
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ షేర్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఈ షేర్ ఇష్యూ ధర రూ.145తో పోల్చితే 49 శాతం లాభంతో రూ. 216 వద్ద బీఎస్‌ఈలో లిస్టయింది. చివరకు 19 శాతం లాభంతో రూ. 173 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,489 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో 36 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 4 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ కంపెనీ ఐపీఓ 157 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది.
పేలవంగా యూటీఐ ఏఎమ్‌సీ లిస్టింగ్
యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో బలహీనంగా లిస్టయ్యాయి. బీఎఎస్‌ఈలో యూటీఐ ఏఎమ్‌సీ షేర్ ఇష్యూ ధర రూ. 554తో పోల్చితే 12 శాతం నష్టంతో రూ.490 వద్ద లిస్టయింది. ఇంట్రడేలో 15 శాతం నష్టంతో రూ. 471 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 14 శాతం నష్టంతో రూ. 477 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6,043 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో 13.7 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో కోటికి పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ ఐపీఓ 2.3 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది.
Comments
Please login to add a commentAdd a comment