milky way galaxy
-
ఆకాశంలో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయట!
రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే కోట్ల కొద్దీ నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని ఆకారాలూ కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నక్షత్రాలన్నీ స్థానం మారిపోతాయని.. ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని అంటున్నారు. మరి దానికి కారణం ఏమిటో తెలుసా? మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ, సమీపంలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండూ ఢీకొని కలసిపోనుండటమే. ఇప్పటికే ఈ రెండూ ఒకదానికొకటి సమీపంలోకి వస్తున్నాయి. మరో 375 కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొనడం మొదలవుతుంది. సుమారు 700 కోట్ల ఏళ్ల తర్వాత రెండూ పూర్తిగా కలసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయి. ఈ క్రమంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోతాయి. వాటి స్థానాలు మారిపోతాయి. మరి ఇలా రెండూ దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్నప్పుడు మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై నాసా ఓ వీడియోను రూపొందించింది. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ తీసిన చిత్రాలు, దాని సాయంతో చేసిన పరిశీలన ఆధారంగా సిద్ధం చేసిన ఈ వీడియోను.. చంద్ర అబ్జర్వేటరీ పేరిట ఉన్న ‘ఎక్స్ (ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది. మనం చూసేది పాలపుంతే కాదు..! మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే) గెలాక్సీ అంటూ ఫొటోల్లో, ఇంటర్నెట్లో మనం చూస్తున్నది నిజానికి పాలపుంత ఫొటో కానే కాదు. అసలు మనం పాలపుంత మొత్తం చిత్రాన్ని తీయడం సాధ్యమే కాదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్న పాలపుంత గెలాక్సీలో మధ్య భాగానికి ఓ పక్కన మన సూర్యుడు, భూమి ఉన్నాయి. పాలపుంత గెలాక్సీ మొత్తాన్ని దాటి బయటికి వెళితే తప్ప దీనిని ఫొటో తీయలేం! ఎలాగంటే.. సముద్రం మధ్య చిన్న పడవలో కెమెరా పట్టుకుని కూర్చున్న మనం వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్రం మొత్తాన్ని ఫొటో తీయగలమా? ఇదీ అంతే.. మరి మనం చూసే పాలపుంత చిత్రం ఏమిటి అంటారా.. దాదాపుగా పాలపుంతలా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ చిత్రమే. ఈ గెలాక్సీయే భవిష్యత్తులో పాలపుంతను ఢీకొట్టేది. -
కెమెరా కంటికి చిక్కిన సూపర్నోవా
సువిశాలమైన అంతరిక్షం.. ఎన్నెన్నో విశేషాలకు ఆలవాలం. అంతరిక్షంలోని కోటాను కోట్ల నక్షత్రాల్లో కొన్ని అంతరించిపోతుంటాయి. తారల జీవితకాలం ముగియగానే వాటిలోని ఇంధనం మండిపోయి, అదృశ్యమైపోతుంటాయి. చివరి దశకు వచ్చినప్పుడు ఒక నక్షత్రం ఎలా ఉంటుంది? అంతమయ్యే ముందు ఏం జరుగుతుంది? నక్షత్రాలు మృత తారలుగా మారడానికి ముందు పరిణామాలేంటి? ఇవన్నీ ప్రత్యక్షంగా చూడాలని ఆసక్తి ఉన్నప్పటికీ మన కంటికి కనిపించవు. నక్షత్రాలు మన భూమికి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండడమే ఇందుకు కారణం. తారల కేంద్ర భాగం(కోర్)లో అణు విచ్ఛిత్తి జరిగి పేలిపోతుంటాయి. నక్షత్రాలు పేలిపోయి, అంతం కావడాన్ని సూపర్నోవా అంటారు. ఇలాంటి ఒక సూపర్నోవాను ప్రముఖ అస్ట్రో ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ తన కెమెరాలో చక్కగా బంధించారు. పిన్‌వీల్ లేదా ఎం10 అనే పాలపుంత(గెలాక్సీ)ని ఆయన తన టెలిస్కోప్‌తో నిశితంగా పరిశీలించారు. ఆ పాలపుంతలో కాలం తీరిన ఒక నక్షత్రం పేలిపోయి, అంతమైపోవడాన్ని టెలిస్కోప్ ద్వారా కొన్ని ఫ్రేమ్‌లను తన కెమెరాలో బంధించి, దృశ్యబద్ధం చేశారు. దీన్ని ఒక యానిమేషన్‌గా మార్చారు. మృత నక్షత్రాన్ని చిత్రీకరించడానికి ఆ గెలాక్సీకి సంబంధించిన కలర్ డేటాను ఉపయోగించానని ఆండ్రూ మెక్‌కార్తీ చెప్పారు. నక్షత్రానికి చెందిన 10 నిమిషాల ఎక్సపోజర్తో యానిమేషన్ రూపొందించినట్లు తెలిపారు. ఎరుపు, తెలుపు వర్ణాలతో ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. మరో విశేషం ఏమిటంటే.. సూర్యుడు తన జీవితకాలమంతా వెలువరించే శక్తి కంటే ఎక్కువ శక్తి కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో సంభవించే సూపర్నోవాలో వెలువడుతుందట! కాంతి, వేడి, రేడియేషన్ రూపంలో ఈ శక్తి ఉద్గారమవుతుంది. సూపర్నోవా గాఢమైన ప్రభావం దాని పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. పిన్‌వీల్(ఎం10) పాలపుంత(మిల్కీవే) ప్రస్తుతం మనం ఉంటున్న పాలపుంత కంటే 70 శాతం పెద్దది. దాని వ్యాసం 1,70,000 కాంతి సంవత్సరాలు. మన భూమి నుంచి 21 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నక్షత్రాల సమూహం.. ఆర్ఆర్ లైర్.. ఆండ్రోమెడాకు ఏకంగా సగం దూరంలో
వాషింగ్టన్: మన పాలపుంతలో అత్యంత సుదూరంలో ఉన్న నక్షత్రాల సమూహాన్ని తాజాగా గుర్తించారు. ఆర్ఆర్ లైర్గా పిలుస్తున్న ఈ తారలు పాలపుంత చివరి అంచుల్లో, మనకు అతి సమీపంలో ఉన్న నక్షత్ర మండలమైన ఆండ్రోమెడాకు ఏకంగా సగం దూరంలో ఉండటం విశేషం! ఇప్పటిదాకా కనీసం ఇలాంటి 200 నక్షత్రాలను గుర్తించారు. వీటిల్లో అత్యంత దూరాన ఉన్న నక్షత్రమైతే భూమి నుంచి ఏకంగా 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది! ఆండ్రోమెడా నక్షత్ర మండలం భూమి నుంచి 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్న సంగతి తెలిసిందే. మిగతా విశ్వంలో మాదిరిగా పాలపుంత చివరి అంచుల్లో అత్యధిక భాగం డార్క్ మ్యాటర్‌తోనే నిండి ఉంటుంది. విశ్వపు మౌలిక నిర్మాణానికి ఆధారం ఇదేనని భావిస్తారు. దీని గురుత్వాకర్షణ శక్తి కారణంగానే అంతరిక్షంలోని దృగ్గోచర ద్రవ్యరాశి ఒక్కచోటికి చేరి తారలు, తారా మండలాలు పుట్టుకొస్తాయన్నది శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ పరిశోధన వల్ల పాలపుంత ఆవలి హద్దుల్లో ఏముందనే దానిపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని దీనిలో భాగం పంచుకున్న యూసీ శాంతాక్రుజ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్ ప్రొఫెసర్ రాజగుహ ఠాకూర్త చెబుతున్నారు. -
‘ఆపాత’ పాలపుంతలు!
వాషింగ్టన్: అచ్చం మన పాలపుంత మాదిరిగా ఉండే నక్షత్ర మండలాలను నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. ఇవన్నీ విశ్వం ప్రస్తుత వయసులో కేవలం మూడో వంతు ఉన్నప్పుడు, అంటే దాదాపు 1,100 కోట్ల ఏళ్ల కింద ఏర్పడ్డాయట! ఈ క్రమంలో విశ్వంలోకెల్లా అత్యంత పురాతన నక్షత్ర మండలాన్ని కూడా జేమ్స్ వెబ్ గుర్తించింది. అది ఏకంగా 1,350 కోట్ల ఏళ్లనాటిదట. అప్పటికి విశ్వం ఆవిర్భవించి కేవలం 30 కోట్ల ఏళ్లేనట! ఈ నక్షత్ర మండలాల కేంద్ర స్థానం నుంచి ఇతర నక్షత్ర రాశుల దాకా విస్తరించి ఉన్న స్టెల్లర్ బార్స్‌ను కూడా వీటిలో గమనించడం విశేషం. ఈ బార్స్ మన పాలపుంతలోనూ ఉన్నాయి. అయితే విశ్వపు తొలి యుగాల నాటి నక్షత్ర మండలాల్లో ఇవి కన్పించడం ఇదే తొలిసారని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ శ్రద్ధా జోగీ అన్నారు. ఈ నేపథ్యంలో నక్షత్ర మండలాల పుట్టుక, వికాసాలను గురించిన సిద్ధాంతాలను సరిచూసుకోవాల్సి రావచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నక్షత్ర మండలాలను గతంలో హబుల్ టెలిస్కోప్ కూడా గుర్తించినా వాటిలో ఈ బార్స్ కనిపించలేదన్నారు. ‘‘ఇవి నక్షత్రాలతో పాటు అంతరిక్ష ధూళి, వాయువుల కదలికలను ప్రభావితం చేయడంతో పాటు తారల పుట్టుక ప్రక్రియను వేగవంతం చేయడంలోనూ సాయపడతాయి. అంతేగాక నక్షత్ర మండలాల కేంద్ర స్థానాల్లో అతి భారీ కృష్ణబిలాల పుట్టుకకూ దోహదం చేస్తుంటాయి. ఒకవిధంగా ఇవి నక్షత్ర మండలాల్లో సరఫరా వ్యవస్థ పాత్ర పోషిస్తుంటాయి. విశ్వపు తొలి యుగాల నాటి నక్షత్ర మండలాల్లోని స్టెల్లర్ బార్స్‌పై తొలిసారిగా పరిశోధన చేస్తున్నది మేమే. ఇది ఇప్పటిదాకా ఎవరూ చూడని కీకారణ్యంలోకి తొలిసారి అడుగు పెట్టడం వంటిదే’’ అంటూ శ్రద్ధా ముక్తాయించారు. -
పాలపుంతతో ప్రాణానికి నిశ్చింత
