సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి ఆయువుపట్టు, ఆపరేషన్ కమాండ్ గ్రూప్ పీఎల్‌జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ఏర్పాటై ఈ డిసెంబర్‌కు 20 ఏళ్లు. ఆ పార్టీ కేంద్ర కమిటీ ఒకప్పటి కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి నేతృత్వంలో 2000లో ఏర్పాటు చేసిన పీఎల్‌జీఏను పీజీఏ (పీపుల్స్ గెరిల్లా ఆర్మీ) అని కూడా మావోయిస్టు పార్టీ పిలుస్తోంది. సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పీఎల్‌జీఏ ఏర్పా టై ఇరవై ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కమిటీ ఓ సావనీర్ విడుదల చేసింది.
ఈ ఇరవై ఏళ్లలో పీఎల్‌జీఏ చేసిన ఆపరేషన్స్, మావోయిస్టులు, పోలీసులు ఎంతమంది చనిపోయారన్న పూర్తి వివరాలను అందులో పేర్కొంది. పీఎల్‌జీఏ రెండు దశాబ్దాల్లో సాగించిన ఆపరేషన్స్‌లో కేంద్రకమిటీ సభ్యులతోపాటు రాష్ట్ర కార్యదర్శులు, సభ్యు లు, డివిజన్ కమిటీ కార్యదర్శులు, మెంబర్లు, ఏరియా కమిటీ సభ్యులు, దళసభ్యులు మొత్తం 4,739 మందిని కోల్పోయినట్లు సావనీర్‌లో తెలిపింది.
ఇందులో 909 మంది మహిళామావోయిస్టులుండగా, 16 మంది కేంద్రకమిటీ సభ్యులు, 44 మంది స్పెషల్ ఏరియా/స్పెషల్ జోన్/రాష్ట్ర కమిటీ సభ్యులు, 9 మంది రీజినల్ కమిటీ సభ్యులు, 168 మంది జోన్/డివిజన్/జిల్లా కమిటీ సభ్యులు మృతిచెందగా, మిగిలినవారిలో ఏరియా సభ్యులు, గ్రామదళ సభ్యులున్నట్టు పేర్కొంది.
పీఎల్‌జీఏ ఆపరేషన్స్‌లో 3,054 పోలీసుల మృతి
పీఎల్‌జీఏ 2000 నుంచి 2021 జూలై వరకు జరిపిన మిలటరీ ఆపరేషన్స్‌లో 3,054 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సాయుధ పోలీసు బలగాల సిబ్బంది, అధికారులు మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
మరో 3,672 మంది పోలీస్ బలగాల సిబ్బంది క్షతగ్రాతులైనట్టు, 3,222 ఆయుధాలు, 1,55,356 తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మొత్తం 4,572 ఆపరేషన్స్ నిర్వహించగా, వాటిల్లో భారీవి 210 కాగా, మధ్యస్థ 331, మైనర్ ఆపరేషన్స్ 4,031 ఉన్నట్టు వెల్లడించింది. సీఆర్‌పీఎఫ్ ఉపయోగించిన రక్షణ శాఖ హెలికాప్టర్లపై కూడా దాడులు నిర్వహించినట్టు తెలిపింది. 2008, 2010, 2011, 2012, 2013లో హెలికాప్టర్లపై తూటాల వర్షం కురిపించగా, కమాండర్ స్థాయి అధికారితోపాటు ముగ్గురు సిబ్బంది మరణించినట్టు పేర్కొంది.
2021 ఏప్రిల్ 19న సుక్మా–బీజాపూర్ అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ డ్రోన్ సహాయంతో బాంబుదాడులు చేసిందని, ప్రతిదాడి చేసి దానిని కూల్చివేసినట్టు తెలిపింది. ఇలా పలు డ్రోన్ దాడులను కూడా నిర్వీర్యం చేసినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
సింగిల్ యాక్షన్‌లో నేతల హతం
సింగిల్ యాక్షన్‌లో భాగంగా 2007లో జార్ఖండ్ టాటానగర్ ఎంపీ సునీల్ మçహతోను, అతడి ముగ్గురు బాడీగార్డులు, ఇతరులను ఒకేసారి పీఎల్‌జీఏ హతమార్చినట్టు మావోయిస్టు పార్టీ తెలిపింది. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతోపాటు 13 మంది బాడీగార్డులను 2013 మే 25న నిర్మూలించినట్టు పార్టీ పేర్కొంది.
ఏపీలో 2018, సెప్టెంబర్ 23న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాను హతమర్చినట్టు తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో 2019 ఏప్రిల్ 9 దంతెవాడ ఎమ్మెల్యే భీమా మాండావితోపాటు అతడి నలుగురు బాడీగార్డులను బుల్లెట్ వాహనంతో సహా పేల్చివేసినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment