migration policy
-
ఇండియన్స్‌పై యూకే మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ కౌంటర్!
లండన్: వీసా పరిమితి ముగిసినప్పటికీ బ్రిటన్‌లో ఉంటున్న వారిలో అధికంగా భారతీయులేనని యూకే హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. గత ఏడాది రెండు దేశాల మధ్య జరిగిన మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్షిప్(ఎంఎంపీ) ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని సుయెల్లా పేర్కొనంటపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఒప్పందం కింద లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని లండన్‌లోని భారత హైకమిషన్ స్పష్టం చేసింది. ఒప్పందంలో భాగంగా యూకే వైపు నుంచి సైతం స్పందన కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపింది. యూకే హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై ప్రశ్నించగా.. పలు విషయాలను వెల్లడించింది లండన్‌లోని భారత హైకమిషన్. ‘మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ఒప్పందంలో భాగంగా వీసా పరిమితి ముగిసిన తర్వాత బ్రిటన్‌లో ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు యూకేతో కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నాం. హోంశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించాం. ఎంఎంపీ ఒప్పందంలో భాగంగా హామీలను నెరవేర్చేందుకు యూకే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో సరైన పురోగతి కోసం తాము వేచి చూస్తున్నాం.’ అని లండన్‌లోని భారత హైకమిషన్ బదులిచ్చింది. మరోవైపు.. ఇరు దేశాల మధ్య చర్చల్లో ఉన్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై వీసా సంబంధిత రిజర్వేషన్లపైనా సుయెల్లా వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. భారత్‌తో ఎఫ్‌టీఏపై ఆందోళనలున్నట్లు పేర్కొన్నారు. దీనిపై భారత హైకమిషన్ స్పందిస్తూ.. ‘మొబిలిటీ, మైగ్రేషన్‌కు సంబంధించిన విషయాలపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఈ సమయంలో వాటి గురించి వ్యాఖ్యలు సమంజసం కాదు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందమైనా ఇరుదేశాలకు ప్రయోజనకరంగా ఉండాలి.’ అని పేర్కొంది. మరోవైపు.. యూకే మంత్రి వ్యాఖ్యలతో ఎఫ్‌టీఏలో భారతీయులకు వీసా రాయితీలకు మంత్రివర్గం మద్దతును నిలిపివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: రష్యా, ఉక్రెయిన్ ‘హక్కుల’ గ్రూప్‌లకు నోబెల్ శాంతి బహుమతి -
వలస విధానంపై నిర్దిష్ట లక్ష్యాలు అవసరం
సాక్షి, హైదరాబాద్ : వలస విధానంపై నిర్దిష్ట లక్ష్యాలు అవసరమని మాజీ రాయబారి బీఎం వినోద్‌కుమార్ అన్నారు. బేగంపేటలోని జీవన్‌జ్యోతిలో ‘గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్’ (జీసీఎం) అంశంపై రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ శుక్రవారం ప్రారంభమైంది. ఎంఎఫ్ఏ, ఎన్‌డబ్ల్యూడబ్ల్యూటీ, ఈడబ్ల్యూఎఫ్, ఐఎల్ఓ, సీఐఎంఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సురక్షిత, క్రమబద్ధమైన, చట్టపరమైన వలసలకు అంతర్జాతీయ సహకారం, ప్రపంచ భాగస్వామ్యం బలోపేతం చేయాలన్నారు. సామాజిక భద్రతా అర్హతలు, ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు ఉండాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం మాట్లాడుతూ.. ప్రజలు తమ స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేలా ప్రేరేపించే ప్రతికూల అంశాలపై దృష్టిసారించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, మైగ్రేట్స్ రైట్స్ యాక్టివిస్ట్ నర్సింహనాయుడు, ఎం.భీంరెడ్డి, సిస్టర్ లిస్సీ జోసఫ్, ఆశాలత, రఫీక్, రాజశేఖర్, డాక్టర్ తిలక్‌చందన్, మాణిక్యాలరావు పాల్గొన్నారు. -
పంజాబ్ టు అమెరికా వయా మెక్సికో
అక్రమ వలసలను అరికట్టడానికి అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. వలస నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ వేల మంది అక్రమ వలసదారుల్ని ప్రభుత్వం జైల్లో పెడుతోంది. అమెరికా కార్యక్రమాలు, వలస విధానానికి సంబంధించిన సంస్థ(యూఎన్ ప్రోగ్రామ్స్, మైగ్రేషన్ పాలసీ ఇనిస్టిట్యూట్) లెక్కల ప్రకారం ట్రంప్ అధికారంలోకి వచ్చే నాటికి(2017 సెప్టెంబర్) దేశంలోకి అక్రమంగా ప్రవేశించారన్న కారణంగా 2,227 మంది భారతీయులను అధికారులు పట్టుకున్నారు. 2017 అక్టోబర్ నుంచి 2018 మే మధ్య వీరి సంఖ్య 4,197కు పెరిగింది. వీరుకాక న్యూ మెక్సికో, ఒరెగాన్లలోని శరణార్థి శిబిరాల్లో ఉన్న వేల మందిలో దాదాపు 100మంది భారతీయులు ఉన్నారు. వీరిలో చాలా మంది పంజాబీలే. ఒకవైపు అక్రమ వలసదారులు వేల సంఖ్యలో పట్టుబడుతున్నా వలసదారులు మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు. పంజాబ్‌తోపాటు హరియాణ, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు తమ కలల తీరమైన అమెరికా చేరుకోవడానికి ప్రాణాలు పణంగా పెడుతున్నారు. అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికో నుంచి దొంగ తనంగా అమెరికాలో ప్రవేశిస్తున్నారు. ఇలా అక్రమంగా అమెరికా చేరాలనుకునే వారికి కొయటీస్(మనుషుల్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలించే వారిని ఇలా పిలుస్తారు)లు సహకరిస్తున్నారు. వేల రూపాయలు తీసుకుని వివిధ మార్గాల ద్వారా వీరు వలసదారులను మెక్సికో ద్వారా అమెరికాలోకి పంపుతున్నారు. పనిలో పనిగా ఈ వలసదారుల చేత బలవంతంగా మాదక ద్రవ్యాలను కూడా దొంగ రవాణా చేయిస్తుంటారు. అక్రమంగా అమెరికా వెళ్లాలనుకునే వారిని గుర్తించి ఒప్పందాలు చేసుకోవడం కోసం కోసం పంజాబ్ తదితర రాష్ట్రాల్లో దళారులు కూడా ఉన్నారు. 4,600కిమీ ప్రయాణం... దొడ్డిదారిన అమెరికా వెళ్లాలనుకునే వారిని కొయటీస్‌లు మొదట విమానంలో దక్షిణ అమెరికా దేశమైన ఈక్విడార్‌కు తీసుకెళ్తారు. ఈక్విడార్ ప్రభుత్వం ‘90డే వీసా ఆన్ అరైవల్’ విధానాన్ని అమలు పరచడం, మెక్సికో ప్రభుత్వం వలసవిధానాన్ని కచ్చితంగా అమలు పరస్తుండటం వల్ల కొయటీస్‌లు వలసదారులను నేరుగా మెక్సికోకు కాకుండా ఈక్విడార్‌కు తీసుకెళ్తారు.అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా కొలంబియాలోని కపుర్గన చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా నికరగువాకు వెళతారు. పనామా అడవుల గుండా వీరు ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లేటప్పుడు బస్సులు, కార్లలో ఏర్పాటు చేసిన రహస్య అరల్లో వీరిని దాస్తారు. నికరగువా నుంచి హోండూరస్, గ్వాటెమాలాల మీదుగా ప్రయాణించి వీరు మెక్సికో చేరుకుంటారు. సరిహద్దు దాటించేదిలా.... రెండు దేశాల సరిహద్దులో కంచె ఉన్నా చాలా చోట్ల ఖాళీలు (కంచెలేని ప్రాంతాలు) ఉన్నాయి. అక్కడ నుంచి వలసదారులను సరిహద్దు దాటిస్తున్నారు. సరిహద్దు అధికారులతో ఉన్న ‘పరిచయా’లతో కొయిట్లు వీరిని వీలున్న ప్రాంతం నుంచి అమెరికాలోకి పంపుతారు. ఒకోసారి చిన్న పిల్లల్ని సరిహద్దు దాటించి అధికారులు వారిని పట్టుకునే హడావుడిలో ఉండగా మరోవైపు నుంచి వలసదారుల్ని కంచె దాటించేస్తారు. కొందరికి అమెరికా ప్రభుత్వాన్ని శరణార్థి హోదా కోరుతూ రాసిన దరఖాస్తులు ఇచ్చి వాటితో సహా సరిహద్దుల్లో ఉన్న 48 చట్టబద్ధమైన ప్రవేశ మార్గాల్లో ఏదో ఒక చోట అధికారులకు దొరికిపోయేలా చేస్తారు. వీరిని అధికారులు పట్టుకున్నా శరణార్ధుల దరఖాస్తులు ఉండటంతో వెంటనే తిప్పి పంపరు. ఈక్విడార్ నుంచి అమెరికాకు ఉన్న 4,600 కిలో మీటర్ల ఈ ప్రయాణంలో కొన్ని రోజుల పాటు