బెంగళూరు: మబ్బుల్లేని రాత్రి వేళ అలా ఆకాశంలోకి చూసినప్పుడు లెక్కలేనన్ని నక్షత్రాలు తళుకుమంటూ కనువిందు చేస్తుంటే ఎంతో బావుంటుంది కదా! కానీ వినువీధిలో తారల తళుకులు నానాటికీ తగ్గిపోతున్నాయి. 2011తో పోలిస్తే 2022 నాటికి అబ్జర్వేటరీల కెమెరా కంటికి కన్పిస్తున్న నక్షత్రాల సంఖ్య ఏకంగా 10 శాతం తగ్గిందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది! అయితే, దీనికి కారణం నక్షత్రాలు నశించిపోవడం కాదు.
భూమిపై కృత్రిమ వెలుగులు మితిమీరి పెరిగిపోవడం! మరోలా చెప్పాలంటే కాంతి కాలుష్యమన్నమాట!! దాంతో కాస్త తక్కువ ప్రకాశంతో కూడిన నక్షత్రాలన్నీ సదరు కృత్రిమ వెలుగు మాటున మరుగున పడిపోతున్నాయట! ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితని యూనివర్సిటీ ఆఫ్ శాంటియాగో డీ కాంపొస్టెలా భౌతిక శాస్త్రవేత్త ఫాబియో ఫాల్చీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కాంతి కాలుష్యం ఏటా 7 నుంచి 10 శాతం చొప్పున పెరిగిపోతోంది! ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి.
దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది’’ అని ఆయనన్నారు. ‘‘ఒకప్పట్లా చిక్కటి చీకటితో నిండిన రాత్రుళ్లు ఎప్పటికీ తిరిగిరావు. ముఖ్యంగా నగరాల్లోనైతే రాత్రిపూట వెలుగులు అనివార్యంగా మారి దశాబ్దాలు దాటింది. కానీ పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆకాశంలో కేవలం వేళ్లపై లెక్కబెట్టగలిగినంతకు మించి చుక్కలు కన్పించని రోజు ఎంతో దూరంలో లేదు’’ అంటూ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment