విరహమో... దాహమో... విడలేని మోహమో!
నాటి సినిమా
లోకంలో అన్ని ఇళ్లకు గేట్లు, గడియలు ఉంటాయి. గేట్లు, గడియలు ఉన్న ఇళ్లల్లో భార్య, భర్త, పిల్లలు ఉంటారు. అది ఇల్లు అవుతుంది. అక్కడ కాపురం కొలువుంటుంది. కాని– లోకంలో కొన్ని ఇళ్లకు గేట్లు, గడియలు ఉండవు. అక్కడికి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు.
అక్కడ బతుకు చెడిన స్త్రీ ఉంటుంది. కాలికి గజ్జె కట్టి ఆడే మేళకత్తె ఉంటుంది. చూపులతో లోబరుచుకుని పలుకుతో దాసోహం చేసుకునే
వెలయాలు ఉంటుంది. అది ఇల్లు కాదు. గుడి కాదు. రసికుల కార్యక్షేత్రం. కాని ఆ ఎడారిలో కూడా ఒక గడ్డి పువ్వు ఉంటుంది. సౌందర్యవంతౖమైన హృదయమున్న ఒక దేహం ఉంటుంది. ఒక సంస్కారవంతమైన ఆత్మ ఉంటుంది. దానిని చూసి ఒక పురుషుని మనసు స్పందిస్తే– ఆ పురుషుని కోసం ఆమె పరితపిస్తే– అదే మేఘసందేశం.
రవీంద్రబాబు పాత్రను ధరించిన అక్కినేనికి ఆ ఊళ్లో మంచి పేరు ఉంటుంది. పలుకుబడి ఉంటుంది. దారిన పోతుంటే అందరూ దండాలు పెడుతుంటారు. ఊరికి మంచైనా చెడైనా అతడు చూడాల్సిందే. తెల్లటి దుస్తులు ధరించి పైన శాలువా తొడుక్కుని మల్లెపువ్వులా ఉండే అక్కినేనికి లోపల ఎక్కడో భావుకత్వం దాగి ఉంది. మబ్బులను చూసినా మల్లెలను చూసినా సాయం సంధ్య వేళలో వొంపులు తిరుగుతూ ప్రవహించే గోదారిని చూసినా అతడి హృదయంలో ఏవో సంవేదనలు రేగుతాయి. వాటికి భాష ఇవ్వాలని ఉంటుంది. వాటిని తన గొంతుతో తడపాలని ఉంటుంది. కాని అందుకు కావలసిన స్ఫూర్తి లభిస్తూ ఉండదు. ఇంట్లో భార్య నుంచి అలాంటి ఉత్సాహాన్ని పొందాలని అనుకుంటాడు. ఆమెను తన భావసుందరిగా ఊహించుకుంటూ ఉంటాడు.
కాని ఆ పాత్రను పోషించిన జయసుధ ఒట్టి భర్త చాటు ఇల్లాలు. ఎప్పుడూ పూజలూ వ్రతాలు అంటూ తడి బట్టలలో తులసికోట చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భర్తతో పాటు కలిసి సరదాగా భోం చేయకుండా గడప అవతల కూచుని ‘ఇవాళ ఉపవాసం’ అంటూ ఉంటుంది. ఆకాశంలోని చందమామను కిటికీలో నుంచి చూస్తూ భార్యతో ఊసులాడాలని అతడనుకుంటే ఆమె చాప మీద అలసి నిద్రపోతూ ఉంటుంది. అతడికి అసంతృప్తి ఉంది. అది బయటకు తెలుస్తూ ఉంది. కాని ఆమెకు కూడా అసంతృప్తి ఉంది. మామూలు ఇల్లాలుగా భర్త సన్నిధికి చేరాలనుకున్నప్పుడల్లా అతడు ఏవో ఊహల్లో మరెవో ఆలోచనల్లో మునిగి ఉంటాడు. మనసులో కవితలల్లుకుంటూ భార్యను పట్టించుకోకుండా ఉంటాడు. ఇది తూర్పు పడమరల కాపురం. పైకి మర్యాదగా కనిపిస్తున్నా అగాధం ఉన్న కాపురం.ఈ అగాధంలో అల్పపీడనం ఏర్పడటానికి పద్మ పాత్రధారి జయప్రద వచ్చింది.
ఊరి బయట ఏటి వొడ్డు ఆమె నివాసం. సాయంత్రమైతే ఆటా పాటా ఆమె వృత్తి. వచ్చిన మగవారిని నాట్యంతో మురిపించడం ఆమె భుక్తి. కాని ఆమె వృత్తిది పతనావస్థగాని ఆమె మనసుది కాదు. సంస్కారంది అంతకన్నా కాదు. ఆమె ఎంతో లలితంగా ఉంటుంది. అంతకంటే లలితంగా ఆమె పాట, నాట్యం ఉంటాయి. వాటి కంటే లలితంగా ఆమె సంస్కారం ఉంటుంది. జయదేవుని అష్టపదిని పాడుతూ పాదాలతో మువ్వలను కదిలిస్తున్నవేళ అక్కినేని ఆమెను చూస్తాడు. ఇసుక తిన్నెల మీద పురిని విదిల్చిన నెమలి వలే గొంతును ఎగజిమ్మిన కోకిల వలే ఉన్న ఆమెను చూడగానే అతడిలో ఆ క్షణమే ఆశువుగా కవితావేశం పొంగుతుంది. భావం ఉప్పొంగుతుంది. భాష ఆధీనంలోకి వచ్చి పదం బయల్పడుతుంది. ఆమె పాటకు అతడు తన భావాన్ని కలుపుతాడు.
మొదటిసారి వారిరువురి కళా హృదయాలకు అలా లంకె పడుతుంది. అలా అతడు తన వెలితిని తీర్చే చిరునామాగా ఆమెను మలుచుకుంటాడు. ఆమె కనిపిస్తే చాలు అతడు కవి. ఆమె పక్కన మెత్తగా కూర్చుంటే చాలు. అతడు ముని. అంతవరకే ఆమె అతడికి కావలసింది. ఆమె సాంగత్యం... ఆమె సౌశీల్యం... దేహం కాదు. అయితే లోకం అలా అనుకోగలదా? అనుకోలేదు. అది పరాయి స్త్రీతో అతడు వల్లో పడ్డాడని భావిస్తుంది. ఇంట్లో భార్య కూడా తప్పుగా అర్థం చేసుకుంటుంది. తుదకు అతడి బావగారైన జగ్గయ్య జయప్రదను ఊరి నుంచి తరిమేసే దాకా ఊరుకోడు. ఎంతో ఇష్టమైన ఒక స్నేహితుల జంటను విడదీసే పాపంలాంటి పని అది. అక్కినేని విలవిలలాడిపోతాడు. ఆమె విరహంలో కవిత్వం రాసి రాసి సోలిపోతుంటాడు. కాని ఆమె కనిపించదు. కనిపించకపోయే కొద్దీ అతడు విరాగి అవుతాడు. గడ్డాలు మీసాలు పెంచిన బైరాగి అవుతాడు. అప్పుడుగానీ ఊరికీ, అయినవారికీ అర్థం కాదు– వారిద్దరూ ఒకరికి ఒకరు అని... ఒకరి కళకు మరొకరు ఆలంబన అని.
సాధారణంగా అంతా ఇటువంటి వారిని చూసి నాలుగు రోజుల్లో బులబాటం తీరిపోతే విడిపోతారు అని అనుకుంటారు. కాని అక్కినేని, జయప్రదల బంధం అలాంటిది కాదు. వృద్ధులైనా వయసు ఉడిగినా వారు ఒకరి సాన్నిహిత్యంలోనే మరొకరు జీవిస్తూ ఉంటారు. ఒకరి ఊపిరిని మరొకరు శ్వాసిస్తూ ఉంటారు. చివరకు ఒకరి మరణంలో కూడా మరొకరు తోడుంటారు.కొన్ని బంధాలకు అర్థమూ వ్యాఖ్యానమూ ఉండకపోవచ్చు. అంతమాత్రాన అవి లేకుండా పోవు. మనుషులు వాటిని ఏర్పరచుకోకుండా ఉండరు. పెళ్లి, పిల్లలు, సంసారం... వీటి అవతల కూడా ఎవరో మరెవరి దోసిళ్ల నీళ్లకో ఆర్తి పడుతుం టారు. ఆ దాహార్తిని తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. కట్టుబాట్లను దాటివెళ్లి పిచ్చివాళ్లు అవుతుంటారు. చివరి వరకూ ఘర్షణ అనుభవించి కడతేరిపోతుంటారు. మేఘసందేశం భావుకులైన ఒక స్త్రీ పురుషుల కథ. వారి బంధానికి లోకం అంగీకారం లేకపోవచ్చు. కాని ప్రకృతి అంగీకారం మాత్రం ఉంది.
1980లో ‘శంకరాభరణం’ వచ్చింది. నిద్రావస్థలో ఉన్న సంగీత నాట్యాలను సాహిత్యాన్ని అది ఒకసారి వెన్ను చరిచి ఉలిక్కిపడేలా చేసింది. చాలా మంది దర్శకులు ఆ సినిమాతో స్ఫూర్తి పొందారు. దాసరి నారాయణరావు 1982లో ‘మేఘసందేశం’ తీస్తే జంధ్యాల ఆ మరుసటి సంవత్సరం ‘ఆనందభైరవి’ తీశారు. శంకరాభరణంలో సోమయాజులను చూసి మంజు భార్గవి స్ఫూర్తి పొందితే మేఘసందేశంలో జయప్రదను చూసి అక్కినేని స్ఫూర్తి పొందుతాడు. శంకరాభరణంలో శంకరశాస్త్రి పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడితే ఇక్కడ అక్కినేని కుటుంబానికి భంగం ఏర్పడింది. ఎంతటి కళకారులైనా, ఎవరిని చూసి స్ఫూర్తి పొందినా, కుటుంబం భంగం కావడం ప్రేక్షకులకు నచ్చదు. ఆ ఇబ్బంది మేఘసందేశంలో ఉంది. కుటుంబ ధర్మానికి ద్రోహం చేశాననే గిల్ట్ జీవితాంతం అక్కినేనిని వెంటాడుతూనే ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఏ పక్షం వహించాలో తెలియక సతమతమవుతారు. క్లయిమాక్స్‌లో అక్కినేని, జయప్రద చనిపోవడంతో నిట్టూర్పు విడుస్తారు.
దాసరి వంటి కమర్షియల్ డైరెక్టర్, అక్కినేని వంటి కమర్షియల్ హీరో కలిసి ఆ రోజులలో ‘మేఘ సందేశం’ వంటి కళాత్మక సినిమా తీయడం పెద్ద సాహసం అని చెప్పాలి. ఈ సాహసానికి సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు, గీత కర్తలు దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి, కెమెరా సెల్వరాజ్ తోడు నిలిచి సినిమాను క్లాసిక్‌గా మలిచారు. మేఘసందేశం రిలీజైన వెంటనే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయకపోయినా మెల్లగా అది క్లాసిక్ స్థాయికి నిలువగలిగి జాతీయ అవార్డులు తెచ్చుకుని గుర్తింపు పొందగలిగింది. అక్కినేని, జయప్రద, జయసుధ, దాసరి ఈ నలుగురి జీవితంలో నేటికీ ఇది ముఖ్యమైన సినిమా. అంతేనా? కళ ఉన్నంత కాలం కాలదోషం లేని సినిమా.
ఎవరో ఒక స్త్రీ కరముద్రలను చూసి ఒక పురుషుని మనసు కదం తొక్కినా ఒక పురుషుడి గానావేశం చూసి ఒక స్త్రీ హృదయం ఉప్పొంగినా మేఘసందేశం ప్రస్తావన ఉంటుంది. మూగ భాష అనాదిగా ఉంది. స్త్రీ పురుషుల మధ్య మూగ మేఘసందేశం కూడా వారిరువురు ఉన్నంత కాలం ఉంటుంది. కళాభ్యుదయ మస్తు.
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన...
‘మేఘసందేశం’ సినిమాను మ్యూజికల్ అనాలి. ఇది సంగీతం మధ్య సినిమాయే తప్ప సినిమా మధ్య సంగీతం కాదు. సినిమాలో పది పాటలు ఉంటే పది పాటలనూ సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు సృజనాత్మకతలో పతాకస్థాయికి తీసుకువెళ్లారు. ‘శంకరాభరణం’కు బాలూ అన్ని పాటలు పాడితే మేఘసందేశంలో ఏసుదాస్ అన్ని పాటలు పాడి జాతీయ అవార్డు గెలుచుకున్నారు. వేటూరి రాసిన ‘ఆకాశ దేశాన ఆషాఢ మాసాన’ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. సుశీల పాడిన ‘నిన్నటి దాకా శిలనైనా’, ‘ఆకులో ఆకునై’, ‘ముందు తెలిసెనా ప్రభూ’... ఈ పాటలన్నింటికీ జాతీయ అవార్డు పొందారు.
వీటిని సృష్టించిన రమేష్‌నాయుడుకు సరేసరి. వేటూరి హవా వల్ల నెమ్మదించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ సినిమాలో తన విశ్వరూపం చూపారు. ‘ఆకులో ఆకునై’... ఆయన మార్క్. ‘శీతవేళ రానీయకు రానీయకు’ అని ఆయన మాత్రమే అనగలడు. మేఘసందేశం విడుదలయ్యాక దాని ఎల్పి రికార్డులు విస్తారంగా అమ్ముడుపోయాయి. పల్లెటూరి వాళ్లు కూడా ‘ఆకాశ దేశాన’ పాటను హమ్ చేశారు. మెరిసేటి ఓ మేఘమా అని మురిసిపోయారు. నిజంగానే మంచి సంగీతానికి అవి మంచిరోజులు. మరిచిపోని రోజులు.
– కె