ఖగోళంలో మునుపెన్నడూ చూడని వింత ఒకటి పరిశోధకుల కంట పడింది. స్పేస్‌లో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంతలో దీనిని రీసెర్చర్లు గుర్తించారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో తరంగాన్ని అది భూమికి పంపిస్తోందని అంటున్నారు స్పేస్ సైంటిస్టులు.
విశేషం ఏంటంటే.. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఓ స్టూడెంట్ మొదట దానిని గుర్తించినట్లు తెలుస్తోంది. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ వింతను గుర్తించగా.. ‘అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్’గా దానికి పేరు పెట్టారు. ఆ వింత వస్తువేంటన్నది తేల్చే పనిలో ఉన్నారు నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త.
భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత.. కాంతిమంతంగా ఉందని, దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నారట నటాషా. కానీ, అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా చెప్పారు.
కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని ఒక అంచనాకి వచ్చారు. బహుశా న్యూట్రాన్ స్టార్‌గా భావిస్తున్న ఆ వింత వస్తువును.. భారీ నక్షత్రం బద్ధలు కావడం వల్ల ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే నక్షత్రాల పుట్టుకపై జరుగుతున్న అధ్యయనానికి ఈ పరిశోధన ఎంతో సాయం చేసినట్లు అవుతుంది.
చదవండి: ఏడేళ్ల కిందట గతి తప్పిన ఎలన్ మస్క్ రాకెట్.. ఇప్పుడు చంద్రుడి మీదకు రయ్!
Comments
Please login to add a commentAdd a comment