గుర్రాల జ్ఞాపకశక్తి గొప్పదా?
జంతు ప్రపంచం
ప్రపంచంలో దాదాపు 160 జాతుల గుర్రాలు ఉన్నాయి. అన్నింట్లోకీ అరేబియన్ గుర్రాన్ని ఉత్తమ జాతిగా పేర్కొంటారు! ఐదేళ్ల వయసు వచ్చేవరకూ గుర్రాన్ని గుర్రం అనరు. మగది అయితే కాల్ట్ అని, ఆడది అయితే ఫిల్లీ అనీ అంటారు! భూమ్మీద నివసించే జీవులన్నింటిలోకీ గుర్రం కళ్లే పెద్దగా ఉంటాయి. వీటి నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దానివల్ల ఒకేసారి రెండు కళ్లతో రెండు దృశ్యాలను చూడగలవు ఇవి. అంతేకాదు... చిక్కని చీకటిలో సైతం కొన్నిమైళ్ల దూరంలో ఉన్నవాటిని కూడా స్పష్టంగా గుర్తించగలిగే శక్తి వీటి కళ్లకు ఉంది!
వీటి చెవులు కదులుతూ ఉంటాయి. గుండ్రంగా తిరుగుతాయి కూడా. ఆ కదలికను బట్టి వీటి దృష్టి దేనిమీద ఉందో చెప్పేయవచ్చు. ఎందుకంటే... కన్ను ఎటువైపు చూస్తోందో, చెవి కూడా అటువైపే తిరుగుతుంది! వీటి ఎత్తును ‘హ్యాండ్స్’లో కొలుస్తారు. ఒక హ్యాండ్ నాలుగు అంగుళాలతో సమానం!
మగ గుర్రాలకు 40 నుంచి 44 దంతాలు ఉంటే... ఆడగుర్రాలకు 36 ఉంటాయి. ఈ దంతాలను బట్టే వీటి వయసును లెక్కిస్తారు. అయితే అది కూడా తొమ్మిదేళ్లు నిండేవరకే. ఆ తర్వాత వీటి వయసును దంతాల ద్వారా కనుక్కోవడం కష్టమంటారు జీవశాస్త్రవేత్తలు! ఇవి రోజుకు కేవలం గంటనుంచి మూడు గంటల సేపు నిద్రపోతాయి. అయితే ఇంతసేపూ పడుకోవు. కాసేపు నిలబడి కూడా నిద్రపోతుంటాయి!
దాదాపు జీవులన్నీ కూడా శ్వాసనాళాల్లో సమస్య ఉంటే నోటితో శ్వాసను తీసుకుంటూ ఉంటాయి. కానీ గుర్రాలు అలా చేయలేవు. అంతేకాదు... ఇవి త్రేన్చలేవు. వాంతి చేసుకోలేవు! తెల్లగుర్రాలను చూసి భలే ఉన్నాయే అనుకుంటాం మనం. అయితే నిజానికి ఇవి పుట్టినప్పుడు తెల్లగా ఉండవు. గ్రే కలర్‌లో ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ తెల్లగా మారతాయి!
వీటి జ్ఞాపకశక్తి అత్యద్భుతమైనదని పరిశోధనలు తేల్చాయి. ఒక్కసారి మనం ప్రేమగా సాకితే, గుర్రాలు మనలను జీవితంలో మర్చిపోవట. పైగా ఎంతమందిలో ఉన్నా కూడా మనల్ని గుర్తు పట్టేస్తాయట. అలాగే స్థలాలు కూడా. కొంతకాలం వీటిని ఓ ప్రదేశంలో తిప్పి, తర్వాత దూరంగా తీసుకెళ్లి వదిలేస్తే... ఇవి తిరిగి పాత ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోగలవట!