methane
-
మాగాణుల్లో మిథేన్‌కు చిరు చేపలతో చెక్!
వాతావరణాన్ని వేడెక్కిస్తున్న మిథేన్, కార్బన్ డయాక్సయిడ్ కన్నా 86 రెట్లు ఎక్కువ పర్యావరణానికి హాని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోకి విడుదలవుతున్న మిథేన్ వాయువులో 10శాతం మేరకు వరి పొలాల నుంచే వెలువడుతోందని అంచనా. అయితే, వరి పొలాల్లోని నీటిలో చిరు చేపల (గోల్డెన్ షైనర్ రకం)ను పెంచితే మూడింట రెండొంతుల మిథేన్ వాయువు తగ్గిందని కాలిఫోర్నియాకు చెందిన రిసోర్స్ రెన్యువల్ ఇన్స్టిట్యూట్(ఆర్ఆర్ఐ) అనే స్టార్టప్ కంపెనీ చెబుతోంది. ‘ఫిష్ ఇన్ ద ఫీల్డ్స్’ పేరిట పైలట్ ప్రాజెక్టు ద్వారా రెండేళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ఇటీవల ‘ద జెఎం కప్లన్ ఇన్నోవేషన్ ప్రైజ్’ను గెల్చుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘వరి రైతులకు చేపల ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. సముద్ర చేపలను దాణాల్లో వాడే బదులు ఈ పొలాల్లో పెరిగే చేపలను వాడటం ద్వారా భూతాపాన్ని తగ్గించడానికి, చేపల జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి మా పరిశోధనలు ఉపకరిస్తాయి. 1,75,000 డాలర్ల ప్రైజ్ మనీతో మేం చేపట్టిన ప్రయోగాత్మక సాగుకు ఊతం వచ్చింది..’ అన్నారు ఆర్.ఆర్.ఐ. వ్యవస్థాపకులు దెబోరా మోస్కోవిట్జ్, ఛాన్స్ కట్రానో. ఆసియా దేశాల్లో అనాదిగా సాగు చేస్తున్న వరి–చేపల మిశ్రమ సాగులో అదనపు ప్రయోజనాన్ని కొత్తగా వారు శోధిస్తున్నారు. సుస్థిర ఆక్వా సాగుతో పాటు రైతుల ఆదాయం పెరుగుదలకు, భూతాపం తగ్గడానికి ఉపకరిస్తుందంటున్నారు. మాగాణుల్లో వరితో పాటు చేపలు పెంచితే ‘కార్బన్ క్రెడిట్స్’ ద్వారా కూడా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. మరికొన్ని సంగతులు ప్రపంచంలోని గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో నాలుగింట ఒక వంతు ఆహారం , వ్యవసాయం నుంచి వస్తున్నవే. వీటిల్లో నైట్రస్ ఆక్సైడ్ , మీథేన్దే అగ్రభాగం. ప్రపంచ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో 13 శాతం వ్యవసాయం, అటవీ భూ వినియోగంనుంచి వస్తుండగా, 21 శాతం ఇంధన కాలుష్యం. వరి పంట, పశువుల పెంపకం వంటి పద్ధతులు నేరుగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తాయనేది నిపుణుల వాదన. పంటకోత, నాటడం, రవాణా ద్వారా కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు, అలాగే యూరియాతో పండించిన గడ్డితినే పశువుల ద్వారా, పేడ నిర్వహణ ద్వారా ద్వారా మీథేన్ విడుదలవుతుంది. ఎరువుల వాడకం, నేల శ్వాసక్రియ వలన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ-స్మార్ట్ వ్యవసాయం ద్వారా ఉద్గారాల ప్రభావాలను తగ్గించాలనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా సమర్థవంతమైన పశువుల పెంపకం, శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, జంతు-ఆధారిత ఆహార పదార్థాల నిర్వహణ లాంటివి ప్రధానంగా ఉన్నాయి. ఇవి సుస్థిర ఆహార వ్యవస్థకు దోహదపడతాయి కూడా. గ్రీన్హౌస్ వాయువులపై వ్యవసాయ ప్రభావాన్ని తగ్గించడం మన భూగ్రహ మనుగడకు చాలా అవసరం. -
కరెంట్ కొరతకు కొత్త జవాబు
నా ఉచ్ఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం.. అన్నాడో కవి. నా ఉచ్ఛ్వాసం మీథేన్.. నా నిశ్వాసం విద్యుత్.. అంటున్నాయి ఒక రకం బ్యాక్టీరియాలు. మానవాళిని వేధిస్తున్న పర్యావరణ కాలుష్యం, ఇంధన కొరతకు అవి సమాధానం చెబుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.. జనాభా పెరిగిపోయే కొద్దీ శిలాజ ఇంధనాల వాడకం పెరిగి వాతావరణ కాలుష్యం హద్దులు దాటుతోంది. అలాగని ఇంధన వాడకాన్ని పరిమితం చేయదలిస్తే మానవ అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణహిత ఇంధనాల కోసం మనిషి అన్వేషణ చాలా రోజులుగా జరుగుతోంది. వాయు, సౌర విద్యుత్‌లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం జరుగుతున్నా అది శిలాజ ఇంథనాలను పరిమితం చేసే స్థాయిలో జరగడంలేదు. వీటికయ్యే ఖర్చు, సాంకేతిక సమస్యలు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని విరివిగా వాడేందుకు అడ్డంకిగా మారుతున్నాయి. తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికిందంటున్నారు శాస్త్రవేత్తలు. వాయు కాలుష్యకాల్లో కీలకమైన మీథేన్‌ను వాడుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను కనుగొన్నామని నెదర్లాండ్స్ పరిశోధకులు చెప్పారు. మీథేన్‌ను ఇంధనంగా వాడుకోవడం చాలా రోజులుగా జరుగుతున్నదే. బయోగ్యాస్ ప్లాంట్లలో వ్యర్థాలను సూక్ష్మ జీవులు మీథేన్‌గా మారుస్తాయి. ఇలా ఉత్పత్తి అయిన మీథేన్‌ను మండించి టర్బైన్లు తిరిగేందుకు వాడతారు. దీంతో విద్యుదుత్పాదన జరుగుతుంది. అయితే ఉత్పత్తి అయిన బయోగ్యాస్‌లో సగానికన్నా తక్కువే విద్యుదుత్పాదనకు ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో తమ ప్రయోగం ప్రత్యామ్నాయ ఇంధనోత్పత్తిలో ముందడుగు అని రాడ్బౌడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కార్నెలియా వెల్టె చెప్పారు. ప్రయోగ ఫలితాలను ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురించారు. ఇలా చేశారు పరిశోధనలో భాగంగా కాండిడేటస్ మిథేనోపెరెండెన్స్ అనే బ్యాక్టీరియాకున్న ప్రత్యేక టాలెంట్‌ను గుర్తించామని వెల్టె చెప్పారు. ఈ సూక్ష్మజీవులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బతుకుతుంటాయి. ఇవి మీథేన్‌ను ఆక్సిజన్ అవసరం లేకుండానే విడగొట్టి శక్తిని ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. ఏఎన్‌ఎంఈ (అనరోబిక్ మీథనోట్రోపిక్) ఆర్కియాగా పిలిచే ఈ జీవులు కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా తమ సమీపంలోని పదార్ధాల నుంచి ఎలక్ట్రానులను విడగొడతాయి. కరెంటంటేనే ఎలక్ట్రానుల ప్రవాహం. అంటే ఇవి తమ దగ్గరలోని పదార్ధాలను ఆక్సిడైజ్ చేసి కరెంటును ఉత్పత్తి చేస్తాయి. ఇందుకు కొద్దిగా నైట్రేట్ల సాయం తీసుకుంటాయి. ప్రయోగంలో భాగంగా ఈ సూక్ష్మజీవులను ఆక్సిజన్ రహిత ట్యాంకులో మీథేన్‌తో కలిపి ఉంచారు. దగ్గరలో ఒక మెటల్ ఆనోడ్‌ను జీరో ఓల్టేజ్ వద్ద సెట్ చేసి పెట్టారు. దీంతో ఈ మొత్తం సెటప్ ఒక బ్యాటరీలా మారిందని, ఇందులో ఒకటి బయో టెర్మినల్ కాగా ఇంకోటి కెమికల్ టెర్మినల్ అని వెల్టె తెలిపారు. సదరు బ్యాక్టీరియా తమ దగ్గరలోని మీథేన్‌నుంచి ఎలక్ట్రానులను విడగొట్టి కార్బన్ డైఆక్సైడ్‌గా మారుస్తాయి. ఈ ప్రక్రియలో దాదాపు చదరపు సెంటీమీటర్‌కు 274 మిల్లీ యాంప్‌ల కరెంటు ఉత్పత్తి అయింది. దీన్ని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఆధారంగా భారీ స్థాయిలో బ్యాక్టీరియా బ్యాటరీలను నిర్మించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ► ప్రపంచ జనాభాలో 94 కోట్ల మంది (13 శాతం)కి ఇంకా విద్యుత్ సౌకర్యం లేదు. ► భూతాపాన్ని పెంచే గ్రీన్హౌస్ వాయువుల్లో మీథేన్ కీలకమైనది. మొత్తం గ్రీన్‌హస్ వాయువుల్లో దీని వాటా 20 శాతం. ► కార్బన్ డై ఆక్సైడ్తో పోలిస్తే మీథేన్ భూమిపై సూర్యతాపాన్ని 25 శాతం వరకు పట్టి ఉంచుతుంది. ► పశువ్యర్థాలు, బొగ్గు గనుల నుంచి ఎక్కువగా మీథేన్ విడుదలవుతుంది. ► భారీస్థాయిలో శిలాజ ఇంధనాల వాడకం తగ్గితే భూతాపం గణనీయంగా అదుపులోకి వస్తుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
సౌర కుటుంబంలోనే ఎలియన్స్!
కొన్ని వందేళ్ల ఏళ్ల తర్వాత.. సరదాగా అలా అంతరిక్షంలోకి టూర్‌కు వెళ్లొచ్చే టెక్నాలజీ వచ్చేసింది.. చంద్రుడి మీదకు, అంగారకుడి (మార్స్) మీదకు వెళ్లినవాళ్లు.. ఇంకాస్త లాంగ్ టూర్ వేద్దామని శనిగ్రహం దాకా వెళ్లారు.. దాని ఉపగ్రహాల్లో ఒకటైన ఎన్సలాడెస్‌పై దిగారు.. అక్కడ వారిని ఏలియన్స్ బంధించాయి.. మనుషులు ఎలాగోలా తప్పించుకుని వెనక్కి వచ్చేశారు. ఇదంతా హాలీవుడ్ సినిమా కథలా ఉన్నా.. భవిష్యత్తులో నిజం కూడా కావొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎన్సలాడెస్ మీద జీవం ఉండే అవకాశాలు ఎక్కువని చెప్తున్నారు. మరి ఈ సంగతులేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ మనం ఒంటరి వాళ్లం కాదు కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు.. పెద్ద సంఖ్యలో గ్రహాలు.. ఇంత విశాల విశ్వంలో మనం ఒంటరి వాళ్లమేనా? భూమి అవతల ఎక్కడైనా జీవం ఉందా? ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్నలివి. అందుకే సౌర కుటుంబంలోగానీ, బయట ఇంకెక్కడైనాగానీ జీవం ఉందేమో అన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. జీవం ఉండటానికి అనుకూలమైన పరిస్థితులు ఏమాత్రమైనా ఉన్నాయా అన్నది పరిశీలిస్తూనే ఉన్నారు. ఈ కోవలోనే నాసా ప్రయోగించిన కాస్సిని వ్యోమనౌక అందించిన సమాచారంతో ఎన్సలాడెస్ మీద జీవం ఉండే అవకాశం ఉందని తాజాగా అంచనా వేశారు. ఎన్సలాడెస్ ఏంటి? భూమికి చంద్రుడు ఉన్నట్టే ఇతర గ్రహాలకు కూడా ఉపగ్రహాలు ఉన్నాయి. అలా శనిగ్రహానికి ఉన్న 82 ఉపగ్రహాల్లో ఒకటి ఎన్సలాడెస్. దీని మీద 32.9 గంటలకు ఒక రోజు గడుస్తుంది. మన చంద్రుడిలో ఏడో వంతు ఉండే ఈ ఉపగ్రహం వ్యాసార్థం (డయామీటర్) సుమారు 500 కిలోమీటర్లు. దీని ఉపరితలం మొత్తం 30 కిలోమీటర్ల మందమైన మంచు పొరతో కప్పబడి ఉందని, మంచుకు, మట్టి ఉపరితలానికి మధ్య మంచి నీళ్లు ఉన్నాయని నాసా శాస్త్రవేత్తలు కాస్సిని వ్యోమనౌక సహాయంతో కొన్నేళ్ల కిందే తేల్చారు. ఎన్సలాడెస్ ఉత్తర ధ్రువంలోని వేడినీటి ఊటల నుంచి భారీగా నీటి ఆవిరి అంతరిక్షంలోకి ఎగజిమ్ముతున్నట్టు గుర్తించారు. ఆ నీటి ఆవిరిలో మిథేన్ ఉందని తేల్చారు. దీనిపై అరిజోనా, పారిస్ సైన్సెస్ అండ్ లెట్రెస్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. తాజాగా ఆ వివరాలను వెల్లడించారు. మిథేన్.. జీవం ఉనికికి సాక్ష్యం సౌర కుటుంబంలోగానీ, అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు వేటిలోగానీ సహజంగా మిథేన్ వాయువు ఉండదు. ఇది జీవక్రియల్లో భాగంగానే వెలువడుతుందని, జీవజాలం ఉన్నచోట మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎన్సలాడెస్ నుంచి మిథేన్ గ్యాస్ విడుదలవడానికి అక్కడ మెథనోజెన్స్గా పిలిచే సూక్ష్మజీవులు ఉండటమే కారణమని అంచనా వేస్తున్నారు. ‘‘భూమ్మీద సముద్రాల అడుగున ఈ మెథనోజెన్స్ ఉంటాయి. అవి డైహైడ్రోజన్, కార్బన్డయాౖక్సైడ్ను ఉపయోగించుకుని మిథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఎన్సలాడెస్ నుంచి విడుదలవుతున్న నీటి ఆవిరిలో డైహైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్‌తోపాటు మిథేన్ కూడా గణనీయ స్థాయిలో ఉంది. ఎన్సలాడెస్ పై దట్టమైన మంచుపొర, దాని కింద లోతున నీళ్లు ఉన్నాయి. అంటే భూమ్మీద సముద్రాల అడుగున ఉండేలాంటి పరిస్థితే అక్కడా ఉంది. ఈ లెక్కన సూక్ష్మజీవులు ఉండే అవకాశాలు ఎక్కువే.. ’’ అని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ రెజిస్ ఫెర్రీర్ వెల్లడించారు. కాస్సిని గుర్తించిన వాయువుల ఆధారంగానే కాకుండా.. ఎన్సలాడెస్‌పై ఉండే వాతావరణం, రసాయనిక పరిస్థితులను గణిత మోడళ్ల ఆధారంగా విశ్లేషించి ఈ అంచనాకు వచ్చామని తెలిపారు. సూక్ష్మజీవులు ఉంటే చాలా? భూమ్మీద కూడా జీవం మొదలైంది సూక్ష్మజీవుల నుంచే.. మొదట్లో భూమి వాతావరణం, నేలపొరల్లో పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడిన రసాయనిక సమ్మేళనాల నుంచే జీవ పదార్థం పుట్టింది. తొలుత ఏర్పడిన ఏకకణ జీవులు క్రమంగా అభివృద్ధి చెందుతూ.. ఇంత విస్తారమైన జీవజాలం రూపొందింది. ఇప్పుడు ఎన్సలాడెస్‌పై కూడా సూక్ష్మజీవులు ఉండి ఉంటే.. అక్కడ భవిష్యత్తులో జీవం అభివృద్ధికి అవకాశం ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యురోపాపైనా పరిశోధనలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, వాటి ఉపగ్రహాల్లో..భూమి,ఎన్సలాడెస్తోపాటు గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం యురోపాపై కూడా మంచు, నీళ్లు ఉన్నాయి. అక్కడ కూడా జీవం ఉండవచ్చన్న దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. -
కేజీ బేసిన్లో కొత్త ఇంధనం...
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కృష్ణా–గోదావరి (కేజీ) బేసిన్లో పరిశోధకులు కొత్త ఇంధనాన్ని కనుగొన్నారు. కేజీ బేసిన్లో మీథేన్ హైడ్రేట్స్‌ను కనుగొన్నట్లు జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్‌లో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (హైదరాబాద్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(గోవా) శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. భారీ పరిమాణంలో మీథేన్ వాయువున్న ఐస్‌ముక్క లాంటి పదార్థాన్ని మీథేన్ హైడ్రేట్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇంధనంగా ఉపయోగిస్తున్న సహజవాయువులో కీలకమైనది మీథేన్ వాయువే. రాబోయే రోజుల్లో ఇంధన అవసరాలను భారీగా తీర్చేందుకు ఇది ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారత్ సముద్ర జలాల్లో గ్యా స్ హైడ్రేట్ నిక్షేపాల రూపంలో లక్షల కోట్ల ఘనపు మీటర్ల మీథేన్ గ్యాస్ ఉండొచ్చని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ అంచనా. వీటి వెలికితీతకు 2012–17 మధ్యలో ప్రభుత్వం రూ. 143 కోట్ల వ్యయం చేసింది. -
వ్యోమగాముల ‘గ్యాస్’.. రాకెట్లకు ఇంధనం!
సేంద్రియ పదార్థాలను మురగబెట్టి బయో-గ్యాస్‌ను తయారు చేయడం, ఆహార వ్యర్థాలు, మనుషుల మల వ్యర్థాలతో సైతం మీథేన్‌ను ఉత్పత్తి చేయడమూ మనకు తెలిసిందే. అయితే, అంతరిక్షంలోనూ బయో-గ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఇద్దరు భారత సంతతి పరిశోధకులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఎల్లప్పుడూ ఆరుగురు వ్యోమగాములు ఉండి ప్రయోగాలు నిర్వహిస్తుంటారు. ఐఎస్ఎస్ నుంచి ఆహార వ్యర్థాలతో పాటు వ్యోమగాముల మలాన్ని బయటికి డంపింగ్ చేసేందుకు వీలు కాదు కాబట్టి.. ప్రత్యేక కంటైనర్లలో భద్రపరుస్తున్నారు. అయితే, ఆ వ్యర్థాలను భూమికి తీసుకురావడం కష్టం. అందువల్ల వాటితో అక్కడే మీథేన్‌ను ఉత్పత్తి చేసి ఇంధనంగా వాడుకునేందుకు తగిన పద్ధతులు సూచించాలంటూ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో నాసా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పరిశోధనలు మొదలుపెట్టిన వర్సిటీ బయాలజికల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రతాప్ పుల్లమ్మనప్పల్లిల్, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయీ పరిశోధక విద్యార్థి అభిషేక్ ధోబ్లేలు.. ఐఎస్ఎస్లో మీథేన్ ఉత్పత్తికి ‘ఎనోరోబిక్(ఆక్సిజన్ లేని) డెజైస్టర్’ పద్ధతిని అభివృద్ధిపర్చారు. ఈ పద్ధతిలో ఐఎస్ఎస్లో రోజుకు 290 లీటర్ల మీథేన్‌ను ఉత్పత్తి చేయొచ్చట. అదనంగా ఏడాదికి 200 గ్యాలన్ల నీరూ వస్తుందని, ఆ నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొట్టి తిరిగి ఉపయోగించుకోవచ్చని వీరు వివరించారు.