military commission
-
‘మావో’ళ్లు 4739 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి ఆయువుపట్టు, ఆపరేషన్ కమాండ్ గ్రూప్ పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ఏర్పాటై ఈ డిసెంబర్‌కు 20 ఏళ్లు. ఆ పార్టీ కేంద్ర కమిటీ ఒకప్పటి కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి నేతృత్వంలో 2000లో ఏర్పాటు చేసిన పీఎల్జీఏను పీజీఏ (పీపుల్స్ గెరిల్లా ఆర్మీ) అని కూడా మావోయిస్టు పార్టీ పిలుస్తోంది. సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పీఎల్జీఏ ఏర్పా టై ఇరవై ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కమిటీ ఓ సావనీర్ విడుదల చేసింది. ఈ ఇరవై ఏళ్లలో పీఎల్జీఏ చేసిన ఆపరేషన్స్, మావోయిస్టులు, పోలీసులు ఎంతమంది చనిపోయారన్న పూర్తి వివరాలను అందులో పేర్కొంది. పీఎల్జీఏ రెండు దశాబ్దాల్లో సాగించిన ఆపరేషన్స్‌లో కేంద్రకమిటీ సభ్యులతోపాటు రాష్ట్ర కార్యదర్శులు, సభ్యు లు, డివిజన్ కమిటీ కార్యదర్శులు, మెంబర్లు, ఏరియా కమిటీ సభ్యులు, దళసభ్యులు మొత్తం 4,739 మందిని కోల్పోయినట్లు సావనీర్లో తెలిపింది. ఇందులో 909 మంది మహిళామావోయిస్టులుండగా, 16 మంది కేంద్రకమిటీ సభ్యులు, 44 మంది స్పెషల్ ఏరియా/స్పెషల్ జోన్/రాష్ట్ర కమిటీ సభ్యులు, 9 మంది రీజినల్ కమిటీ సభ్యులు, 168 మంది జోన్/డివిజన్/జిల్లా కమిటీ సభ్యులు మృతిచెందగా, మిగిలినవారిలో ఏరియా సభ్యులు, గ్రామదళ సభ్యులున్నట్టు పేర్కొంది. పీఎల్జీఏ ఆపరేషన్స్‌లో 3,054 పోలీసుల మృతి పీఎల్జీఏ 2000 నుంచి 2021 జూలై వరకు జరిపిన మిలటరీ ఆపరేషన్స్‌లో 3,054 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సాయుధ పోలీసు బలగాల సిబ్బంది, అధికారులు మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మరో 3,672 మంది పోలీస్ బలగాల సిబ్బంది క్షతగ్రాతులైనట్టు, 3,222 ఆయుధాలు, 1,55,356 తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మొత్తం 4,572 ఆపరేషన్స్ నిర్వహించగా, వాటిల్లో భారీవి 210 కాగా, మధ్యస్థ 331, మైనర్ ఆపరేషన్స్ 4,031 ఉన్నట్టు వెల్లడించింది. సీఆర్పీఎఫ్ ఉపయోగించిన రక్షణ శాఖ హెలికాప్టర్లపై కూడా దాడులు నిర్వహించినట్టు తెలిపింది. 2008, 2010, 2011, 2012, 2013లో హెలికాప్టర్లపై తూటాల వర్షం కురిపించగా, కమాండర్ స్థాయి అధికారితోపాటు ముగ్గురు సిబ్బంది మరణించినట్టు పేర్కొంది. 2021 ఏప్రిల్ 19న సుక్మా–బీజాపూర్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ డ్రోన్ సహాయంతో బాంబుదాడులు చేసిందని, ప్రతిదాడి చేసి దానిని కూల్చివేసినట్టు తెలిపింది. ఇలా పలు డ్రోన్ దాడులను కూడా నిర్వీర్యం చేసినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సింగిల్ యాక్షన్‌లో నేతల హతం సింగిల్ యాక్షన్‌లో భాగంగా 2007లో జార్ఖండ్ టాటానగర్ ఎంపీ సునీల్ మçహతోను, అతడి ముగ్గురు బాడీగార్డులు, ఇతరులను ఒకేసారి పీఎల్జీఏ హతమార్చినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతోపాటు 13 మంది బాడీగార్డులను 2013 మే 25న నిర్మూలించినట్టు పార్టీ పేర్కొంది. ఏపీలో 2018, సెప్టెంబర్ 23న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాను హతమర్చినట్టు తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో 2019 ఏప్రిల్ 9 దంతెవాడ ఎమ్మెల్యే భీమా మాండావితోపాటు అతడి నలుగురు బాడీగార్డులను బుల్లెట్ వాహనంతో సహా పేల్చివేసినట్టు తెలిపింది. -
రిజర్వు బలగాలకూ జిన్‌పింగే బాస్
బీజింగ్: చైనా మిలటరీ రిజర్వు బలగాలు కూడా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ), సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) అజమాయిషీ కిందికి వచ్చాయి. మావో సెటుంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన జిన్‌పింగ్ ఇప్పటికే సీపీసీ, సీఎంసీలకు నేతృత్వం వహిస్తున్నారు. దేశానికి ప్రపంచ స్థాయి సైన్యాన్ని నిర్మించడానికి తిరుగులేని నాయకత్వం అవసరమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వు బలగాలు జూలై 1వ తేదీ నుంచి సీపీసీ, సీఎంసీల ఆదేశాలకు లోబడి పనిచేస్తాయని అందులో పేర్కొంది. ప్రస్తుతం రిజర్వు బలగాలు సైనిక విభాగాలు, కమ్యూనిస్టు పార్టీ స్థానిక కమిటీల అజమాయిషీలో ఉన్నాయి. -
ఏజెన్సీలో సవాల్..!
దగ్గర పడుతున్న మలివిడత పోలింగ్ అధికారుల్లో పెరుగుతోన్న టెన్షన్ మన్యంలో మకాం వేసిన దళసభ్యులు ఈస్టు డివిజన్లో అడుగుపెట్టిన మావోయిస్టు అగ్రనేత ? గుత్తి కోయలు భారీగా ఉన్నట్టుగా సమాచారం కూంబింగ్ ఉధృతం చేసిన పోలీసులు కొయ్యూరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలో ‘పరిషత్’ పోలింగ్‌కు మూడు రోజులే గడువుంది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ అందరిలో టెన్షన్ పెరిగిపోతోంది. మన్యంలో ఎన్నికల నిర్వహణ ఎప్పుడూ సవాలే. మలివిడతగా ఈ నెల 11న మన్యంలోని 11 మండలాలతోపాటు సరిహద్దులోని మరో ఆరింట ప్రశాంతంగా నిర్వహణ పోలీసులకు కత్తిమీదసాము లాంటిదే. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కేంద్రాల కంటే స్థానిక ఎన్నికల పోలింగ్ కేంద్రాలు అధికంగా ఉన్నాయి. దీంతో ప్రతీ కేంద్రం వద్ద గట్టి భద్రత చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు విధ్వంసాల కోసం కాచుకుని ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిని ధ్రువపరుస్తూ మన్యమంతటా పోస్టర్లు బ్యానర్లతో ప్రచారం చేస్తున్నారు. ఈస్టు డివిజన్లో ఏవోబీ మిలటరీ కమిషన్ ఇన్చార్జి చలపతి ఆధ్వర్యంలో ఒక బృందం సంచరిస్తున్నట్టు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. ఆయన ఏదైనా విధ్వంసానికి వ్యూహరచన చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కొయ్యూరు, జీకేవీధి సరిహద్దుల్లో కూంబింగ్ ఉధృతం చేశారు. దళాలకు తోడుగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుమారు వంద మంది వరకు గుత్తికోయలు కూడా వచ్చారని భోగట్టా. నెలరోజుల కిందట ఏడు యాక్షన్ టీంలను ఏర్పాటు చేసినట్టు సమాచారంతోరాజకీయ పార్టీల నేతలకు నోటీసులు పంపి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఆదేశించారు. ఈమేరకు పలువురు మారుమూల ప్రాంతాలకు వెళ్లడం మానేశారు. ప్రతి ఎన్నికల్లోనూ మావోయిస్టులు హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. 1999లో బూదరాళ్ల పోలింగ్ కేంద్రంపై దాడి చేసి బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోయారు. 2004లో పలకజీడిలో జీపును దగ్ధం చేశారు. 2009లో పోలింగ్‌కు వారంరోజుల ముందు జీపును కాల్చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వారి పోకడ అందరికీ తెలిసిందే. దీంతో గూడెం కొత్తవీధి-కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో కూంబింగ్ ఉధృతం చేశారు. కాగా అతి కొద్ది ఓట్లు గెలుపు ఓటములను నిర్దేశించే ‘పరిషత్’ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు నిగ్రహం కోల్పోవడం సర్వసాధారణం. ఇక గ్రామాల్లో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తదితర పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందన్న వాదన ఉంది. ఇదే అదనుగా ఏవోబీలో తమ ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా కొయ్యూరు, జీకేవీధి, జి.మాడుగుల,చింతపల్లి, పెదబయలు,ముంచంగిపుట్టు మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి తగిన బందోబస్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.