వీరికి ఆహారం కూడా దొరకదు. ఆకలితోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ కారణంగా దారిలో కొందరు చనిపోవడం కూడా జరుగుతుంది. బయలు దేరిన వారిలో ఎంత మంది గమ్యం చేరుకుంటారు... ఎందరు దారిలోనే ప్రాణాలు పొగొట్టుకుంటారన్నది బయటి ప్రపంచానికి తెలియదు. వలసదారులను తరలిస్తున్న సమాచారాన్ని దారిలో ఉన్న దేశాల్లోని కొయటీస్‌లు ఒకరికొకరు సెల్ఫోన్ల ద్వారా పంపించుకుంటారు. అవసరమైన సొమ్మును వెస్ట్రన్ యూనియన్, మనీగ్రాంల నుంచి బదిలీ చేస్తుంటారు. మెక్సికోకు అమెరికాతో 3,155 కిలో మీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు పొడవునా1100 కిలో మీటర్ల మేర కంచె ఉంది. అత్యాధునిక పరికరాలు, ఆయుధాలతో దాదాపు16వేల మంది సైనికులు సరిహద్దు వద్ద కాపలా కాస్తుంటారు. అమెరికా చేరే దారులివీ: మొదట ఈక్విడార్ విమానంలో తీసుకెళ్తారు.అక్కడ నుంచి కొలంబియా, పనామా అడవుల మీదుగా మెక్సికో తీసుకెళతారు.ఈ ప్రయాణానికి నెల నుంచి మూడు నెలలు పడుతుంది. 8 నుంచి 15వేల అమెరికా డాలర్లు వసూలు చేస్తారు. మొదట కొలంబియా, పెరు, బొలీవియా చేరుకుంటారు. అక్కడ నుంచి ఏదైనా మధ్య అమెరికా దేశానికి వెళ్లి అక్కడ నుంచి మెక్సికో వెళతారు. ఒక్కోసారి నకిలీ డాక్యుమెంట్లతో నేరుగా మెక్సికోకే పంపుతారు. ఈ దారిలో అమెరికా చేరడానికి కొన్ని వారాలు/నెలలు పడుతుంది. 10 నుంచి 20 వేల డాలర్ల వరకు వసూలు చేస్తారు. (రవాణా చార్జీలు, తిండి ఖర్చు, నకిలీ డాక్యుమెంట్లు, స్థానిక అధికారులకు ఇచ్చే లంచాలు.. అన్నీ దీనిలో కలిసే ఉంటాయి) - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పొరుగువారిపై ట్రంప్ మరో పిడుగు
సాక్షి, వాషింగ్టన్ : నిరంతర వలస విధానానికి(చైన్ మైగ్రేషన్) స్వస్తి పలకనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అలాగే, లాటరీ వీసా కార్యక్రమాన్ని కూడా వదిలించుకుంటామని స్పష్టం చేశారు. న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి బంగ్లాదేశ్‌కు చెందిన అకాయెడ్ ఉల్లా అనే వలసదారుడే కారణంగా అని ఈ సందర్భంగా చెప్పారు. 'వీసా లాటరీ ప్రోగ్రాంకు, నిరంతర వలస విధానానికి మేం త్వరలోనే స్వస్తి పలుకుతాం' అని ట్రంప్ గురువారం పత్రికా సమావేశంలో తెలిపారు. లాటరీ కార్యక్రమం ద్వారా తమ దేశంలోకి చాలా చెడ్డవాళ్లు అడుగుపెడుతున్నారని, దీనిని ఇక భరించలేమని చెప్పారు. అలాంటి ప్రజలు తమ దేశానికి వద్దని, అలాంటి వారితో తనకు భయంగా ఉందని, అసహ్యం వేస్తుందని, నీచంగా అనిపిస్తోందని చెప్పారు. ఇక అమెరికా తిరిగి ఎప్పటిలాగా బలం పుంజుకుంటోందని, వేగంగా పునర్వైభవం సంతరించుకుంటుందని త్వరలోనే ప్రపంచమంతా చూస్తుందని తెలిపారు. దేశం దాటి వెళ్లిన నాలుగు ట్రిలియన్ డాలర్లు తిరిగి స్వదేశానికి తిరిగి రానున్నాయని చెప్పారు. పన్ను కోడ్లలో తాము తీసుకొచ్చిన మార్పులు అందుకు సహకరిస్తాయని, తమ దేశ కంపెనీలన్నీ తిరిగి విదేశాల నుంచి ఆదాయాన్ని పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని 14మంది సభ్యుల అపెక్స్ బాడీ వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడంపై ట్రంప్ స్పందించారు. అదే సమయంలో అమెరికా ప్రతినిధి హాలీ ఆ తీర్మానాన్ని వీటో చేయడంపై కూడా మాట్లాడారు. 'తనకు మద్దతు ఇచ్చిన హాలీకి ధన్యవాదాలు. ఇతర దేశాలు తమ అధికారాన్ని ఉపయోగించాలని చూసినా హాలీ నాకు మద్దతుగా ఉన్నారు. వాళ్లంతా మాదగ్గర నుంచి మిలియన్స్‌లలో బిలియన్స్ డాలర్లలో డబ్బులు తీసుకుంటారు. కానీ, మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. మేం అన్నింటిని గమనిస్తున్నాం. వాళ్లు అలాగే ఓటు వేసుకోనిద్దాం. మనం మరింత డబ్బు ఆదా చేద్దాం. ఈ విషయంలో ఎవరినీ మనం అతి చేయనివ్వొద్దు' అని ఆయన చెప్పారు.