ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : ఈ నెల 12వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఎండీ హషీం షరీఫ్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్లో ఏజేసీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పరీక్షల్లో మాస్ కాపీయింగ్, ఇతర అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అక్రమాల నిరోధానికి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాలన్నారు. జిల్లాలోని 93 పరీక్ష కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ప్రథమ చికిత్స సిబ్బంది, మందులను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలు ముగిసిన అనంతరం జవాబు పత్రాలను స్పీడ్ పోస్టులో పంపేందుకు అవసరమైన ఏర్పాట్లకు సహకరించాలని పోస్టల్ శాఖ అధికారులను కోరారు. పరీక్ష సామగ్రిని భద్రపరిచేందుకు, తరలించేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎ.అన్నమ్మ మాట్లాడుతూ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరుగుతాయని, అవసరమైన సిబ్బందిని నియమించామని చెప్పారు. సమావేశంలో జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి పి.పాపారావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యుడు జి.అప్పలనాయుడు, ఆర్టీసీ డీపో మేనేజర్ ముకుందరావు, పోలీస్, వైద్యఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.