వ్యోమగాముల ‘గ్యాస్’.. రాకెట్లకు ఇంధనం!
సేంద్రియ పదార్థాలను మురగబెట్టి బయో-గ్యాస్‌ను తయారు చేయడం, ఆహార వ్యర్థాలు, మనుషుల మల వ్యర్థాలతో సైతం మీథేన్‌ను ఉత్పత్తి చేయడమూ మనకు తెలిసిందే. అయితే, అంతరిక్షంలోనూ బయో-గ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఇద్దరు భారత సంతతి పరిశోధకులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఎల్లప్పుడూ ఆరుగురు వ్యోమగాములు ఉండి ప్రయోగాలు నిర్వహిస్తుంటారు.
ఐఎస్‌ఎస్ నుంచి ఆహార వ్యర్థాలతో పాటు వ్యోమగాముల మలాన్ని బయటికి డంపింగ్ చేసేందుకు వీలు కాదు కాబట్టి.. ప్రత్యేక కంటైనర్లలో భద్రపరుస్తున్నారు. అయితే, ఆ వ్యర్థాలను భూమికి తీసుకురావడం కష్టం. అందువల్ల వాటితో అక్కడే మీథేన్‌ను ఉత్పత్తి చేసి ఇంధనంగా వాడుకునేందుకు తగిన పద్ధతులు సూచించాలంటూ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో నాసా ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతో పరిశోధనలు మొదలుపెట్టిన వర్సిటీ బయాలజికల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రతాప్ పుల్లమ్మనప్పల్లిల్, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయీ పరిశోధక విద్యార్థి అభిషేక్ ధోబ్లేలు.. ఐఎస్‌ఎస్‌లో మీథేన్ ఉత్పత్తికి ‘ఎనోరోబిక్(ఆక్సిజన్ లేని) డెజైస్టర్’ పద్ధతిని అభివృద్ధిపర్చారు. ఈ పద్ధతిలో ఐఎస్‌ఎస్‌లో రోజుకు 290 లీటర్ల మీథేన్‌ను ఉత్పత్తి చేయొచ్చట. అదనంగా ఏడాదికి 200 గ్యాలన్ల నీరూ వస్తుందని, ఆ నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడగొట్టి తిరిగి ఉపయోగించుకోవచ్చని వీరు వివరించారు.