లవకుమార్ మృతదేహం, వీర్రాజు మృతదేహం
మంగపేట : మండలంలోని వాడగూడెం బస్‌స్టాప్ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటనలో అకినేపల్లిమల్లారం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ గారపాటి వీర్రాజు(వీరబాబు)(42) అదే గ్రామానికి చెందిన శెట్టిపెల్లి లవకుమార్(పండు) (27) అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం మృతి చెందారు. ఒకే గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ వీర్రాజు, తన ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న లవకుమార్‌తో కలిసి తన ద్విచక్రవాహనంపై పనిమీద మంగపేటలోని జాన్‌డీయర్ ట్రాక్టర్ షోరూంకు వెలుతున్నారు. మార్గమధ్యలోని వాడగూడెం బస్టాప్ సమీపంలోని మూలమలుపు వద్ద మంగపేట వైపు నుంచి రాజుపేట వైపు వెళుతున్న లారీ అతివేగంగా వచ్చి రోడ్డుకు ఎడమవైపునగల మూలమలుపు సూచిక బోర్డును ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అదేవేగంతో రోడ్డుకు పక్కనగల గొయ్యిలోకి వెళ్లి తాటిచెట్టును ఢీకొని నిలిచిపోయింది. అతివేగంగా లారీ ఢీకొనడంతో వీర్రాజు, లవకుమార్ 10 మీటర్లు పైకి ఎగిరి రోడ్డుపక్కన గల వరిచేసులో పడిపోయారు. వీర్రాజు అక్కడికక్కడే మృతి చెందగా లవకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించినా అది రావడం ఆలస్యం కావడంతో లవకుమార్ మృతి చెందినట్లు వారు తెలిపారు.
విషయం తెలిసిన అకినేపల్లిమల్లారం, కత్తిగూడెం, దుగినేపల్లి, రాజుపేట, రమనక్కపేట తదితర గ్రామాల నుంచి సుమారు 6 వందల మంది తరలివచ్చి విగతజీవులుగా పడిఉన్న ఇద్దరిని చూసి కంటనీరు పెట్టుకున్నారు. ఇసుకల లారీల వేగానికి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఇసుకలారీల రాకపోకలను నిలిపివేయాలని డి మాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ వారిని కోల్పోయామనే ఆవేశంలో ఇద్దరిని బలి తీసుకున్న లారీపై పెట్రోలుపోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఏటూరునాగారం ఎస్సై కిరణ్‌కుమార్ వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు వీర్రాజుకు భార్య వనిత, ఇద్దరు కూతుళ్లు, లవకుమార్‌కు తల్లిదండ్రులు, అన్న ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment