అక్రమ వలసలను అరికట్టడానికి అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో చర్యలు తీసుకుంటోంది. వలస నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ వేల మంది అక్రమ వలసదారుల్ని ప్రభుత్వం జైల్లో పెడుతోంది. అమెరికా కార్యక్రమాలు, వలస విధానానికి సంబంధించిన సంస్థ(యూఎన్ ప్రోగ్రామ్స్, మైగ్రేషన్ పాలసీ ఇనిస్టిట్యూట్) లెక్కల ప్రకారం ట్రంప్ అధికారంలోకి వచ్చే నాటికి(2017 సెప్టెంబర్) దేశంలోకి అక్రమంగా ప్రవేశించారన్న కారణంగా 2,227 మంది భారతీయులను అధికారులు పట్టుకున్నారు. 2017 అక్టోబర్ నుంచి 2018 మే మధ్య వీరి సంఖ్య 4,197కు పెరిగింది. వీరుకాక న్యూ మెక్సికో, ఒరెగాన్‌లలోని శరణార్థి శిబిరాల్లో ఉన్న వేల మందిలో దాదాపు 100మంది భారతీయులు ఉన్నారు. వీరిలో చాలా మంది పంజాబీలే.
ఒకవైపు అక్రమ వలసదారులు వేల సంఖ్యలో పట్టుబడుతున్నా వలసదారులు మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు. పంజాబ్‌తోపాటు హరియాణ, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు తమ కలల తీరమైన అమెరికా చేరుకోవడానికి ప్రాణాలు పణంగా పెడుతున్నారు. అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికో నుంచి దొంగ తనంగా అమెరికాలో ప్రవేశిస్తున్నారు. ఇలా అక్రమంగా అమెరికా చేరాలనుకునే వారికి కొయటీస్(మనుషుల్ని అక్రమంగా ఇతర దేశాలకు తరలించే వారిని ఇలా పిలుస్తారు)లు సహకరిస్తున్నారు. వేల రూపాయలు తీసుకుని వివిధ మార్గాల ద్వారా వీరు వలసదారులను మెక్సికో ద్వారా అమెరికాలోకి పంపుతున్నారు. పనిలో పనిగా ఈ వలసదారుల చేత బలవంతంగా మాదక ద్రవ్యాలను కూడా దొంగ రవాణా చేయిస్తుంటారు. అక్రమంగా అమెరికా వెళ్లాలనుకునే వారిని గుర్తించి ఒప్పందాలు చేసుకోవడం కోసం కోసం పంజాబ్ తదితర రాష్ట్రాల్లో దళారులు కూడా ఉన్నారు.
4,600కిమీ ప్రయాణం...
దొడ్డిదారిన అమెరికా వెళ్లాలనుకునే వారిని కొయటీస్‌లు మొదట విమానంలో దక్షిణ అమెరికా దేశమైన ఈక్విడార్‌కు తీసుకెళ్తారు. ఈక్విడార్ ప్రభుత్వం ‘90డే వీసా ఆన్ అరైవల్’ విధానాన్ని అమలు పరచడం, మెక్సికో ప్రభుత్వం వలసవిధానాన్ని కచ్చితంగా అమలు పరస్తుండటం వల్ల కొయటీస్‌లు వలసదారులను నేరుగా మెక్సికోకు కాకుండా ఈక్విడార్‌కు తీసుకెళ్తారు.అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా కొలంబియాలోని కపుర్‌గన చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా నికరగువాకు వెళతారు. పనామా అడవుల గుండా వీరు ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లేటప్పుడు బస్సులు, కార్లలో ఏర్పాటు చేసిన రహస్య అరల్లో వీరిని దాస్తారు. నికరగువా నుంచి హోండూరస్, గ్వాటెమాలాల మీదుగా ప్రయాణించి వీరు మెక్సికో చేరుకుంటారు.
సరిహద్దు దాటించేదిలా....