పాలపుంత చిత్రాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి.. అలాంటిదే ఇది కూడా.. ఈ చిత్రాన్ని అమెరికాకు చెందిన ఆస్ట్రోఫొటోగ్రాఫర్ డెరెక్, కొలరాడోలోని మరూన్ బెల్స్ పర్వతాల వద్ద తీశాడు. ఇంతకీ మానసిక చింతకు పాలపుంతకు కనెక్షన్ ఏమిటి అనే కదా మీ డౌట్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న డెరెక్‌కు ఈ నక్షత్రాలే ఓదార్పునిచ్చాయట. డెరెక్‌కు ఆస్ట్రోఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఉండేది కాదట. 20 ఏళ్ల వయసులో హృదయ సంబంధిత వ్యాధి వల్ల గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడేవాడు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వెంటాడేవి. అలాంటి టైంలో వాటి నుంచి బయటపడటానికి, మనసును వేరేపని మీద లగ్నం చేయడానికి ఆకాశంలోని నక్షత్రాలను చూడటం అలవాటు చేసుకున్నాడు. ఆసక్తి పెరిగింది. తర్వాత ఓ రోజు తన కెమెరాను పట్టుకుని.. పాలపుంతల చిత్రాలను తీయడానికి బయల్దేరాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రొఫెషనల్ ఆస్ట్రోఫొటోగ్రాఫర్గా ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీస్తూ.. శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇదీ చదవండి: LOFTID: ‘రక్షణ కవచం’ సక్సెస్.. గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి.. -
మన ముంగిట్లో కృష్ణబిలం
భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఓ భారీ కృష్ణబిలాన్ని తాజాగా గుర్తించారు. ఇప్పటిదాకా భూమికి అతి సమీపంలో ఉన్న కృష్ణబిలం కంటే ఇది ఏకంగా మూడింతలు దగ్గరగా ఉంది! సూర్యుని కంటే 10 రెట్లు పెద్దదైన ఈ కృష్ణబిలం భూమికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఒఫికస్ నక్షత్ర మండలంలో ఉంది. పాలపుంతలో నిద్రాణంగా ఉన్న కృష్ణబిలాన్ని కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారి కూడా కావడం విశేషం. కృష్ణబిలాలు ఏర్పడే క్రమాన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
లద్దాఖ్ పోదాం... పాలపుంతను చూద్దాం!
లద్దాఖ్: ఇదేమిటో తెలుసా? మన పాలపుంత. చాలా బాగుంది కదా! ఈ సుందర దృశ్యాలను చూసేందుకు సుదూరంలోని ధ్రువాల దాకానో వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ మన దేశ ఉత్తరాగ్రాన జమ్మూ కశ్మీర్‌లోని లద్దాఖ్ దాకా వెళ్తే చాలు. అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలో చాంగ్తాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఐదు గ్రామాల సమాహారమైన హాన్లేలో ఉన్న ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ (ఐఏఓ) బేస్ క్యాంప్ నుంచి కనిపించే అద్భుతమిది. దీన్ని చూసేందుకు ఇక్కడికి కొన్నాళ్లుగా పర్యాటకుల రాక బాగా పెరుగుతోంది. దీన్ని మరింత వ్యవస్థీకృతం చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా అంతరిక్ష టూరిజాన్ని ప్రోత్సహించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ముందుకొచ్చింది. లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్డీసీ), కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని దేశంలోనే తొలి డార్క్ స్కై రిజర్వ్‌గా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా పరిసర గ్రామాలకు చెందిన 24 మందిని అంతరిక్ష రాయబారులుగా ఎంపిక చేసి వారికి 8 అంగుళాల డోబ్సోనియన్ టెలిస్కోపులు అందజేశారు. ఔత్సాహిక పర్యాటకులు వాటిద్వారా అంతరిక్షంలోకి తొంగిచూడవచ్చు. పాలపుంత తాలూకు వింతలను కళ్లారా చూసి ఆనందించొచ్చు. మేఘరహిత వాతావరణం, స్వచ్ఛమైన వాతావరణం కారణంగా ఇక్కణ్నుంచి అంతరిక్షం అద్భుతంగా కనిపిస్తుందట. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలూ పెరుగుతాయని చెబుతున్నారు. ఈ డార్క్ స్కై రిజర్వ్‌ను లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్ అక్టోబర్ 31న వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. -
అదో అధోజగత్తు.. శ్మశానసదృశ ప్రాంతం.. మృతప్రాయ నక్షత్రాల అడ్డా!
కాలం తీరి మృతప్రాయంగా మారి రాలిపడ్డ పురాతన నక్షత్రాలతో కూడిన మరుభూమి వంటి ప్రదేశాన్ని పాలపుంతలో ఓ మూలన వ్యోమగాములు తొలిసారిగా గుర్తించారు! మన పాలపుంత వైశాల్యాన్ని మథిస్తున్న క్రమంలో ఈ శ్మశానసదృశ ప్రాంతం యాదృచ్ఛికంగా వారి కంటపడటం విశేషం! పదులు వందలూ కాదు, లెక్కకు మిక్కిలి సంఖ్యలో మృత నక్షత్రాలు అక్కడున్నాయట. ఇవన్నీ ఒక్కొక్కటిగా బ్లాక్‌హోల్స్‌లోకి అంతర్ధానమవుతున్నాయట. అంతరిక్షంలో దీన్ని ఒకరకంగా అధోజగత్తుగా చెప్పవచ్చని సైంటిస్టులు అంటున్నారు. దీని ఎత్తు పాలపుంతతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉందట! పాలపుంతలోని ద్రవ్యరాశిలో ఇవే కనీసం మూడో వంతు ఉంటాయట. ఈ మృత నక్షత్రాలన్నీ చాలా పురాతనమైనవని, ఎప్పుడో మన పాలపుంత పాలబుగ్గల ప్రాయంలో ఉన్నప్పుడు ఏర్పడ్డ బాపతని నాసా పేర్కొంది. మారుమూల చీకట్లలో దాగుండటం వల్ల ఇంతకాలం కంటపడలేదని చెప్పుకొచ్చింది. అన్నట్టూ, ఈ అధోజగత్తు తాలూకు ఒక కొస మనకు 65 కాంతి సంవత్సరాల కంటే దూరం ఉండదట! -
విశ్వంలోకెల్లా అతి పే...ద్ద గెలాక్సీ
ఆమ్స్టర్డామ్: విశ్వంలోకెల్లా అతి పెద్ద గెలాక్సీని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. ఇది ఏకంగా 1.63 కోట్ల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉందట! మన పాలపుంత కంటే 153 రెట్లు, సూర్యుని కంటే 24,000 కోట్ల రెట్లు పెద్దదట. ఈ భారీ రేడియో గెలాక్సీకి అల్సియోనెస్ అని పేరు పెట్టారు. ఇది భూమి నుంచి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని దీన్ని కనిపెట్టిన నెదర్లాండ్స్‌లోని లైడెన్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని మధ్యలో కేంద్రకం వద్ద చురుకైన ఓ భారీ కృష్ణబిలం కూడా ఉందని వారంటున్నారు. దాని సమీపం నుంచి భారీ ద్రవ్యరాశితో కూడిన పలు ఖగోళ పదార్థాలు ఎగజిమ్ముతున్నాయట. ఇలాంటి అజ్ఞాత రేడియో గెలాక్సీల గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. కృష్ణబిలం తన చుట్టూ ఉన్న పదార్థాలన్నింటినీ తనలోకి లాగేసుకుంటూ ఉంటే అది చురుగ్గా ఉందని అర్థం. అలా దానిలోకి వెళ్లే వాటిలో అతి తక్కువ పదార్థాలు బిలం తాలూకు బయటి పొర గుండా దాని ధ్రువాల వైపు శరవేగంతో విసిరివేతకు గురవుతాయి. అక్కణ్నుంచి భారీ పేలుడుతో అంతరిక్షంలోకి దూసుకుపోయి అయనీకరణం చెందిన ప్లాస్మాగా రూపొందుతాయి. తర్వాత ఇవి కాంతివేగంతో సుదూరాలకు ప్రయాణిస్తూ చివరికి రేడియో ధారి్మకతను వెలువరించే భారీ అంతరిక్ష దృగి్వషయాలుగా మిగిలిపోతాయి. ఇలాంటి రేడియో ధారి్మక పదార్థాలు మన పాలపుంతలోనూ లేకపోలేదు. కానీ అల్సియోనెస్ వంటి భారీ గెలాక్సీల్లో అవి అంతంత సైజులకు ఎలా పెరుగుతాయన్నది ఇప్పటిదాకా మనకు అంతుపట్టని విషయం. ఈ విషయంలో ఇప్పటిదాకా ఉన్న పలు సందేహాలకు అల్సియోనెస్ రూపంలో సమాధానాలు దొరుకుతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇంత భారీ గెలాక్సీలు ఎలా పుట్టుకొస్తాయన్న ప్రశ్నలకు కూడా అల్సియోనెస్పై జరిగే పరిశోధనల్లో సమాధానాలు దొరకొచ్చని అబ్జర్వేటరీకి చెందిన మారి్టజిన్ ఒయ్ అన్నారు. యూరప్‌లో ఏర్పాటు చేసిన లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) డేటాను విశ్లేషించే క్రమంలో ఓయ్, ఆయన బృందం యాదృచి్ఛకంగా ఈ భారీ గెలాక్సీని కనిపెట్టింది. -
మునుపెన్నడూ చూడని వింత.. ఏలియన్ల పనికాదట! మరి..
ఖగోళంలో మునుపెన్నడూ చూడని వింత ఒకటి పరిశోధకుల కంట పడింది. స్పేస్‌లో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంతలో దీనిని రీసెర్చర్లు గుర్తించారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో తరంగాన్ని అది భూమికి పంపిస్తోందని అంటున్నారు స్పేస్ సైంటిస్టులు. విశేషం ఏంటంటే.. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఓ స్టూడెంట్ మొదట దానిని గుర్తించినట్లు తెలుస్తోంది. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ వింతను గుర్తించగా.. ‘అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్’గా దానికి పేరు పెట్టారు. ఆ వింత వస్తువేంటన్నది తేల్చే పనిలో ఉన్నారు నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త. భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత.. కాంతిమంతంగా ఉందని, దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నారట నటాషా. కానీ, అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా చెప్పారు. కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని ఒక అంచనాకి వచ్చారు. బహుశా న్యూట్రాన్ స్టార్‌గా భావిస్తున్న ఆ వింత వస్తువును.. భారీ నక్షత్రం బద్ధలు కావడం వల్ల ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే నక్షత్రాల పుట్టుకపై జరుగుతున్న అధ్యయనానికి ఈ పరిశోధన ఎంతో సాయం చేసినట్లు అవుతుంది. చదవండి: ఏడేళ్ల కిందట గతి తప్పిన ఎలన్ మస్క్ రాకెట్.. ఇప్పుడు చంద్రుడి మీదకు రయ్! -
ఆశ్చర్యపోయే అంశం.. సూర్యుడు లేని గ్రహాలు!
గ్రహం.. అనగానే ఏదో ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించడం పరిపాటి. కానీ, 2021 ముగింపులో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయే అంశం గోచరమైంది. పాలపుంత గెలాక్సీలో ఎటువంటి నక్షత్రం చుట్టూ భ్రమణం చేయకుండా స్వేచ్ఛగా తిరిగే 100కుపైగా భారీ గ్రహాలను కనుగొన్నారు. ఇవన్నీ సైజులో గురుగ్రహం కన్నా పెద్దవి. ఇలాంటివి మరిన్ని లక్షలుండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఫ్రీ ఫ్లోటింగ్ ప్లానెట్స్(మాతృ నక్షత్రం లేని గ్రహాలు) 70– 172 వరకు కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కనుగొన్న ఫ్రీఫ్లోటింగ్ ప్లానెట్స్ కన్నా తాజాగా కనుగొన్నవి రెట్టింపున్నాయి. నక్షత్ర ఉత్పత్తి సమయంలో ఇలాంటి గ్రహాలు ఏర్పడతాయని ఒక అంచనా. బరువులో జూపిటర్కు సుమారు 13 రెట్లున్న ఈ గ్రహాల ఉత్పత్తిపై భిన్న అంచనాలున్నాయి. నక్షత్రాల్లాగానే వాయు సమూహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి నశించడం వల్ల ఏర్పడి ఉండొవచ్చని, మాతృనక్షత్రం నుంచి భ్రమణం చేసే సమయంలో అనూహ్యంగా కక్ష్య నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని.. పలు ఊహాగానాలు చేస్తున్నా వీటి పుట్టుకకు మాత్రం సరైన కారణాలు ఇంకా తెలియలేదు. (చదవండి: వదల బొమ్మాలి.. వదల.. పెంపుడు కుక్కపై పిట్‌బుల్ దాడి) జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో వీటి వివరాలు ప్రచురించారు. వృశ్చిక రాశి నక్షత్ర సముదాయానికి దగ్గరలో వీటిని గుర్తించారు. పలు నక్షత్రాల మధ్య ఇవి స్వేచ్ఛగా పరిభ్రమించేందుకు కారణాలు అన్వేషించాల్సిఉందని పరిశోధనలో పాల్గొన్న రియా మిరెట్ రొయిగ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోపుతో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టవచ్చని భావిస్తున్నారు. నక్షత్రంతో పనిలేకుండా తిరిగే వీటిలో వాతావరణం వృద్ది చెందడాన్ని పరిశీలిస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు బయటపడే అవకాశం ఉందని సైంటిస్టుల భావన. (చదవండి: అజ్ఞాతవాసులు.. ఏ తల్లి కన్న బిడ్డలో! ప్రాణాలు పోతున్నా జనాల్ని కాపాడుతున్నారు) -
వివరం: ఉన్నట్టా? లేనట్టా?
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో - ‘‘గ్రహాంతరవాసులు అనేవాళ్లు కనుక భూమి మీదకు వస్తే నేను పెద్దగా ఆశ్చర్యపడను’’ అన్నారు. ‘‘అంటే ఏలియన్స్ ఉన్నారని మీ ఉద్దేశమా?’’ అన్నప్పుడు, ‘ఈ విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాకపోవచ్చు’’ అన్నారు! దీంతో ఏలియన్స్ మళ్లీ ఒకసారి చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకీ ఏలియన్స్... ఉన్నట్టా... లేనట్టా.... గ్రహాంతర వాసులపై అదే మీమాంస! పది వేల నుంచి 20 వేల కోట్ల పాలపుంతలు... ఒక్కో పాలపుంతలో కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు... కొన్ని నక్షత్రాలకు ‘తగిన’ దూరంలోనే భారీ గ్రహాలు.. అయినా బుద్ధిజీవి మనిషి ఒక్కడేనా? ఈ సువిశాల విశ్వంలో మరెవ్వరూ లేనే లేరా! చిత్రమైన విషయమేమిటంటే... గ్రహాంతర వాసులు ఉన్నారనేందుకు ఎంత అవకాశముందో... లేరని గట్టిగా వాదించేందుకూ అంతే అవకాశముంది! గ్రహాంతరవాసుల కోసం మనం ప్రయత్నిస్తున్నట్లు విశ్వాంతరాళాల్లో ఇలా మనకోసమూ ఎవరైనా ప్రయత్నిస్తున్నారేమో?! ఒక్కటైతే నిజం... సైన్స్ దృష్టితో చూస్తే ఇప్పటివరకూ భూమికి అవతల గ్రహాంతర వాసుల మాట అటుంచితే... అస్సలు జీవం అన్నదే లేదు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే మనిషి ఇప్పుడిప్పుడే విశ్వాన్ని చూడటం మొదలుపెట్టాడు కాబట్టి! కొన్ని దశాబ్దాల క్రితం వరకూ మనిషికి సౌరకుటుంబానికి ఆవల ఏముందో తెలిసేది కాదు.. ఆ తరువాత అవతల కూడా నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయని గుర్తించగలిగాడు. గత దశాబ్ద కాలపు పరిశోధనలను పరిగణనలోకి తీసుకుంటే... కేవలం మనమున్న మిల్కీవే గెలాక్సీలోనే 50 శాతం నక్షత్రాల పరిధిలో గ్రహాలు ఉన్నాయన్న అంచనాకు రాగలిగాడు. వీటిల్లో భూమిని పోలినవి దాదాపు వెయ్యి వరకూ ఉన్నాయని గుర్తించాడు కూడా. ఇంకో విషయం... మనిషి ఇప్పటివరకూ మనకు కేవలం నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిని దాటి వెళ్లింది కూడా లేదు. ఏతావాతా తేలేది ఏమిటంటే... ఇన్ని కోట్ల గ్రహాలు ఉన్నప్పుడు వాటిల్లో ఏదో ఒకదాంట్లో జీవం ఉండేందుకు అవకాశాలు మెండు అని! జీవానికి ఆధారం నీరు... గ్రహాంతర వాసుల గురించి ఆలోచించేటప్పుడు జీవం మనుగడకు అత్యవసరమైన అంశమేమిటో కూడా యోచించుకోవాలి. ఇక్కడే కాదు... ఎక్కడైనా జీవం ఉనికికి అత్యంత కీలకమైన విషయం నీరు. సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల్లో నీటి ఛాయలు పెద్దగా లేవని ఇప్పటికే స్పష్టమైంది. అంగారకుడి గర్భంలో, గురుగ్రహపు ఉపగ్రహం యూరోపాపై కొన్ని ఇతర ఉపగ్రహాలపై కూడా నీరు ఉందనేందుకు ఆధారాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ భూమ్మీద మాత్రమే జీవం ఉంది. సుమారు 450 కోట్ల ఏళ్ల వయసున్న భూమిపై 340 కోట్ల ఏళ్ల క్రితమే జీవం ఆనవాళ్లు ఉన్నాయనేందుకు ఆధారాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో లభ్యమైన స్టోమాటోలైట్స్ బ్యాక్టీరియా శిలాజాలు ఇందుకు నిదర్శనం. జీవశాస్త్ర పరంగా కొంచెం సంక్లిష్టమైన నిర్మాణమైన బ్యాక్టీరియా కంటే ముందు కూడా ఏదో ఒక రూపంలో జీవం ఉండేందుకు అవకాశాలు ఎక్కువే. దీన్నిబట్టి జీవ ఆవిర్భావం మరీ అంత క్లిష్టమైన అంశమేమీ కాదని స్పష్టమవుతుంది. కాకపోతే ఇతర గ్రహాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ వేగంతో జీవ పరిణామం సంభవించిందని చెప్పుకోవచ్చు. మండే లావాలో...ఎముకలు కొరికే చలిలోనూ... భూమ్మీద అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ రకరకాల జీవజాతులు మనుగడ సాగిస్తున్న విషయం శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలోనే గుర్తించారు. సలసల కాగే అగ్నిపర్వత బిలాలు మొదలుకొని అత్యంత శీతల పరిస్థితుల్లోనూ ఇప్పటివరకూ గుర్తించని జీవజాతులను మనిషి గుర్తించాడు కూడా. దీన్నిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే... అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ జీవం పురుడు పోసుకోవచ్చు అని. ఇదే పోలిక గ్రహాంతర వాసులకూ వర్తిస్తుంది. సౌరకుటుంబానికి ఆవల ఉన్న కోటానుకోట్ల గ్రహాల్లో ఉన్న పరిస్థితులేమిటన్నది మనిషి ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ అవి ఎంత కఠినంగా ఉన్నప్పటికీ జీవం ఉండేందుకు అవకాశాలు మాత్రం ఉంటాయన్నది సుస్పష్టం. ఆశ రేకెత్తించిన ఒకే ఒక్క సందేశం... గ్రహాంతర వాసుల ఉనికిని గుర్తించేందుకు... మనిషి తన ఉనికిని చాటుకునేందుకు ఇప్పటివరకూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. 1977లో తొలిసారి వాయేజర్ ఉపగ్రహం ద్వారా గ్రహాంతర వాసులను ఉద్దేశించి మనిషి ఒక సందేశం పంపాడు. బంగారు రేకులపై మనిషి రూపురేఖలను, భూమి స్థానాన్ని సూచించే గుర్తులు, కొన్ని శబ్దాలను పొందుపరిచి పంపిన ఈ సందేశంపై ఇప్పటివరకూ ప్రత్యుత్తరం లేదు. అలాగే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరస్టియల్ లైఫ్ (సెటీ) భూమ్మీద ఉన్న అత్యంత భారీ రేడియో టెలిస్కోపుల సాయంతో సుదూర గ్రహాలకు సంకేతాలు పంపుతూనే ఉంది. గ్రహాంతర వాసులెవరైనా ఉంటే ఈ సంకేతాలు అందుకుని స్పందించకపోతారా? అన్న అశతో జరుగుతున్న ఈ ప్రయత్నం ఇప్పటివరకూ ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1977 ఆగస్టు 15న అందిన ఒక్క సందేశం మాత్రం గ్రహాంతర వాసులపై మనకున్న ఆసక్తిని పెంచేలా చేసింది. ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయ టెలిస్కోపు ద్వారా అందిన ఈ సంకేతాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్త అదే కాగితంపై ‘వావ్’ అని రాశాడంటే అదెంత ఆసక్తికరమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సంకేతాన్ని మరోసారి పొందేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక 1974లో కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు పూర్టరికోలోని ఆర్సిబో వేధశాల నుంచి 210 బైట్ల సైజున్న ఓ సందేశాన్ని ఎం13 నక్షత్ర మండలంవైపు పంపించారు. మానవుల, కీలకమైన రసాయన అణువుల, డీఎన్ఏ రసాయన నిర్మాణం వంటి వివరాలతో కూడిన ఈ సందేశం వన్‌వే ట్రాఫిక్ మాదిరిగానే మిగిలిపోయింది. డ్రేక్స్ ఫార్ములా... 1961లో సెటీ తొలి అధికారిక సమావేశంలో ఫ్రాంక్ డ్రేక్ ప్రతిపాదించిన ఓ ఫార్ములా... మిల్కీవే పాలపుంతలో ఎన్ని నాగరిక సమాజాలు ఉండేందుకు అవకాశముందో తెలియజేసింది. ఒక నాగరికత అభివృద్ధి చెందేందుకు పట్టే సగటు కాలం, నక్షత్రాలు తద్వారా గ్రహాలు ఏర్పడేందుకు తీసుకునే సమయం.. వాటిల్లో భూమిని పోలిన పరిస్థితులు ఉండే గ్రహాల శాతం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఫార్ములాను రూపొందించారు. ఈ ఫార్ములా ఆధారంగా మన పాలపుంతలో కనీసం 12 వేల నాగరికతలు ఉండేందుకు అవకాశముందని తేల్చారు. అయితే తరువాతి కాలంలో చాలామంది శాస్త్రవేత్తలు దీంతో ఏకీభవించలేదు. సెటీ ఉద్యమానికి మూలస్తంభంగా భావించే కార్ల్ సెగాన్ పది లక్షలకుపైగా గ్రహాంతర వాస నాగరికతలు ఉంటాయని అంచనా వేస్తే... డ్రేక్స్ ఫార్ములాలో ఉపయోగించిన విలువలు చాలా తక్కువని, ఎక్కువ చేసి లెక్కిస్తే ఈ పాలపుంతలో మనం ఒక్కరమే ఉండేందుకు అవకాశమున్నట్లు తేలుతుందని ఇంకొందరు వాదించారు. అందుకేనేమో... ఏలియన్ సందేశాల కోసం చెవులు రిక్కించి వింటోన్న సెటీ శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసులను గుర్తించేందుకు, వారితో మాట్లాడేందుకు ఇంకో ఇరవై ఏళ్లు పడుతుందని అంటూ 40 ఏళ్లు గడిపేశారు. ఫెర్మీ ప్రశ్నలకు బదులు ఏదీ? అణుభౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ 1950 ప్రాంతంలో గ్రహాంతర వాసులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. గ్రహాంతర వాసులు ఉన్నారని, వారు ఇప్పటికే భూమిని సందర్శించి పోయారని, అడపదడపా ఫ్లైయింగ్ సాసర్లలో వచ్చిపోతున్నారని వాదిస్తున్న వారిని ఉద్దేశించి వేసిన ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి... 1. ఈ విశ్వంలో గ్రహాంతర వాసులు ఉంటే వారు మనతో ఎందుకు మాట్లాడటం లేదు? 2. భూమ్మీదకు ఎందుకు రావడం లేదు? 3. రహస్యంగా వచ్చిపోతున్నారని అనుకుంటే కనీసం వేడి, విద్యుదస్కాంత శక్తి వంటి ఆనవాళ్లయినా వదిలి వెళ్లాలి కదా? అవెక్కడ? అన్న ఈ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు. ఈ సందేహాలన్నిటినీ ఇలా ఉంచి, వేల ఏళ్ల నాటి జాడలను బట్టి చూస్తే... టెక్నాలజీలో, కమ్యూనికేషన్లో మన ‘అవతార్’ టైపు మూవీలను, నానో టెక్నాలజీలను దాటి వేల ఏళ్లు ముందుకు వెళ్లి ఉండాలి ఏలియన్స్. మరి అంత ఫాస్ట్‌గా ఉన్నప్పుడు మనతో ఏలియన్స్‌కి కమ్యూనికేషన్ ఎందుకు ఏర్పడడం లేదు? బహుశా సిగ్నల్ పంపే టెక్నాలజీ ఏలియన్స్ దగ్గర ఉండొచ్చు. ఆ సిగ్నల్స్‌ను అందుకునే టెక్నాలజీ మన దగ్గర లేదేమో! అయితే ‘సెటి’ ఖగోళశాస్త్రవేత్త సేథ్ షోస్టాక్ మరో రకమైన ఆశావహ దృక్పథంతో ఉన్నారు. గూగుల్‌లో ఉన్న డేటానంతా విశ్వంలోకి డంప్ చేయిస్తే ఏనాటికైనా మనుషుల గురించి ఏలియన్స్‌కి తెలుస్తుందనీ, ఆ విధంగా జీవులున్న గ్రహాల మధ్య సంబంధాలు ఏర్పడి సరికొత్త సౌభ్రాతృత్వం మొదలౌతుందని సేత్ ఆకాంక్ష. చరిత్రలో గ్రహాంతర వాసుల ఊసులు... గ్రహాంతర వాసుల ప్రస్తావన ఈ రోజు కొత్తగా పుట్టిందేమి కాదు. చరిత్ర పుటల్ని తరచిచూస్తే... ఎన్నెన్నో తార్కాణాలు కనిపిస్తాయి. ఎగిరే పళ్లాలను చూశామని, గాల్లో ఈదే గ్రహాంతర వాసులను చూశామన్న వారి ఆనవాళ్లూ ఉన్నాయి. కొన్ని అక్షరబద్ధమైతే... మరికొన్ని సచిత్ర సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అటువంటి ప్రస్తావనల్లో మచ్చుకు కొన్ని... - క్రీస్తు శకం 373లో అలెగ్జాండ్రియాలోని ఓ మతగురువు సెయింట్ ఆంటోనీ జీవిత చరిత్రను రాశారు. అందులోని ఒక భాగంలో ‘ఎడారిలో ఒక డిస్క్’ పేరుతో ఫై ్లయింగ్ సాసర్ను పోలిన వర్ణన ఉంది. వెండితో చేసిన ఓ భారీ పళ్లెం లాంటి నిర్మాణాన్ని సైతాన్... ఆంటోనీకి చూపాడని, సైతాను దురుద్దేశాన్ని గ్రహించిన ఆంటోనీ ఆ పళ్లెంలోని రాక్షసుడితో పోరాటం చేశాడని ఉంది. - రోమన్ సామ్రాజ్యాన్ని థియోడిసిస్ పరిపాలిస్తున సమయంలో (క్రీ.