎల్ఆర్, రెండు ఇతర వెపన్స్ లభించినట్లు చెప్పారు. ఇటీవల వెంకటాపురం(కె) మండలం బోధాపురంలో టీఆర్ఎస్ నాయకుడు మాడూరి భీమేశ్వరావు(48)ను మావోలు హతమార్చారు. తాజా ఎన్కౌంటర్ ఘటన మన్యంలో మళ్లీ అలజడి నెలకొంది. వరుస ఘటనలు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2015 సెప్టెంబర్ 15న గోవిందరావుపేట మండలం మొద్దుగుట్టలో మొదటి ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో మావోయిస్టులు శృతి, విద్యాసాగర్ హతం కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అప్పటి నుంచి ఎన్కౌంటర్లు జరగలేదు. మధ్యమధ్యలో చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా సరిహద్దులోని వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో పలు చోట్ల మావోయిస్టుల పేరుతో కరపత్రాలు, టిఫిన్ బాంబులు లభ్యమయ్యాయి. అయినా ఆ స్థాయిలో ప్రాణనష్టం జరగలేదు. ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో ఈనెల 10న జరిగిన ఘటన కలకలం రేపింది. మావోయిస్టులు వెంకటాపురం(కె) మండలంలోని బోధాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు, పురుగు మందుల వ్యాపారి భీమేశ్వర్‌రావును కత్తులతో పొడిచి చంపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు యంత్రాంగం ముమ్మరంగా కూంబింగ్ చేపట్టింది. ఈక్రమంలో తిప్పాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యుడు చిన్నలక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు సోదాలు.. మావోయిస్టు మిలీషియా సభ్యుడు ఇచ్చిన పక్కా సమాచారం మేరకు కేంద్ర బలగాలు నర్సింహసాగర్, కొప్పుగుట్ట, దోమెడలోని దట్టమైన అడవుల్లో కూంబింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున అటవీలోకి ప్రవేశించిన పోలీసు బలగాలు మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఎన్కౌంటర్లో మరికొంత మంది తప్పించుకున్నారనే సమాచారం మేరకు గాలింపు మరింత ముమ్మరం చేశారు. ఏజెన్సీలో ఉలికిపాటు.. ఎన్కౌంటర్ సంఘటనతో ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. పోలీసులు ఏటూరునాగారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి, మంగపేట మండలాలతో పాటు పొరుగున ఉన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం, పినపాక మండలాల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జల్లెడపడుతున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. -
ఆత్మహత్యకు యత్నం, కాపాడిన ఎస్ఐ
సాక్షి, మంగపేట (జయశంకర్ భూపాలపల్లి): మంగపేట మండల కేంద్రంలోని పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలోకి దిగి ఆత్మహత్యకు యత్నించిన కమలాపురం బిల్ట్ ప్యాక్టరీ కార్మికుడు బోజాట్ల నర్సింహారావు అనే వ్యక్తిని ఎస్సై వెంటేశ్వర్రావు బుధవారం కాపాడారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్న నర్సింహారావు ఆత్మహత్య చేసుకునేందుకు నదిలోకి దిగాడు. అక్కడే చేపలు పడుతున్న వ్యక్తి ఆయను గమనించి వివరాలు ఆరా తీశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తాను చనిపోతే ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చి సమస్య తీరుతుందని చెప్పాడు. వెంటనే చేపలు పడుతున్న వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని నర్సింహారావును కాపాడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సంఘటనపై కుటుంబ సభ్యులను విచారించగా నర్సింహారావు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులకు ఎస్సై కౌన్సిలింగ్ ఇచ్చి ఆయనను అప్పగించారు. -
ఇద్దరిని బలిగొన్న ఇసుక లారీ
మంగపేట : మండలంలోని వాడగూడెం బస్‌స్టాప్ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటనలో అకినేపల్లిమల్లారం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ గారపాటి వీర్రాజు(వీరబాబు)(42) అదే గ్రామానికి చెందిన శెట్టిపెల్లి లవకుమార్(పండు) (27) అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం మృతి చెందారు. ఒకే గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ వీర్రాజు, తన ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న లవకుమార్‌తో కలిసి తన ద్విచక్రవాహనంపై పనిమీద మంగపేటలోని జాన్‌డీయర్ ట్రాక్టర్ షోరూంకు వెలుతున్నారు. మార్గమధ్యలోని వాడగూడెం బస్టాప్ సమీపంలోని మూలమలుపు వద్ద మంగపేట వైపు నుంచి రాజుపేట వైపు వెళుతున్న లారీ అతివేగంగా వచ్చి రోడ్డుకు ఎడమవైపునగల మూలమలుపు సూచిక బోర్డును ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అదేవేగంతో రోడ్డుకు పక్కనగల గొయ్యిలోకి వెళ్లి తాటిచెట్టును ఢీకొని నిలిచిపోయింది. అతివేగంగా లారీ ఢీకొనడంతో వీర్రాజు, లవకుమార్ 10 మీటర్లు పైకి ఎగిరి రోడ్డుపక్కన గల వరిచేసులో పడిపోయారు. వీర్రాజు అక్కడికక్కడే మృతి చెందగా లవకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించినా అది రావడం ఆలస్యం కావడంతో లవకుమార్ మృతి చెందినట్లు వారు తెలిపారు. విషయం తెలిసిన అకినేపల్లిమల్లారం, కత్తిగూడెం, దుగినేపల్లి, రాజుపేట, రమనక్కపేట తదితర గ్రామాల నుంచి సుమారు 6 వందల మంది తరలివచ్చి విగతజీవులుగా పడిఉన్న ఇద్దరిని చూసి కంటనీరు పెట్టుకున్నారు. ఇసుకల లారీల వేగానికి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఇసుకలారీల రాకపోకలను నిలిపివేయాలని డి మాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ వారిని కోల్పోయామనే ఆవేశంలో ఇద్దరిని బలి తీసుకున్న లారీపై పెట్రోలుపోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఏటూరునాగారం ఎస్సై కిరణ్‌కుమార్ వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు వీర్రాజుకు భార్య వనిత, ఇద్దరు కూతుళ్లు, లవకుమార్‌కు తల్లిదండ్రులు, అన్న ఉన్నారు. -
ఆందోళనకు దిగిన బిల్ట్ కార్మికులు
l కార్మికుడి మృతిపై ఆగ్రహం l యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ మంగపేట : మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్‌కు చెందిన కార్మికుడు కాసో జు పరమేశ్వర్రావు మృతికి యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. గుండెపోటుతో పరమేశ్వర్ బుధ వారం రాత్రి మృతి చెందిన విషయం విది తమే. కొంత కాలంగా పరిశ్రమ మూతపడి వేతనాలు రాకపోవడంతో మనోవేదనతో పరమేశ్వర్రావు మృతి చెందాడని కార్మికులు ఆరో పించారు. దీనికి బిల్ట్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం కార్మికులు బూర్గంపాడ్ ప్రధాన రోడ్డుపై ఉన్న ఎర్రవాగు బ్రిడ్జిపై ధర్నా నిర్వహించారు. బిల్ట్ మూతపడి రెండేళ్లు గడుస్తున్నదని, ఉపాధి కరువై, వేతనాలు లేక వైద్యం చేయిం చుకోలేని పరిస్థితిలో కార్మికులు మృతి చెందుతుంటే యాజమాన్యం పట్టించుకో కపోవడం సరికా దని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 నెలలుగా వేతనాలు, వైద్యసేవలు నిలిపివేయడంతో గత 35 ఏళ్ల నుంచి ఫ్యాక్టరీలో పనిచేసి కాలుష్యం బారినపడి అనారోగ్యంతో వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారని ఆరోపిం చారు. ఇప్పటికే ఐదుగురు కార్మికులు మృతి చెందారని తెలిపారు. త్వరలోనే వేతనాలు ఇప్పిస్తామని మంత్రుల హామీలు ఇచ్చి నెలలు అవుతున్నా ఎలాంటి పురోగతి లేదన్నారు. పరమేశ్వర్రావు మృతికి బిల్ట్ యాజ మాన్యమే పూర్తి బాధ్యత వహించి మృతుని కుటుం బా న్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మేరకు ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది తో చేరుకుని సర్దిచెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కార్య క్రమంలో వడ్లూరి రాంచందర్, యలమంచిలి శ్రీనివాస్, వంగేటి వెంకట్‌రెడ్డి తదితరులతో పాటు పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
మలేరియా జ్వరంతో మహిళ మృతి
మంగపేట : ఏజెన్సీ పరిధిలోని మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెంది న పుట్ట మల్లిక(30) మలేరియా జ్వరంతో గురువారం మృతి చెందింది. నాలుగు రోజు లుగా మల్లికకు జ్వరం వస్తుండంతో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో చూపించగా వైద్యులు మలేరియా జ్వరంగా గుర్తించి మందులు అందించి ఇంటికి పంపించారు. మళ్లీ జ్వరం తీవ్రం కావడంతో ఏటూరునాగారం ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొం దుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ట్రాక్టర్ బోల్తా: 8 మందికి తీవ్రగాయాలు
మంగపేట(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా మంగపేట మండలం బోరునరసాపురంలో మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్ బోల్తాపడి 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందినవారు. చుంచుపల్లి ఇసుక క్వారీలో ఇసుక లోడ్ చేసుకుని వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను మంగపేట ఆస్పత్రికి తరలించారు. -
డీసీఎం,బైక్ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
మంగపేట (వరంగల్ జిల్లా) : మంగపేట మండలం బ్రాహ్మణపల్లి, రాజుపేట గ్రామాల మధ్యలో మూలమలుపు వద్ద డీసీఎం వాహనం, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రమణక్కపేట గ్రామానికి చెందిన వెంకన్న(29), బాలు(27) అనే ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. బాలుకు చెయ్యి విరగగా, వెంకన్నకు తల పగిలింది. చికిత్స నిమిత్తం వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా వెంకన్న పరిస్థితి విషమంగా ఉంది. స్వగ్రామం నుంచి మణుగూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాబాయి చేతిలో కొడుకు హతం
మంగపేట (వరంగల్) : నువ్వు పంటకు నష్టం కలిగించటంపై ముదిరిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. వరంగల్ జిల్లా మంగపేట మండలంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని దోమెడ పంచాయతీలోని గొత్తికోయల ఆవాసం రాళ్లగూడెంకు చెందిన మడకం సంతోష్(30), అతని పినతండ్రి జోగయ్యకు మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. నువ్వు పంట విషయమై గతంలో ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. కత్తి పట్టుకుని చంపేస్తానంటూ వస్తున్న సంతోష్‌ను జోగయ్య గొడ్డలితో తలపై కొట్టటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. -
వైద్యసేవల కోసం గ్రామస్తుల ఆందోళన
వరంగల్ : వరంగల్ జిల్లాలోని మంగపేట ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉదయం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సిబ్బంది సమయపాలన పాటించకుండా ఇష్టారీతిన వస్తుండటంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. ఆరోగ్య కేంద్రానికి వైద్యులు, సిబ్బంది సరిగా రావడం లేదని వారు ఆరోపించారు. సకాలంలో వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు వాపోయారు. వైద్యులు వేళకు వచ్చి సేవలు అందించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా అధికారులు పరిస్థితిని చక్కదిద్ది, చర్యలు తీసుకోవాలని స్తానికులు డిమాండ్ చేశారు. (మంగపేట)