కస్సుబుస్సులు
అధికారులపై దుమ్మెత్తిపోసిన జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి
హాజరు కాని వారికి మెమోలు ఇవ్వాలని ఆదేశం
మొబైల్ ఏటీఎంల ద్వారా పింఛన్లు ఇవ్వాలని
ప్రభుత్వాన్ని కోరతామన్న చింతమనేని
జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాల తీరిది
ఏలూరు (టూ టౌన్) : ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు 50 కిలోమీటర్ల దూరం నుంచి సమావేశానికి వస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉండే అధికారులు మాత్రం ఎందుకు హాజరుకావడం లేదు. సీఎంతో సమావేశం, కలెక్టర్‌తో మీటింగ్ అంటున్నారు. అలాంటివి ఉంటే మాకు చెప్పాల్సిన పనిలేదా’ అంటూ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ స్థాయూ సంఘ సమావేశాలు బుధవారం జెడ్పీ ప్రాంగణంలో జరిగాయి. బాపిరాజు మాట్లాడుతూ సమావేశానికి హాజరుకాని అధికారులకు మెమోలు ఇవ్వాలంటూ సీఈవో డి.సత్యనారాయణను ఆదేశించారు. సమావేశాలకు కిందిస్థారుు అధికారులు హాజరుకావడంతో వారిని వెనక్కి పంపించివేశారు.
ఇదిలావుండగా, మత్స్య శాఖకు సంబంధించి ఆ శాఖ అధికారి వివరాలు చెబుతున్నప్పుడు ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ అడ్డు తగిలారు. చేపల చెరువులకు జిల్లా స్థాయి అనుమతుల విషయంలో 8 శాఖలకు చెందిన అదికారులతో కమిటీ వేశారని, దీనివల్ల వారందరి చేతులు తడిపాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై ప్రత్యమ్నాయం ఆలోచించాలని జెడ్పీ చైర్మన్‌కు సూచించారు. సహకార శాఖ డెప్యూటీ రిజిస్ట్రార్ ఆరిమిల్లి శ్రీనివాస్ ఆ శాఖకు సంబంధించి వివరాలు చెబుతుండగా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకరరావు కలగజేసుకుని శనివారపుపేట సహకార సంఘంపై 51 ఎంక్వైరీ చేయించాలని కోరారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
మొబైల్ ఏటీఎంల ద్వారా పింఛన్లు
పింఛను లబ్ధిదారులకు మొబైల్ ఏటీఎంల ద్వారా సొమ్ము బట్వాడా చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్టు విప్ చింతమనేని ప్రభాకర్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ప్రతినెలా 1న పింఛన్లు అందటం లేదని, దీనివల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారందరికీ ప్రతినెలా 1వ తేదీనే వేలిముద్ర ఆధారంగా ఏటీఎం కార్డు ద్వారా సొమ్ము ఇచ్చేందుకు అనువుగా మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరతామన్నారు. పదేళ్లుగా పింఛన్లు అందక అవస్థలు పడుతున్న వారి పేర్లను ఆన్లైన్లో పొందుపరిస్తే 50 శాతం మందికి మాత్రమే మంజూరు లభించిందని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే నూరు శాతం మందికి పింఛన్లు మంజూరు చేయూలని డీఆర్డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డిని ప్రభాకర్ ఆదేశించారు.
గ్రామాల్లో డ్రెయిన్ల అభివృద్ధికి కృషి
జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో రూ.150 కోట్లతో డ్రెరుున్లు, ప్రహరీ గోడలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి పల్లెలో కనీసం 2 కిలోమీటర్ల మేర డ్రెయినేజీ, కాంపౌండ్ వాల్స్ నిర్మాణంతోపాటు రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా డెల్టాలో 22 వేల కిలోమీటర్ల మేర గల పంట కాలువలలో పూడిక తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని, మెట్ట ప్రాంతంలో ఫీల్డ్ చానల్స్ ఆధునికీకరణకు రూ.200 కోట్లు ఖర్చు చేసే యోచనలో ఉన్నామని డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, కేఎస్ జవహర్, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కె.చైతన్యరాజు, గృహ నిర్మాణ శాఖ అధికారి ఇ.శ్రీనివాస్, ఉపాధి కల్పనాధికారి వసంతలక్ష్మి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.