రెండు దేశాల సరిహద్దులో కంచె ఉన్నా చాలా చోట్ల ఖాళీలు (కంచెలేని ప్రాంతాలు) ఉన్నాయి. అక్కడ నుంచి వలసదారులను సరిహద్దు దాటిస్తున్నారు. సరిహద్దు అధికారులతో ఉన్న ‘పరిచయా’లతో కొయిట్‌లు వీరిని వీలున్న ప్రాంతం నుంచి అమెరికాలోకి పంపుతారు. ఒకోసారి చిన్న పిల్లల్ని సరిహద్దు దాటించి అధికారులు వారిని పట్టుకునే హడావుడిలో ఉండగా మరోవైపు నుంచి వలసదారుల్ని కంచె దాటించేస్తారు. కొందరికి అమెరికా ప్రభుత్వాన్ని శరణార్థి హోదా కోరుతూ రాసిన దరఖాస్తులు ఇచ్చి వాటితో సహా సరిహద్దుల్లో ఉన్న 48 చట్టబద్ధమైన ప్రవేశ మార్గాల్లో ఏదో ఒక చోట అధికారులకు దొరికిపోయేలా చేస్తారు. వీరిని అధికారులు పట్టుకున్నా శరణార్ధుల దరఖాస్తులు ఉండటంతో వెంటనే తిప్పి పంపరు. ఈక్విడార్ నుంచి అమెరికాకు ఉన్న 4,600 కిలో మీటర్ల ఈ ప్రయాణంలో కొన్ని రోజుల పాటు వీరికి ఆహారం కూడా దొరకదు. ఆకలితోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ కారణంగా దారిలో కొందరు చనిపోవడం కూడా జరుగుతుంది. బయలు దేరిన వారిలో ఎంత మంది గమ్యం చేరుకుంటారు... ఎందరు దారిలోనే ప్రాణాలు పొగొట్టుకుంటారన్నది బయటి ప్రపంచానికి తెలియదు.
వలసదారులను తరలిస్తున్న సమాచారాన్ని దారిలో ఉన్న దేశాల్లోని కొయటీస్‌లు ఒకరికొకరు సెల్‌ఫోన్ల ద్వారా పంపించుకుంటారు. అవసరమైన సొమ్మును వెస్ట్రన్ యూనియన్, మనీగ్రాంల నుంచి బదిలీ చేస్తుంటారు.
మెక్సికోకు అమెరికాతో 3,155 కిలో మీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు పొడవునా1100 కిలో మీటర్ల మేర కంచె ఉంది. అత్యాధునిక పరికరాలు, ఆయుధాలతో దాదాపు16వేల మంది సైనికులు సరిహద్దు వద్ద కాపలా కాస్తుంటారు.
అమెరికా చేరే దారులివీ:
మొదట ఈక్విడార్ విమానంలో తీసుకెళ్తారు.అక్కడ నుంచి కొలంబియా, పనామా అడవుల మీదుగా మెక్సికో తీసుకెళతారు.ఈ ప్రయాణానికి నెల నుంచి మూడు నెలలు పడుతుంది. 8 నుంచి 15వేల అమెరికా డాలర్లు వసూలు చేస్తారు.
మొదట కొలంబియా, పెరు, బొలీవియా చేరుకుంటారు. అక్కడ నుంచి ఏదైనా మధ్య అమెరికా దేశానికి వెళ్లి అక్కడ నుంచి మెక్సికో వెళతారు. ఒక్కోసారి నకిలీ డాక్యుమెంట్లతో నేరుగా మెక్సికోకే పంపుతారు. ఈ దారిలో అమెరికా చేరడానికి కొన్ని వారాలు/నెలలు పడుతుంది. 10 నుంచి 20 వేల డాలర్ల వరకు వసూలు చేస్తారు. (రవాణా చార్జీలు, తిండి ఖర్చు, నకిలీ డాక్యుమెంట్లు, స్థానిక అధికారులకు ఇచ్చే లంచాలు.. అన్నీ దీనిలో కలిసే ఉంటాయి)
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment