పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: రాయలసీమ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. నారాయణ డిమాండ్ చేశారు. సీమ నీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తిచేయాలంటూ బుధవారం తిరుపతి అర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో సాముహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా మిగులు జలాలను నల్గొండ, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలకు కేటాయించాలని కోరారు.
మిగులు జలాల సరఫరాలో సరైన ప్రాతినిథ్యం లేదన్నారు. మిగులు జలాలకోసం మొదటి నుంచీ సీపీఐ ఆందోళనలు చేస్తోందన్నారు. రాష్ట్రం కలిసివున్నా, విడిపోయినా నీటి సమస్యమాత్రం ఉంటుంద న్నారు. సీమ జిల్లాల్లో సాగునీటి సాధన కోసం ఈనెల 17న అన్ని కలెక్టరేట్ల కార్యాలయాలను ఎర్రజెండాలతో దిగ్బంధనం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గాడిదలు కాయడానికి మాత్రమే పనికొస్తుందని విమర్శించారు.
పెట్రోల్, డీజల్, విద్యుత్ చార్జీలు పెంచేశారని తెలిపారు. భవిష్యత్‌లో ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని, అవసరమైతే ఢిల్లీలో కూడా అందోళన చేస్తామని హెచ్చరించారు. సీపీఐ నాయకులు వెంకయ్య, హరికృష్ణ, పెంచలయ్య మాట్లాడుతూ కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయకపోవడం అన్యాయమన్నారు. 1983లో చేపట్టిన హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు నేటి కీ పూర్తికాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. రాధాకృష్ణ, మురళి, నాగరాజు, సుబ్రమణ్యం, జయలక్ష్మి, చిన్నికృష్ణ, గురవయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.