ఈ జంగ్...గిటార్ కింగ్!
ఆ కుర్రవాడు సరదాగా గిటార్ వాయించడం మొదలుపెట్టాడు. ఆస్ట్రియాకు చెందిన థామస్ లీబ్, ఇంగ్లండ్‌కు చెందిన మార్టిన్ టేలర్... వీరంతా ఆ కుర్రవాడి గిటార్ ప్రదర్శన యూట్యూబ్‌లో చూసి ‘ఆసమ్’ అంటూ చప్పట్లు కొట్టారు. వినసొంపైన అతడి గిటార్ విన్యాసం ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది...
తన శరీరంతో సమానంగా ఉన్న గిటార్‌తో ప్రపంచాన్ని సమ్మోహనపరచిన ఆ వ్యక్తి పేరు సుంఘాజంగ్. అతడిని చూసినవారంతా చైల్డ్ ప్రాడిజీ అంటుంటారు. జంగ్ తన గురించి ఇలా వివరించాడు...
‘‘మా నాన్నగారు అప్పుడప్పుడు గిటార్ వాయిస్తుండేవారు. బహుశ అది చూసే నాకు దాని మీద ఆసక్తి కలిగిందో ఏమో, మూడవతరగతి చదువుతున్నప్పు డే, మా నాన్నగారిని గిటార్ నేర్పించమని అడిగాను. ఆయన బేసిక్స్ నేర్పారు. ఆ తరవాత నాకు నేనుగా నేర్చుకున్నాను. మా ఇంట్లో ఉన్న గిటారు చాలా పెద్ద గిటారు కావడం వల్ల వాయించేటప్పుడు చాలా ఇబ్బందిపడేవాడిని. తీగెలను నొక్కుతుంటే చేతులు బాగా నొప్పి చేసేవి. అయినప్పటికీ ఎంతో కష్టపడి పాటలు నేర్చుకునేవాడిని. ఒక పాట పూర్తిగా వచ్చిన వెంటనే మరో పాట వాయించాలనిపిం చేది. అప్పుడే అనుకున్నాను, నేను ఎప్పటికీ గిటార్‌ని విడిచిపెట్టకూడదని.
గిటార్ మీద వచ్చే విదేశీగీతాలు విని వాటినే ప్రాక్టీస్ చేయడం వలన, కొరియన్ పాప్ సాంగ్స్, సింగర్స్ నాకు పెద్దగా తెలియదు. నాకు ఫింగర్స్టయిల్ పాటలే బాగా నచ్చుతాయి. క్లాసికల్ అంతగా ఇష్టపడను. అలాగే లిరికల్ మెలడీ ట్యూన్స్ అంటే చాలా ఇష్టం. బ్రైట్ ట్యూన్స్ కూడా ఇష్టమే. గిటార్ మీద వేరేవాళ్లు వాయించిన మెలోడియస్ ట్యూన్స్ విని నేర్చుకుంటున్నాను. ఈ మధ్యే ‘నైట్ ఫ్లయిట్’ అనే ఆల్బమ్ కంపోజ్ చేసి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను. దానికి పెద్దపెద్ద వారి దగ్గర నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. నేను ప్రతి రోజూ మూడుగంటల పాటు సాధన చేస్తాను. చదువు ప్రధానం కనుక, హోమ్‌వర్క్ పూర్తయ్యాకే ప్రాక్టీస్ ప్రారంభిస్తాను. ప్రాక్టీస్ చేయనప్పుడు స్నేహితులతో ఆడుకుంటాను.
సెల్మా గిటార్ (సెల్మా బ్రాండ్ గిటార్లు తయారుచేసే సంస్థ) కంపెనీ నా వీడియోలు చూసి, నా పాటలను స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. నేను వాయించే పెద్ద గిటార్ చూసి, నా సైజ్‌కి సరిపడా గిటార్‌ను తయారుచేసి ఇచ్చారు. కొరియాలో మంచి గిటార్ కళాకారుడిగా పేరు సాధించాలన్నది నా ఆశయం.’’
- డా.వైజయంతి
సముద్రమంటే ఇష్టం...
కొరియాలో 1996, సెప్టెంబర్ 2వ తేదీన పుట్టిన సుంఘాజంగ్ ఎకోస్టిక్ ఫింగర్స్టయిల్ గిటారిస్ట్. యూట్యూబ్ ద్వారా అత్యున్నతస్థాయికి ఎదిగాడు. మే, 2013 నాటికి ఇతని గిటార్ విన్యాసాన్ని 687 మిలియన్ల మంది వీక్షించారు. 1,950,000 మంది సబ్‌స్క్రైబ్ చేశారు. అల్టిమేట్ గిటార్.కామ్ పేజీలో అతని ట్యూన్స్‌ని రింగ్‌టోన్స్‌గా డౌన్లోడ్ చేసుకోవడానికి అనువుగా ఉంచారు. యూ ట్యూబ్‌లో ఇతడికి 15 అవార్డులు వచ్చాయి. ‘పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్’ మ్యూజిక్‌ని కొన్ని మిలియన్లమంది వీక్షించారు.
ఏ పాటనైనా కేవలం మూడు రోజులు ప్రాక్టీస్ చేసి, తనకు తానే రికార్డ్ చేసుకుని, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాడు. 2010లో నార్షా సోలో ఆల్బమ్‌కి చేశాడు. ట్రేస్ బండీతో కలిసి అమెరికా, స్కాండినేవియా, జపాన్లలో ప్రదర్శనలిచ్చాడు. ఇప్పటివరకు మొత్తం 18 ఆల్బమ్స్ స్వరపరిచాడు జంగ్. 2010లో ‘పర్ఫెక్ట్ బ్లూ’ 2011లో ‘ఐరనీ’ 2012లో ‘ద డ్యూయెట్స్’ 2013లో పెయింట్ ఇట్ ఇకోయిస్టిక్ అనే ఆల్బమ్‌లు విడుదల చేశాడు. 2011లో ‘ది సూయిసైడ్ ఫోర్కాస్ట్’ అనే ఒక కొరియన్ సినిమాలో నటించాడు.
కొరియన్ టెలివిజన్‌లో పాపులర్ టీవీ షో అయిన ‘స్టార్ కింగ్’లో ఇతడితో ఇంటర్వ్యూ చేసినప్పుడు... గిటార్ ప్రాడి జీ, అగస్ట్ రష్ ఇన్ కొరియా... అని పిలిచారు. 2007లో సుమారు 50 గంటల క్లాసికల్ గిటార్ లెసన్స్ చెప్పాడు జంగ్. ఈ మధ్యనే డ్రమ్స్, జాజ్, పియానో కూడా నేర్చుకుంటున్నాడు. జంగ్‌కి సముద్రమంటే చాలా ఇష్టం కావడం వల్ల తన బ్లాగ్‌కి ‘బ్లూ సీ’ అని పేరు పెట్టుకున్నాడు.