శ.393) ఓ భారీ ప్రకాశవంతమైన గోళం... దానితోపాటు మరెన్నో చిన్న గోళాలు గాల్లో ఎగురుతూ కనిపించాయి. వాటిని చూసి పౌరులు భయంతో వణికిపోయారని రోమన్ రచయిత జూలియన్ ఒబ్సీక్వీన్స్ తన రచనల్లో ప్రస్తావించారు. - ప్రపంచం నలుమూలల్లో లభ్యమైన అనేక పురాతన వస్తువుల వయసును కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా నిర్ధారించినప్పుడు అనేక -ఆశ్చర్యకరమైన ఫలితాలు లభించాయి. ఈ పురాతన వస్తువుల్లో కొన్ని లక్షల ఏళ్ల క్రితం నాటివిగా స్పష్టమైంది. క్రీ.శ.747లో చైనాలో ‘నిప్పులు చిమ్ముతూ ఎగిరే డ్రాగన్లు’ పేరుతో గ్రహాంతర వాసుల ప్రస్తావన ఒకటి ఉంది. మానవుల్లాంటి వారు.. విమానంలో ఎగురుతూ కనిపించారని ప్రజలు పేర్కొన్నట్లుగా ఉంది. అంటే... మనిషి విమానాన్ని తయారు చేసేందుకు సుమారు 1200 ఏళ్ల క్రితమే అలాంటి వాటిని మనుషులు చూశారన్నమాట! - తొమ్మిదవ శతాబ్దంలో ఫ్రాన్స్‌లోని ఆర్చిబిషప్ ఆఫ్ లైన్స్ తాను ముగ్గురు పురుషులు.. ఒక మహిళ ఎగిరే పళ్లెం నుంచి కిందకు దిగుతూండగా చూశానని... వీరిని చూసిన ప్రజలు ఆందోళనకు గురై వారిపై రాళ్లు విసిరానని పేర్కొన్నారు. మేఘాల్లోంచి కిందకు దిగిన వీరు చర్చి సభ్యులను భయకంపితులను చేశారని రాసుకున్నారు. - ఖగోళ శాస్త్రవేత్తలు మార్గరెట్ టర్న్‌బుల్, జిల్ టార్టర్ (కార్నెగీ ఇన్స్టిట్యూషన్, వాషింగ్టన్ డీసీ)లు మన చుట్టుపక్కల్లో సంక్లిష్ట జీవం ఉండేందుకు అవకాశమున్న గ్రహాల జాబితాను తయారు చేశారు. ఇలాంటి గ్రహాలు 17129 వరకూ ఉన్నాయని తేల్చారు. - 300 కోట్ల ఏళ్లకంటే పురాతనమై నక్షత్రాల చుట్టూ తిరిగే.. తక్కువ ద్రవ్యరాశి, ఇనుము తదితర లోహాలు ఎక్కువగా ఉన్న గ్రహాలపైనే జీవం పుట్టేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నది టర్న్‌బుల్ అంచనా. - ఇలాంటి గ్రహాల్లో మనకు అతిదగ్గరగా ఉన్నది... ‘ఎప్సిలాన్ ఇండీ ఏ’. భూమి నుంచి దీని దూరం దాదాపు 11.8 కాంతి సంవత్సరాలు. - గ్రహాంతర వాసుల అన్వేషణలో మీరూ భాగం కావాలనుకుంటే... సెటీ అందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం సెటీ వెబ్సైట్ నుంచి ఒక సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు. మీ కంప్యూటర్ శక్తిని ఉపయోగించుకుని సెటీ సుదూర విశ్వం నుంచి చేరుతున్న రేడియో సంకేతాలను విశ్లేషిస్తుంది. దాదాపు రెండు లక్షల మంది ఈ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. - 2006 సెప్టెంబరు 19న ఫ్రెంచ్ సెంటర్ ఫర్ నేష నల్ స్పేస్ స్టడీస్ గ్రహాం తర వాసుల కోసం ఓ టీవీ కార్యక్రమాన్ని అంతరిక్షం లోకి ప్రసారం చేసింది. భూమికి 45 కాంతి సంవత్స రాల దూరంలో ఉన్న ఎరాయి అనే నక్షత్రం వైపు ప్రసారం చేసిన ఈ వీడియో అక్కడికి చేరేందుకు మరో 37 సంవత్సరాలు పడుతుంది! - ‘‘నా మనసులో ఎలాంటి సందేహం లేదు. గ్రహాంతర వాసులు కచ్చితంగా ఉన్నారు. బహుశా మన చంద్రుడి మీదకు వచ్చి వెళ్లి ఉంటారు కూడా’’ - మిచియో కాకూ, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త - ‘‘యూఎఫ్ఓలు దాంట్లో గ్రహాంతర వాసులు ఉండేందుకు అవకాశముంది. చాలామంది ప్రజలు అనుకుంటున్నట్లు ఈ విషయాలను ప్రభుత్వాలు బయటకు రాకుండా చేస్తున్నాయి’’ - స్టీఫెన్ హాకింగ్, ఖగోళ శాస్త్రవేత్త - క్రీ.శ.393 నాటి బంగారు నాణెంపై రోమన్ చక్రవర్తి థియోడిసిస్, ఆయన మంత్రివర్గం గ్రహాంతరవాసుల కోసం వాయేజర్ ఉపగ్రహం 1977లో అంతరిక్షంలోకి పంపిన బంగారు రేకు - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా