Mazagon Dock Shipbuilders Limited
-
సిద్ధమైన యుద్ధనౌక
సింథియా: ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సారథ్యంలో ప్రాజెక్ట్ 17–ఏ ఫ్రిగేట్స్‌లో భాగంగా 7వ యుద్ధనౌక మహేంద్రగిరిని సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నారు. అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, ఫ్లాట్‌ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధనౌకగా రూపొందింది. పూర్తి స్వదేశీ రక్షణ సామర్థ్యంతో భవిష్యత్‌లో భారతదేశం గొప్ప నావికా వారసత్వానికి చిహ్నంగా నిలవనుందని తయారీదారులు అభివర్ణించారు. ప్రాజెక్ట్–17ఏ కింద మొత్తం 4 నౌకలు మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సారథ్యంలో నిర్మించగా.. మరో 3 నౌకలను జీఆర్ఎస్ఈ ద్వారా నిర్మిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ దృఢ నిబద్ధతకు అనుగుణంగా ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో ద్వారా షిప్ అంతర్గత నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. దేశం గర్వించదగ్గ యుద్ధనౌకగా మహేంద్రగిరి రూపొందినట్టు ఇండియన్ నేవీ వర్గాలు తెలిపాయి. ఈ యుద్ధనౌకను ఉప రాష్ట్రపతి జయదీప్ ధన్కర్ భార్య సుదేశ్ ధన్కర్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. -
20న ‘వాగ్షీర్’ జలప్రవేశం
ముంబై: మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) నిర్మించిన వాగ్షీర్ జలాంతర్గామి ఈ నెల 20న ముంబై సముద్ర తీరంలో జలప్రవేశం చేయనుందని అధికారులు శుక్రవారం తెలిపారు. పీ75 స్కార్పిన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరో సబ్‌మెరైన్‌ను నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు రూ.46,000 కోట్ల విలువైన ఆర్డర్ దక్కిందని, ఇందులో 6 సబ్‌మెరైన్ ప్రాజెక్టులు, 15 బ్రేవో డిస్ట్రాయర్స్, 17 అల్ఫా స్టీల్త్ ఫ్రిగేట్స్ ఉన్నాయని ఎండీఎల్ చైర్మన్, ఎండీ నారాయణ్ ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 4 జలాంతర్గాములు, ఒక డిస్ట్రాయర్స్ సరఫరా చేశామని వివరించారు. పీ75 స్కార్పిన్ ప్రాజెక్టులో వాగ్షీర్ ఆఖరి జలాంతర్గామి. ఐదో జలాంతర్గామి అయిన ‘వగీర్’ సీ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎన్ఎస్ కల్వరీ, ఐఎన్ఎస్ ఖాందేరి, ఐఎన్ఎస్ కరాంజ్, ఐఎన్ఎస్ వేలా సబ్మెరైన్లు ఇప్పటికే విధుల్లో చేరాయి. -
చైనాకు చెక్: రూ. 50 వేల కోట్లతో ప్రాజెక్ట్-75కి ఆమోదం
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా రోజుకో విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు భారత్ అన్ని రకాలుగా సిద్ధవవుతోంది. ఈ క్రమంలో భారత నావికా దళం కోసం తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్-75కి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా 50 వేల కోట్ల రూపాయలతో ఆరు జలంతర్గాముల నిర్మాణానికి తుది అనుమతి లభించింది. మేకిన్ ఇండియాలో భాగంగా ఈ జలంతార్గాములను నిర్మించనున్నారు. ఈ క్రమంలో రెండు భారతీయ కంపెనీలు, ఓ విదేశీ కంపెనీతో కలిసి పనిచేయడానికి అనుమతిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్పీఎఫ్)ను జారీ చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన డిఫెన్స్ సమావేశంలో ఆర్‌ఎఫ్‌పీకు క్లియరెన్స్ ఇచ్చారు. మజాగావ్ డాక్స్ (ఎండీఎల్), ప్రైవేట్ షిప్-బిల్డర్ లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) లకు రక్షణ శాఖ ఆర్ఎఫ్పీ జారీ చేసింది. ఈ రెండు కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా క్రింద కలిసి పని చేస్తాయి. అంతేకాక భారత వ్యూహాత్మక భాగస్వాములు అయిన ఎండీఎల్, ఎల్ఆండ్టీ కపెంనీలు.. సాంకేతిక, ఆర్థిక బిడ్లను సమర్పించడానికి ఎంపిక చేసిన ఐదు విదేశీ షిప్‌యార్డులలో ఒకదానితో జతకడతాయి. ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరు అధునాతన జలంతర్గాములను మజగావ్ డాక్‌యార్డ్‌లో వీటిని నిర్మించనున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్కార్పీన్ క్లాస్ జలంతర్గాముల కంటే దాదాపు 50శాతం పెద్దదైన ఈ ప్రాజెక్టు కింద ఆరు సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములను నిర్మించాలని భారత నావికాదళం భావిస్తోంది. ఈ జలాంతర్గాముల తయారీలో 95 శాతం దేశీయ వస్తువుల వినియోగించనున్నారు. మారిటైమ్ ఫోర్స్ స్పెసిఫికేషన్ల ప్రకారం.. జలాంతర్గాముల్లో హెవీ డ్యూటీ ఫైర్‌పవర్, కనీసం 12 ల్యాండ్ అటాక్ క్రూయిస్ క్షిపణులు (ఎల్ఐసీఎం), యాంటీ షిప్ క్రూయిస్ క్షిపణులు (ఏఎస్‌సీఎం) ఉండాలి. కొత్తగా అభివృద్ది చేయబోయే జలంతర్గాములు సముద్రంలో 18 హెవీవెయిట్ టార్పెడోలను మోసుకెళ్లే, ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని నేవీ పేర్కొంది. తర్వాతి తరం స్కార్పియన్ శ్రేణి కంటే ఎక్కువ ఫైర్‌పవర్ అవసరం. ప్రస్తుతం భారత నావికాదళంలో 140కి పైగా జలాంతర్గాములు, ఉపరితల యుద్ధ నౌకలు ఉన్నాయి. పాక్ నావికాదళంలో 20 మాత్రమే ఉన్నాయి. మరోవైపు హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నావికాదళాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి భారత నావికాదళం అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నది. చదవండి: ఇండో – పసిఫిక్ చౌరస్తా! -
మజగావ్ డాక్ లిస్టింగ్ అదరహో
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ షేర్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఈ షేర్ ఇష్యూ ధర రూ.145తో పోల్చితే 49 శాతం లాభంతో రూ. 216 వద్ద బీఎస్ఈలో లిస్టయింది. చివరకు 19 శాతం లాభంతో రూ. 173 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,489 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 36 లక్షలు, ఎన్ఎస్ఈలో 4 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ కంపెనీ ఐపీఓ 157 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. పేలవంగా యూటీఐ ఏఎమ్‌సీ లిస్టింగ్ యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో బలహీనంగా లిస్టయ్యాయి. బీఎఎస్‌ఈలో యూటీఐ ఏఎమ్‌సీ షేర్ ఇష్యూ ధర రూ. 554తో పోల్చితే 12 శాతం నష్టంతో రూ.490 వద్ద లిస్టయింది. ఇంట్రడేలో 15 శాతం నష్టంతో రూ. 471 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 14 శాతం నష్టంతో రూ. 477 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6,043 కోట్లుగా ఉంది. బీఎస్ఈలో 13.7 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో కోటికి పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ ఐపీఓ 2.3 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. -
ఐపీవో స్ట్రీట్: మజగాన్ డాక్, యూటీఐ ఏఎంసీ
ప్రభుత్వ రంగ దిగ్గజం మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం(29న) ప్రారంభం కానుంది. గురువారం(అక్టోబర్ 1న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 135-145. ఐపీవోలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 15.17 శాతం వాటాకు సమానమైన దాదాపు 3.06 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా ప్రభుత్వం రూ. 444 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. రక్షణ రంగానికి చెందిన ఈ కంపెనీ ఉద్యోగులకు 3.45 లక్షల షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 103 షేర్లకు దరఖాస్తు చేసకోవలసి ఉంటుంది. కంపెనీ వివరాలు రక్షణ రంగ పీఎస్‌యూ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్.. 40,000 డీడబ్ల్యూటీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. తద్వారా ఓడలు, సబ్మెరైన్లను రూపొందిస్తోంది. రక్షణ శాఖకు అవసరమయ్యే యుద్ధనౌకల తయారీ, మరమ్మతులను చేపడుతోంది. వాణిజ్య ప్రాతిపదికన ఇతర క్లయింట్లకు వెస్సల్స్‌ను తయారు చేస్తోంది. 2006లో కంపెనీ మినీరత్న హోదాను పొందింది. కంపెనీ రుణరహితంకావడంతోపాటు.. ముంబై తీరంలో ఉండటంతో అధిక అవకాశాలు పొందుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్డర్లను త్వరగా పూర్తిచేయగలగడం, తద్వారా వేగంగా క్యాష్‌ఫ్లోను సాధించగలగడం వంటి అంశాలు కంపెనీ భవిష్యత్‌పై ప్రభావం చూపే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. రక్షణ రంగ బడ్జెట్ ఆలస్యంకావడం లేదా ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడటం ద్వారా వ్యయాలు పెరగడం వంటి ప్రతికూలతలు ఎదురుకావచ్చని తెలియజేశారు. యూటీఐ ఏఎంసీ నిర్వహణలోని ఆస్తుల రీత్యా దేశంలోనే రెండో పెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. యూటీఐ ఏఎంసీ పబ్లిక్ ఇష్యూ మంగళవారం(29న) ప్రారంభం కానుంది. గురువారం(అక్టోబర్ 1న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 552-554. ఐపీవోలో భాగంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఎస్బీఐ, ఎల్ఐసీ, బీవోబీ, పీఎన్బీ, టీ రోవ్ ప్రైస్ ఇంటర్నేషనల్ వాటాలు విక్రయించనున్నాయి. మొత్తం 3.9 కోట్ల షేర్లవరకూ ఆఫర్ చేస్తున్నాయి. ఇది కంపెనీ ఈక్విటీలో 30.75 శాతం వాటాకు సమానంకాగా.. తద్వారా రూ. 2,160 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేసకోవలసి ఉంటుంది. అర్హతగల ఉద్యోగులకు 2 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. కంపెనీ వివరాలు యూటీఐ ఏఎంసీలో ప్రస్తుతం ఎస్బీఐ, ఎల్ఐసీ, పీఎన్బీ, బీవోబీ 18.24 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. టీ రోవ్ ప్రైస్‌కు 26 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఐపీవో ద్వారా ఎస్బీఐ, బీవోబీ, ఎల్ఐసీ 8.25 శాతం, టీ రోవ్, పీఎన్బీ 3 శాతం చొప్పున వాటా విక్రయించనున్నాయి. 2019లో ఈపీఎఫ్‌వో నిధులలో 55 శాతం నిర్వహణకు యూటీఐ ఏఎంసీ అనుమతిని పొందింది. గత కొన్నేళ్లుగా యూటీఐ ఏఎంసీ ఉత్తమ రిటర్నులు, మార్జిన్లను సాధిస్తున్నట్లు శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ నిపుణులు నిరాలీ షా పేర్కొన్నారు. మార్కెట్ క్యాప్ టు ఈక్విటీ QAAUM ప్రకారం చూస్తే 18 శాతంగా నమోదైనట్లు తెలియజేశారు. ప్రస్తుత ఐపీవో ధర కంటే చౌకగా ఈ ఏడాది కంపెనీ ఉద్యోగులకు షేరుకి రూ. 728 ధరలో వాటాలను కేటాయించినట్లు తెలియజేశారు. -
మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్‌లో
1125 పోస్టులు కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడ్‌లలోని స్కిల్డ్, సెమీ స్కిల్డ్ గ్రేడ్ టెక్నికల్, ఆపరేటివ్ పోస్టులను రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 21 రకాల ఉద్యోగాలు (1125) ఉన్నాయి. ఇందులో ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కాంపోజిట్ వెల్డర్, యుటిలిటీ హ్యాండ్ తదితర పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలను మూడు కేటగిరీలుగా విభజించారు. అవి.. ఐ. మిస్ట్రీ గ్రేడ్: ఇందులో ఒకే పోస్టు (సెకండ్ క్లాస్ మాస్టర్-1) ఉంది. ఐఐ. స్కిల్డ్ గ్రేడ్-ఐ: ఇందులో 18 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ డ్రాట్స్‌మ్యాన్-12; జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ (మెకానికల్)-10; జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్)-5; జూనియర్ క్యూ.సీ. ఇన్స్పెక్టర్ (మెకానికల్)-11; జూనియర్ క్యూ.సీ. ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్)-1; స్టోర్ కీపర్-3; ఫిట్టర్-158; స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్-133; పైప్ ఫిట్టర్-130; ఎలక్ట్రానిక్ మెకానిక్-49; ఎలక్ట్రీషియన్-144; డీజిల్ క్రేన్ ఆపరేటర్-1; మెషినిస్ట్-8; కంప్రెసర్ అటెండెంట్-3; పెయింటర్-51; కార్పెంటర్-30; కాంపోజిట్ వెల్డర్-138; రిగ్గర్-69:ఐఐఐ. సెమీ స్కిల్డ్ గ్రేడ్-ఐ: ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. యుటిలిటీ హ్యాండ్ (సెమీ స్కిల్డ్)-103; చిప్పర్ గ్రైండర్-65. విద్యార్హత, అనుభవం: దాదాపు అన్ని రకాల ఉద్యోగాలకు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటీస్ ఉండాలి. పెయింటర్, కార్పెంటర్, కాంపోజిట్ వెల్డర్ పోస్టులకు 8వ తరగతితోపాటు అప్రెంటీస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అన్ని పోస్టులకూ ఏడాది పూర్వానుభవం అవసరం. వయోపరిమితి: 2016, ఆగస్టు 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టం 33 ఏళ్లు మించకూడదు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగుల్లో జనరల్ అభ్యర్థులకు 10 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు; ఓబీసీలకు 13 ఏళ్లు సడలింపు ఉంటుంది. వేతనం మిస్ట్రీ గ్రేడ్ పోస్టులకు మొదటి ఏడాది నెలకు రూ.10 వేలు, రెండో ఏడాది నెలకు రూ.10,100 బేసిక్ పే చెల్లిస్తారు. దీంతోపాటు ఇండస్ట్రియల్ డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, సీపీఎఫ్, గ్రాట్యుటీ తదితర భత్యాలు ఉంటాయి. స్కిల్డ్ గ్రేడ్-1 పోస్టులకు మొదటి ఏడాది నెలకు రూ.7,500, రెండో ఏడాది నెలకు రూ.7,575 బేసిక్ పేతోపాటు అలవెన్సులు ఉంటాయి. సెమీ స్కిల్డ్ గ్రేడ్-1 పోస్టులకు మొదటి ఏడాది నెలకు రూ.6,000, రెండో ఏడాది నెలకు రూ.6,060 బేసిక్ పేతోపాటు అలవెన్సులు ఉంటాయి. ఎంపిక విధానం: స్కిల్డ్ గ్రేడ్-1లోని మొదటి ఆరు రకాల ఉద్యోగాలకు రాత పరీక్ష; మిగిలిన స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పోస్టులకు రాత పరీక్షతోపాటు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారినే ట్రేడ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనా దరఖాస్తును హిందీ/ఇంగ్లిష్/మరాఠీలో పెద్ద అక్షరాలతో (క్యాపిటల్/బ్లాక్ లెటర్స్‌తో) నింపి, సెల్ఫ్ అటెస్ట్ చేసిన అన్ని ధ్రువీకరణ పత్రాల నకళ్లతోపాటు అప్లికేషన్ ఫీజు చలాన్‌ను జత చేసి కింది అడ్రస్‌కు కొరియర్/పోస్టులో పంపాలి. ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే దరఖాస్తులను విడివిడిగా పంపాలి. దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.140 (రూ.100 ప్రాసెసింగ్ ఫీజు, రూ.40 బ్యాంక్ చార్జీ) చెల్లించాలి. చిరునామా: డీజీఎం (హెచ్ఆర్-రిక్రూట్మెంట్-ఎన్ఈ), రిక్రూట్మెంట్ సెల్, సర్వీస్ బ్లాక్-మూడో అంతస్తు, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్, డాక్ యార్డ్ రోడ్, ముంబై-400010. ముఖ్య తేదీలు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 2016, సెప్టెంబర్ 1. రాత పరీక్ష తేదీ: రాత పరీక్షకు అర్హులైన అభ్యర్థుల వివరాలను సంస్థ వెబ్సైట్/నోటీస్ బోర్డులో 2016, సెప్టెంబర్ 21న అందుబాటులో ఉంచుతారు. వెబ్సైట్: www.mazagondock.gov.in