తొందరపడి నిందలు వేయొద్దు: పుతిన్
ఎంహెచ్-17 విమానం కూల్చివేత విషయంలో దర్యాప్తు పూర్తి కాకుండా తొందరపడి తమ దేశంపై ఓ అంచనాకు వచ్చేయొద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా చెప్పారు. ఈ విషయంలో రాజకీయ ప్రకటనలు ఇవ్వొద్దని ఘాటుగా అన్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రెస్ సర్వీస్ ఓ ప్రకటనలో తెలిపింది. ''ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) చేసే దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని, మేం సిద్ధంగా ఉన్నామని రష్యా ఎప్పుడో చెప్పింది'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం గురించి బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో పుతిన్ ఆదివారం రాత్రి చర్చించారు. అంతర్జాతీయ సమాజం సహకారంతో వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం చూసుకోవాలని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో కాల్పుల విరమణ తప్పనిసరిగా ఉండాలని, అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే దర్యాప్తు తప్పనిసరి అని కామెరాన్ అన్నారు. జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్‌తో కూడా పుతిన్ మాట్లాడారు.