బెల్గాంలో ఉద్రిక్తత
రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాల కార్యకర్తలు
పాత్రికేయులపైనా దాడులు
లాఠీచార్జ చేసిన పోలీసులు
29 వరకూ నిషేధాజ్ఞలు
సాక్షి,బెంగళూరు: నామఫలకం విషయంలో ఆకతాయిలు చేసిన చేష్టలు బెల్గాంతో పాటు చుట్టుపక్కల ఉన్న నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర హోంశాఖ ఈనెల 29 వరకూ ఆయా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేసింది. వివరాలు... బెల్గాం జిల్లా యళ్లూరులో మరాఠీలో రాసిన ‘ఇది మహారాష్ట్ర’ అన్న నామఫలకాన్ని హై కోర్టు ఆదేశాలమేరకు పోలీసులు గత శుక్రవారం తొలగించారు. అప్పటి నుంచి స్థానిక కన్నడిగులకు, మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇరువర్గాలు పరస్పరం రాళ్లు కూడా రువ్వుకున్నారు. మరో వైపు ఆదివారం తెల్లవారుజామున ఆకతాయిలు యల్లనూరులో మరాఠీలో నేమ్‌బోర్డును ఏర్పాటు చేయగా పోలీసులు తొలగించారు.
ఈ కథనాన్ని కవర్ చేయడానికి వెళ్లిన పాత్రికేయులపై కొంతమంది ఎంఈఎస్ కార్యకర్తలు భౌతికదాడులకు దిగారు. వారి ఇళ్లలోకి చొరబడి లూటీకి ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. మెబైల్, ఫేస్‌బుక్‌లలో కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్ఎంఎస్లు పంపిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న కొంత మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు బెల్గాంతోపాటు చుట్టుపక్కల ఉన్న ఖానాపుర, నిప్పాణి, యల్లనూరులో ఈనెల 29 వరకూ నిషేధాజ్ఞలను రాష్ట్ర హోంశాఖ జారీ చేసింది. అక్కడి పరిస్థితులను ఐజీపీ భాస్కర్‌రావ్, కలెక్టర్ జయరాం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
గొడవలకు కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ తెలిపారు. ఇదిలా ఉండగా శాసనసభ విపక్షనాయకుడు జగదీష్ శెట్టర్ ఆదివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కొంతమంది రాజకీయ లబ్ధికోసమే బెల్గాంలో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆరోపించారు. వీరి పై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.