వివరం: ఉన్నట్టా? లేనట్టా?
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో - ‘‘గ్రహాంతరవాసులు అనేవాళ్లు కనుక భూమి మీదకు వస్తే నేను పెద్దగా ఆశ్చర్యపడను’’ అన్నారు. ‘‘అంటే ఏలియన్స్ ఉన్నారని మీ ఉద్దేశమా?’’ అన్నప్పుడు, ‘ఈ విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాకపోవచ్చు’’ అన్నారు! దీంతో ఏలియన్స్ మళ్లీ ఒకసారి చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకీ ఏలియన్స్... ఉన్నట్టా... లేనట్టా....
గ్రహాంతర వాసులపై అదే మీమాంస!
పది వేల నుంచి 20 వేల కోట్ల పాలపుంతలు...
ఒక్కో పాలపుంతలో కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు...
కొన్ని నక్షత్రాలకు ‘తగిన’ దూరంలోనే భారీ గ్రహాలు..
అయినా బుద్ధిజీవి మనిషి ఒక్కడేనా?
ఈ సువిశాల విశ్వంలో మరెవ్వరూ లేనే లేరా!
చిత్రమైన విషయమేమిటంటే...
గ్రహాంతర వాసులు ఉన్నారనేందుకు ఎంత అవకాశముందో...
లేరని గట్టిగా వాదించేందుకూ అంతే అవకాశముంది!
గ్రహాంతరవాసుల కోసం మనం ప్రయత్నిస్తున్నట్లు విశ్వాంతరాళాల్లో ఇలా మనకోసమూ ఎవరైనా ప్రయత్నిస్తున్నారేమో?!
ఒక్కటైతే నిజం... సైన్స్ దృష్టితో చూస్తే ఇప్పటివరకూ భూమికి అవతల గ్రహాంతర వాసుల మాట అటుంచితే... అస్సలు జీవం అన్నదే లేదు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే మనిషి ఇప్పుడిప్పుడే విశ్వాన్ని చూడటం మొదలుపెట్టాడు కాబట్టి! కొన్ని దశాబ్దాల క్రితం వరకూ మనిషికి సౌరకుటుంబానికి ఆవల ఏముందో తెలిసేది కాదు.. ఆ తరువాత అవతల కూడా నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయని గుర్తించగలిగాడు.
గత దశాబ్ద కాలపు పరిశోధనలను పరిగణనలోకి తీసుకుంటే... కేవలం మనమున్న మిల్కీవే గెలాక్సీలోనే 50 శాతం నక్షత్రాల పరిధిలో గ్రహాలు ఉన్నాయన్న అంచనాకు రాగలిగాడు. వీటిల్లో భూమిని పోలినవి దాదాపు వెయ్యి వరకూ ఉన్నాయని గుర్తించాడు కూడా. ఇంకో విషయం... మనిషి ఇప్పటివరకూ మనకు కేవలం నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిని దాటి వెళ్లింది కూడా లేదు. ఏతావాతా తేలేది ఏమిటంటే... ఇన్ని కోట్ల గ్రహాలు ఉన్నప్పుడు వాటిల్లో ఏదో ఒకదాంట్లో జీవం ఉండేందుకు అవకాశాలు మెండు అని!
జీవానికి ఆధారం నీరు...
గ్రహాంతర వాసుల గురించి ఆలోచించేటప్పుడు జీవం మనుగడకు అత్యవసరమైన అంశమేమిటో కూడా యోచించుకోవాలి. ఇక్కడే కాదు... ఎక్కడైనా జీవం ఉనికికి అత్యంత కీలకమైన విషయం నీరు. సౌర కుటుంబంలోని ఇతర గ్రహాల్లో నీటి ఛాయలు పెద్దగా లేవని ఇప్పటికే స్పష్టమైంది. అంగారకుడి గర్భంలో, గురుగ్రహపు ఉపగ్రహం యూరోపాపై కొన్ని ఇతర ఉపగ్రహాలపై కూడా నీరు ఉందనేందుకు ఆధారాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ భూమ్మీద మాత్రమే జీవం ఉంది.
సుమారు 450 కోట్ల ఏళ్ల వయసున్న భూమిపై 340 కోట్ల ఏళ్ల క్రితమే జీవం ఆనవాళ్లు ఉన్నాయనేందుకు ఆధారాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో లభ్యమైన స్టోమాటోలైట్స్ బ్యాక్టీరియా శిలాజాలు ఇందుకు నిదర్శనం. జీవశాస్త్ర పరంగా కొంచెం సంక్లిష్టమైన నిర్మాణమైన బ్యాక్టీరియా కంటే ముందు కూడా ఏదో ఒక రూపంలో జీవం ఉండేందుకు అవకాశాలు ఎక్కువే. దీన్నిబట్టి జీవ ఆవిర్భావం మరీ అంత క్లిష్టమైన అంశమేమీ కాదని స్పష్టమవుతుంది. కాకపోతే ఇతర గ్రహాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ వేగంతో జీవ పరిణామం సంభవించిందని చెప్పుకోవచ్చు.
మండే లావాలో...ఎముకలు కొరికే చలిలోనూ...
భూమ్మీద అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ రకరకాల జీవజాతులు మనుగడ సాగిస్తున్న విషయం శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలోనే గుర్తించారు. సలసల కాగే అగ్నిపర్వత బిలాలు మొదలుకొని అత్యంత శీతల పరిస్థితుల్లోనూ ఇప్పటివరకూ గుర్తించని జీవజాతులను మనిషి గుర్తించాడు కూడా. దీన్నిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే... అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ జీవం పురుడు పోసుకోవచ్చు అని. ఇదే పోలిక గ్రహాంతర వాసులకూ వర్తిస్తుంది. సౌరకుటుంబానికి ఆవల ఉన్న కోటానుకోట్ల గ్రహాల్లో ఉన్న పరిస్థితులేమిటన్నది మనిషి ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ అవి ఎంత కఠినంగా ఉన్నప్పటికీ జీవం ఉండేందుకు అవకాశాలు మాత్రం ఉంటాయన్నది సుస్పష్టం.
ఆశ రేకెత్తించిన ఒకే ఒక్క సందేశం... గ్రహాంతర వాసుల ఉనికిని గుర్తించేందుకు... మనిషి తన ఉనికిని చాటుకునేందుకు ఇప్పటివరకూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. 1977లో తొలిసారి వాయేజర్ ఉపగ్రహం ద్వారా గ్రహాంతర వాసులను ఉద్దేశించి మనిషి ఒక సందేశం పంపాడు. బంగారు రేకులపై మనిషి రూపురేఖలను, భూమి స్థానాన్ని సూచించే గుర్తులు, కొన్ని శబ్దాలను పొందుపరిచి పంపిన ఈ సందేశంపై ఇప్పటివరకూ ప్రత్యుత్తరం లేదు. అలాగే సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరస్టియల్ లైఫ్ (సెటీ) భూమ్మీద ఉన్న అత్యంత భారీ రేడియో టెలిస్కోపుల సాయంతో సుదూర గ్రహాలకు సంకేతాలు పంపుతూనే ఉంది. గ్రహాంతర వాసులెవరైనా ఉంటే ఈ సంకేతాలు అందుకుని స్పందించకపోతారా? అన్న అశతో జరుగుతున్న ఈ ప్రయత్నం ఇప్పటివరకూ ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు.
కానీ 1977 ఆగస్టు 15న అందిన ఒక్క సందేశం మాత్రం గ్రహాంతర వాసులపై మనకున్న ఆసక్తిని పెంచేలా చేసింది. ఒహాయో స్టేట్ విశ్వవిద్యాలయ టెలిస్కోపు ద్వారా అందిన ఈ సంకేతాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్త అదే కాగితంపై ‘వావ్’ అని రాశాడంటే అదెంత ఆసక్తికరమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సంకేతాన్ని మరోసారి పొందేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక 1974లో కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు పూర్టరికోలోని ఆర్సిబో వేధశాల నుంచి 210 బైట్ల సైజున్న ఓ సందేశాన్ని ఎం13 నక్షత్ర మండలంవైపు పంపించారు. మానవుల, కీలకమైన రసాయన అణువుల, డీఎన్‌ఏ రసాయన నిర్మాణం వంటి వివరాలతో కూడిన ఈ సందేశం వన్‌వే ట్రాఫిక్ మాదిరిగానే మిగిలిపోయింది.
డ్రేక్స్ ఫార్ములా...
1961లో సెటీ తొలి అధికారిక సమావేశంలో ఫ్రాంక్ డ్రేక్ ప్రతిపాదించిన ఓ ఫార్ములా... మిల్కీవే పాలపుంతలో ఎన్ని నాగరిక సమాజాలు ఉండేందుకు అవకాశముందో తెలియజేసింది. ఒక నాగరికత అభివృద్ధి చెందేందుకు పట్టే సగటు కాలం, నక్షత్రాలు తద్వారా గ్రహాలు ఏర్పడేందుకు తీసుకునే సమయం.. వాటిల్లో భూమిని పోలిన పరిస్థితులు ఉండే గ్రహాల శాతం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఫార్ములాను రూపొందించారు. ఈ ఫార్ములా ఆధారంగా మన పాలపుంతలో కనీసం 12 వేల నాగరికతలు ఉండేందుకు అవకాశముందని తేల్చారు. అయితే తరువాతి కాలంలో చాలామంది శాస్త్రవేత్తలు దీంతో ఏకీభవించలేదు.
సెటీ ఉద్యమానికి మూలస్తంభంగా భావించే కార్ల్ సెగాన్ పది లక్షలకుపైగా గ్రహాంతర వాస నాగరికతలు ఉంటాయని అంచనా వేస్తే... డ్రేక్స్ ఫార్ములాలో ఉపయోగించిన విలువలు చాలా తక్కువని, ఎక్కువ చేసి లెక్కిస్తే ఈ పాలపుంతలో మనం ఒక్కరమే ఉండేందుకు అవకాశమున్నట్లు తేలుతుందని ఇంకొందరు వాదించారు. అందుకేనేమో... ఏలియన్ సందేశాల కోసం చెవులు రిక్కించి వింటోన్న సెటీ శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసులను గుర్తించేందుకు, వారితో మాట్లాడేందుకు ఇంకో ఇరవై ఏళ్లు పడుతుందని అంటూ 40 ఏళ్లు గడిపేశారు.
ఫెర్మీ ప్రశ్నలకు బదులు ఏదీ?
అణుభౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ 1950 ప్రాంతంలో గ్రహాంతర వాసులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. గ్రహాంతర వాసులు ఉన్నారని, వారు ఇప్పటికే భూమిని సందర్శించి పోయారని, అడపదడపా ఫ్లైయింగ్ సాసర్లలో వచ్చిపోతున్నారని వాదిస్తున్న వారిని ఉద్దేశించి వేసిన ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి...
1. ఈ విశ్వంలో గ్రహాంతర వాసులు ఉంటే వారు మనతో ఎందుకు మాట్లాడటం లేదు?
2. భూమ్మీదకు ఎందుకు రావడం లేదు?
3. రహస్యంగా వచ్చిపోతున్నారని అనుకుంటే కనీసం వేడి, విద్యుదస్కాంత శక్తి వంటి ఆనవాళ్లయినా వదిలి వెళ్లాలి కదా? అవెక్కడ? అన్న ఈ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు.
ఈ సందేహాలన్నిటినీ ఇలా ఉంచి, వేల ఏళ్ల నాటి జాడలను బట్టి చూస్తే... టెక్నాలజీలో, కమ్యూనికేషన్‌లో మన ‘అవతార్’ టైపు మూవీలను, నానో టెక్నాలజీలను దాటి వేల ఏళ్లు ముందుకు వెళ్లి ఉండాలి ఏలియన్స్. మరి అంత ఫాస్ట్‌గా ఉన్నప్పుడు మనతో ఏలియన్స్‌కి కమ్యూనికేషన్ ఎందుకు ఏర్పడడం లేదు? బహుశా సిగ్నల్ పంపే టెక్నాలజీ ఏలియన్స్ దగ్గర ఉండొచ్చు. ఆ సిగ్నల్స్‌ను అందుకునే టెక్నాలజీ మన దగ్గర లేదేమో!
