మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!!
మానవశరీర పనితీరును మెదడు నియంత్రిస్తుందని మీకు తెలుసా? మీ శరీరం ఒక కంప్యూటర్ ఐతే, మెదడు సీపీయూలా పనిచేస్తుందన్నమాట. అంటే శరీర అన్ని భాగాలకు మెదడు సమాచారాన్ని చేరవేస్తూ, మార్గనిర్ధేశం చేస్తూఉంటుంది. ఐతే యంత్రమైనా, మనిషైనా కాలక్రమేణా సామర్థ్యాన్ని కోల్పోవడమనేది అనివార్యం. మెదడు విషయానికొస్తే వృద్ధాప్య ఛాయలు పెరిగేకొద్దీ న్యూరోడిజెనరేషన్ ప్రారంభమవుతుంది. అయితే మెదడును చురుకుగా ఉంచే మార్గాలు కూడా ఉన్నాయని, ఏ వయసువారైనా వాటిని అనుసరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
కొత్త భాషలను నేర్చుకోవాలి
మీకు ఏవైనా రెండు భాషల్లో ప్రావీణ్యం ఉన్నట్లయితే మీ మెదడు సుదీర్ఘకాలం మరింత చురుగ్గా పనిచేయగలుగుతుంది. ఇప్పటికే అనేక పరిశోధనలు ఈ విషయాన్ని దృవీకరించాయి. పబ్మెడ్ సెంట్రల్ ‘ది కాగ్నిటివ్ బెనిఫిట్స్ ఆఫ్ బీయింగ్ బైలింగ్వల్’ పేర ప్రచురించిన నివేధిక ప్రకారం.. రెండు భాషల్లో ప్రావీణ్యత కలిగి ఉండటం వల్ల సృజనాత్మకత, నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెంపుకు దోహదపడుతుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్ది పరిణమించే రుగ్మతల నుంచి కూడా కాపాడుతుంది.
బ్రెయిన్ గేమ్స్ ఆడాలి
పిల్లల్ని ఎప్పుడైనా గమనించారా? ఫజిల్స్, సమస్యా పరిష్కారం వంటి ఆటలు ఎక్కువగా ఆడటాన్ని ఇష్టపడతారు. ఇది వారి జ్ఞాన వృద్ది ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగం. చిన్నతనం (నేర్చునే వయసు) లోనేకాకుండా జీవితం తర్వాత దశల్లో కూడా మెదడు పనితీరును మెరుగుపరచుకునే అలవాటును కొనసాగించాలని సైన్స్ చెబుతోంది. జిగ్జాగ్ ఫజిల్స్, కార్డ్ గేమ్స్, క్విజ్.. వంటి ఆటలు మీ మెదడుకు పని పెట్టడమేకాకుండా పదునుగా ఉండేలా చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. విశ్లేషాత్మక నైపుణ్యాలు, జ్ఞాపక శక్తి, సృజనాత్మక ఆలోచన తీరు పెంపుకు బ్రెయిన్ గేమ్స్ ఉపయోగపడతాయి.
సంగీతం నేర్చుకోవాలి
పియానో, గిటార్, ఫ్లూట్.. ఇతర వాయిద్యకారులు ఎంతో నైపుణ్యంతో, వేగంగా ఎలా వాయించగలుగుతాన్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అందుకు మెదడే కారణం. ప్లస్ ఒన్ లో ‘హ్యాపీ క్రియేటివిటీ’ పేరుతో ప్రచురించబడిన ఒక నివేధిక ప్రకారం సృజనాత్మకత, మానసిక స్థితి, అభిజ్ఞా పనితీరును మ్యూజిక్ మెరుగుపరుస్తుందని పేర్కొంది. వాయిద్యాలను నేర్చుకోవడం అనేది ఒక నైపుణ్యం. జ్ఞాపకశక్తి పెరుగుదలను, సమన్వయాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ధ్యానం చేయాలి
ప్రాచీనకాలం నుంచే భారతీయ సంస్కృతిలో ధ్యానం అంతర్భాగంగా ఉంది. మనసును ప్రశాంతంగా ఉంచడం ద్వారా శరీరానికి విశ్రాంతినిచ్చే ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. అనేక అధ్యయనాల ప్రకారం మానసిక సమస్యలను తగ్గించడంలో, సమాచార విశ్లేషణ సామర్థ్యం పెంపుకు, మెరుగైన భావోధ్వేగ స్థితి స్థాపనకు ధ్యానం దోహదపడుతుంది.
ఇంద్రియాలన్నింటికీ పనిచెప్పాలి
మీ ముక్కుకు తాకిన ఏదైనా ఒక వాసన మీగతంలోని విషయాలను ఎప్పుడైనా గుర్తుకు తెచ్చిందా? వాసనతో ఈవెంట్ యొక్క అనుబంధం కారణంగా మీ మెదడులో ముద్రించిన జ్ఞాపకాన్ని మీకు గుర్తు చేస్తుందన్నమాట. వాసన, ధ్వని, దృశ్యాలు.. కూడా అలాగే పనిచేస్తాయి. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చెప్పేదేంటంటే.. పంచేంద్రియాల (వాసన, రుచి, స్వర్శ, వినికిడి, చూపు) కార్యకలాపాలు మీ మెదడును చురుగ్గా ఉంచడానికి దోహద పడతాయని వెల్లడించింది. ఇది మెదడు పనితీరును బలోపేతం చేయడానికి ఎంతో దోహదపడుతుంది.
చదవండి: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి..