మరో ఐదు రోజులు వర్షాలు
సాధారణం కంటే తగ్గిన ఎండలు
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షద్వీప్ వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటం... కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతున్నాయి. ఉపరితల ద్రోణి కారణంగా మరో 5 రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం డెరైక్టర్ వై.కె.రెడ్డి ఆదివారం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. గత 24 గంటల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా చింతకాని, నల్లగొండ జిల్లా కంపాసాగర్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
సూర్యాపేట, అశ్వారావుపేటల్లో 4 సెం.మీ. వర్షం కురిసింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3 నుంచి 6 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణంగా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా... 34 డిగ్రీలు మాత్రమే ఉంది. హైదరాబాద్, హకీంపేట్, మహబూబ్‌నగర్‌లలో 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తారంగా వర్షాలు: రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో (శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకూ) కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం అత్యధికంగా 98.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాబోయే 48 గంటల్లో జడివాన: కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా వచ్చే 48 గంటల్లో జడివాన లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. అండమాన్‌లో నైరుతీ రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీనివల్ల ఊహించిన విధంగానే ఈనెల 30వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళ చేరతాయని తెలిపారు.