అయితే ‘సెటి’ ఖగోళశాస్త్రవేత్త సేథ్ షోస్టాక్ మరో రకమైన ఆశావహ దృక్పథంతో ఉన్నారు. గూగుల్‌లో ఉన్న డేటానంతా విశ్వంలోకి డంప్ చేయిస్తే ఏనాటికైనా మనుషుల గురించి ఏలియన్స్‌కి తెలుస్తుందనీ, ఆ విధంగా జీవులున్న గ్రహాల మధ్య సంబంధాలు ఏర్పడి సరికొత్త సౌభ్రాతృత్వం మొదలౌతుందని సేత్ ఆకాంక్ష.
చరిత్రలో గ్రహాంతర వాసుల ఊసులు...
గ్రహాంతర వాసుల ప్రస్తావన ఈ రోజు కొత్తగా పుట్టిందేమి కాదు. చరిత్ర పుటల్ని తరచిచూస్తే... ఎన్నెన్నో తార్కాణాలు కనిపిస్తాయి. ఎగిరే పళ్లాలను చూశామని, గాల్లో ఈదే గ్రహాంతర వాసులను చూశామన్న వారి ఆనవాళ్లూ ఉన్నాయి. కొన్ని అక్షరబద్ధమైతే... మరికొన్ని సచిత్ర సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అటువంటి ప్రస్తావనల్లో మచ్చుకు కొన్ని...
- క్రీస్తు శకం 373లో అలెగ్జాండ్రియాలోని ఓ మతగురువు సెయింట్ ఆంటోనీ జీవిత చరిత్రను రాశారు. అందులోని ఒక భాగంలో ‘ఎడారిలో ఒక డిస్క్’ పేరుతో ఫై ్లయింగ్ సాసర్‌ను పోలిన వర్ణన ఉంది. వెండితో చేసిన ఓ భారీ పళ్లెం లాంటి నిర్మాణాన్ని సైతాన్... ఆంటోనీకి చూపాడని, సైతాను దురుద్దేశాన్ని గ్రహించిన ఆంటోనీ ఆ పళ్లెంలోని రాక్షసుడితో పోరాటం చేశాడని ఉంది.
- రోమన్ సామ్రాజ్యాన్ని థియోడిసిస్ పరిపాలిస్తున సమయంలో (క్రీ.శ.393) ఓ భారీ ప్రకాశవంతమైన గోళం... దానితోపాటు మరెన్నో చిన్న గోళాలు గాల్లో ఎగురుతూ కనిపించాయి. వాటిని చూసి పౌరులు భయంతో వణికిపోయారని రోమన్ రచయిత జూలియన్ ఒబ్సీక్వీన్స్ తన రచనల్లో ప్రస్తావించారు.
- ప్రపంచం నలుమూలల్లో లభ్యమైన అనేక పురాతన వస్తువుల వయసును కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా నిర్ధారించినప్పుడు అనేక -ఆశ్చర్యకరమైన ఫలితాలు లభించాయి. ఈ పురాతన వస్తువుల్లో కొన్ని లక్షల ఏళ్ల క్రితం నాటివిగా స్పష్టమైంది.
క్రీ.శ.747లో చైనాలో ‘నిప్పులు చిమ్ముతూ ఎగిరే డ్రాగన్లు’ పేరుతో గ్రహాంతర వాసుల ప్రస్తావన ఒకటి ఉంది. మానవుల్లాంటి వారు.. విమానంలో ఎగురుతూ కనిపించారని ప్రజలు పేర్కొన్నట్లుగా ఉంది. అంటే... మనిషి విమానాన్ని తయారు చేసేందుకు సుమారు 1200 ఏళ్ల క్రితమే అలాంటి వాటిని మనుషులు చూశారన్నమాట!
- తొమ్మిదవ శతాబ్దంలో ఫ్రాన్స్‌లోని ఆర్చిబిషప్ ఆఫ్ లైన్స్ తాను ముగ్గురు పురుషులు.. ఒక మహిళ ఎగిరే పళ్లెం నుంచి కిందకు దిగుతూండగా చూశానని... వీరిని చూసిన ప్రజలు ఆందోళనకు గురై వారిపై రాళ్లు విసిరానని పేర్కొన్నారు. మేఘాల్లోంచి కిందకు దిగిన వీరు చర్చి సభ్యులను భయకంపితులను చేశారని రాసుకున్నారు.
- ఖగోళ శాస్త్రవేత్తలు మార్గరెట్ టర్న్‌బుల్, జిల్ టార్టర్ (కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్, వాషింగ్టన్ డీసీ)లు మన చుట్టుపక్కల్లో సంక్లిష్ట జీవం ఉండేందుకు అవకాశమున్న గ్రహాల జాబితాను తయారు చేశారు. ఇలాంటి గ్రహాలు 17129 వరకూ ఉన్నాయని తేల్చారు.
- 300 కోట్ల ఏళ్లకంటే పురాతనమై నక్షత్రాల చుట్టూ తిరిగే.. తక్కువ ద్రవ్యరాశి, ఇనుము తదితర లోహాలు ఎక్కువగా ఉన్న గ్రహాలపైనే జీవం పుట్టేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నది టర్న్‌బుల్ అంచనా.
- ఇలాంటి గ్రహాల్లో మనకు అతిదగ్గరగా ఉన్నది... ‘ఎప్సిలాన్ ఇండీ ఏ’. భూమి నుంచి దీని దూరం దాదాపు 11.8 కాంతి సంవత్సరాలు.
- గ్రహాంతర వాసుల అన్వేషణలో మీరూ భాగం కావాలనుకుంటే... సెటీ అందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం సెటీ వెబ్‌సైట్ నుంచి ఒక సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. మీ కంప్యూటర్ శక్తిని ఉపయోగించుకుని సెటీ సుదూర విశ్వం నుంచి చేరుతున్న రేడియో సంకేతాలను విశ్లేషిస్తుంది. దాదాపు రెండు లక్షల మంది ఈ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
- 2006 సెప్టెంబరు 19న ఫ్రెంచ్ సెంటర్ ఫర్ నేష నల్ స్పేస్ స్టడీస్ గ్రహాం తర వాసుల కోసం ఓ టీవీ కార్యక్రమాన్ని అంతరిక్షం లోకి ప్రసారం చేసింది. భూమికి 45 కాంతి సంవత్స రాల దూరంలో ఉన్న ఎరాయి అనే నక్షత్రం వైపు ప్రసారం చేసిన ఈ వీడియో అక్కడికి చేరేందుకు మరో 37 సంవత్సరాలు పడుతుంది!
- ‘‘నా మనసులో ఎలాంటి సందేహం లేదు. గ్రహాంతర వాసులు కచ్చితంగా ఉన్నారు. బహుశా మన చంద్రుడి మీదకు వచ్చి వెళ్లి ఉంటారు కూడా’’
- మిచియో కాకూ, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త
- ‘‘యూఎఫ్‌ఓలు దాంట్లో గ్రహాంతర వాసులు ఉండేందుకు అవకాశముంది. చాలామంది ప్రజలు అనుకుంటున్నట్లు ఈ విషయాలను ప్రభుత్వాలు బయటకు రాకుండా చేస్తున్నాయి’’
- స్టీఫెన్ హాకింగ్, ఖగోళ శాస్త్రవేత్త
- క్రీ.శ.393 నాటి బంగారు నాణెంపై రోమన్ చక్రవర్తి థియోడిసిస్, ఆయన మంత్రివర్గం
గ్రహాంతరవాసుల కోసం వాయేజర్ ఉపగ్రహం 1977లో అంతరిక్షంలోకి పంపిన బంగారు రేకు
- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా