రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే కోట్ల కొద్దీ నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని ఆకారాలూ కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నక్షత్రాలన్నీ స్థానం మారిపోతాయని.. ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని అంటున్నారు. మరి దానికి కారణం ఏమిటో తెలుసా? మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ, సమీపంలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండూ ఢీకొని కలసిపోనుండటమే.
ఇప్పటికే ఈ రెండూ ఒకదానికొకటి సమీపంలోకి వస్తున్నాయి. మరో 375 కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొనడం మొదలవుతుంది. సుమారు 700 కోట్ల ఏళ్ల తర్వాత రెండూ పూర్తిగా కలసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయి. ఈ క్రమంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోతాయి. వాటి స్థానాలు మారిపోతాయి. మరి ఇలా రెండూ దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్నప్పుడు మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై నాసా ఓ వీడియోను రూపొందించింది. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ తీసిన చిత్రాలు, దాని సాయంతో చేసిన పరిశీలన ఆధారంగా సిద్ధం చేసిన ఈ వీడియోను.. చంద్ర అబ్జర్వేటరీ పేరిట ఉన్న ‘ఎక్స్ (ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది.
మనం చూసేది పాలపుంతే కాదు..!
మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే) గెలాక్సీ అంటూ ఫొటోల్లో, ఇంటర్నెట్‌లో మనం చూస్తున్నది నిజానికి పాలపుంత ఫొటో కానే కాదు. అసలు మనం పాలపుంత మొత్తం చిత్రాన్ని తీయడం సాధ్యమే కాదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్న పాలపుంత గెలాక్సీలో మధ్య భాగానికి ఓ పక్కన మన సూర్యుడు, భూమి ఉన్నాయి.
పాలపుంత గెలాక్సీ మొత్తాన్ని దాటి బయటికి వెళితే తప్ప దీనిని ఫొటో తీయలేం! ఎలాగంటే.. సముద్రం మధ్య చిన్న పడవలో కెమెరా పట్టుకుని కూర్చున్న మనం వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్రం మొత్తాన్ని ఫొటో తీయగలమా? ఇదీ అంతే.. మరి మనం చూసే పాలపుంత చిత్రం ఏమిటి అంటారా.. దాదాపుగా పాలపుంతలా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ చిత్రమే. ఈ గెలాక్సీయే భవిష్యత్తులో పాలపుంతను ఢీకొట్టేది.
Comments
Please login to add a commentAdd a comment