Mills
-
బిన్నీ మిల్స్ సమ్మె
1920లలో మద్రాసులో బి అండ్ సి మిల్లుగా ప్రసిద్ధి చెందిన బకింగ్‌హామ్ అండ్ కర్నాటిక్ మిల్స్‌లో పని చేసే కార్మికులు సమ్మెకు నోటీసు ఇచ్చిన రోజు ఇది (జూన్ 20, 1921). ఆ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు సాగిన కార్మికుల సమ్మె కారణంగా.. ఆ మిల్లు మాత్రమే కాకుండా, మొత్తం మద్రాసు ఆర్థిక పరిస్థితే దెబ్బతింది! జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ కంపెనీ స్పిన్నింగ్ విభాగంలోని కార్మికులు మొదట మే 20న అకస్మాత్తుగా పని ఆపేశారు. యాజమాన్యం వారి డిమాండ్లకు తలొగ్గకపోవడంతో సరిగ్గా నెల రోజులకు సమ్మెను అధికారికంగా ప్రకటించారు. వారి సమ్మెకు కాంగ్రెస్ నాయకుడు కల్యాణసుందరం మొదలియార్ నాయకత్వం వహించారు. కార్మికులు దిగిరాకపోవడంతో మిల్లు అధికారులు నిర్దయగా వ్యవహరించారు. పోలీసులను పిలిపించారు. కార్మికులు ఆగ్రహావేశాలకు లోనయారు. అప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో ఆరుగురు కార్మికులు మరణించారు. నాటి జస్టిస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కలిసి కార్మికుల పక్షాన నిలిచారు. చివరికి ద్రవిడ ఉద్యమనేత నటేష మొదలియార్ మధ్యవర్తిత్వంతో సమ్మె ముగిసింది. అయితే ఎంపిక చేసిన కొంత మంది కార్మికులను మాత్రమే యాజమాన్యం తిరిగి పనిలోకి తీసుకుంది. 1996లో మిల్లు మూతపడింది. ప్రస్తుతం అక్కడ సినిమా షూటింగులు జరుగుతున్నాయి. (చదవండి: శతమానం భారతి విదేశీ వాణిజ్యం) -
ఇలా ఉండిపోవాల్సిందేనా!
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఏర్పాటు చేసిన ఆరు వేరుశనగ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో 75,120.8 క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు చేశారు. సరుకును నిల్వ చేయడానికి గోదాములు లేకపోవడంతో ఇందుల్లో 45 వేల క్వింటాళ్లకు పైనే కొనుగోలు కేంద్రాల్లో ఉండిపోయింది. మరోవైపు వేరుశనగ కొనుగోలుకు ఖాళీ సంచుల కొరత వేధిస్తోంది. గోదాములు, సంచులు లేకపోవడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. శనివారం నుంచి ఏ కేంద్రంలోనూ కొనుగోళ్లు జరగలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకముందే గోదాములను సిద్ధం చేయాల్సిన ఆయిల్‌పెడ్, నాఫెడ్ హడావుడిగా కొనుగోళ్లు ప్రారింభించడం వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా చోట్ల వీరి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. ఆదోనిలో తీసుకున్న గోదాములు సరిపోకపోవడంతో రైతులు అమ్మిన సరుకుకు కాపలా ఉంటున్నారు. కొన్నదానిలో 60శాతం పైగా సెంటర్లలోనే నిలిచిపోయిందంటే అధికారుల నిర్లక్ష్యాన్ని చాటుతోంది. డోన్, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, ప్యాపిలిలో వేరుశనగ బస్తాలు గుట్టలు, గుట్టలుగా పేరుకపోయాయి. కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పేరుకపోయిన నిల్వలను ఎప్పటికి తరలిస్తారు... ఎప్పటి నుంచి కొనుగోలు పునః ప్రారంభిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయలేదని, తగ్గించామని ఆయిల్‌ఫెడ్ జిల్లా ఇన్చార్జ్ అంకిరెడ్డి తెలిపారు. సరుకును తరలించే పనులు ఊపందుకున్నాయని, త్వరలోనే పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పారు. -
పత్తి రైతులకు అండగా ఉందాం
సాక్షి, హైదరాబాద్: పత్తి రైతులకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలు కూడా తమవంతు సహకారం అందించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. జిన్నింగ్ మిల్స్ పరిశ్రమకు అవసరమైన సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులు మార్కెట్‌కు తెస్తున్న పత్తికి గిట్టుబాటు ధర అందించడంలో భాగంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలతో సమావేశమై ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. మంత్రుల పిలుపునకు స్పందించిన జిన్నింగ్ మిల్స్ సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి.. తమకు ప్రభుత్వం నుంచి రావలసిన ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రులు.. సుమారు రూ. వంద కోట్ల ప్రోత్సాహకాల బకాయిలు వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఖాయిలాపడ్డ జిన్నింగ్ మిల్స్‌ను తెరిపిం చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌ను కేటీఆర్ ఆదేశించారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ వ్యవస్థను ఈ ఖాయిలాపడ్డ జిన్నింగ్‌మిల్స్‌ను పునఃప్రారంభించేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ వేసిన జరిమానాలను ఎత్తివేయాలని పరిశ్రమ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నేటి నుంచి కొనుగోళ్లు పెంచండి.. ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని జిన్నింగ్ పరిశ్రమ ప్రతినిధులు బుధవారం నుంచే పత్తి కొనుగోళ్లు పెంచాలని మంత్రులు ఈటల, హరీశ్ రావు, కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల గుజరాత్లో జరిగిన ఓ సమావేశంలో సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సెంథిల్ కుమార్‌ను కలిశానని, తెలంగాణలో పండిస్తున్న పత్తి నాణ్యమైనదని ఆయన చెప్పారని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతన్నను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని పేర్కొన్నారు. జిన్నింగ్ మిల్స్ యజమానులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే త్వరలోనే రాష్ట్రంలో డిలింట్, సాల్వెంట్ పరిశ్రమ పార్కును నెలకొల్పుతామని ప్రకటించారు. వరంగల్‌లో ఇటీవల సీఎం శంకుస్థాపన చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో తమకు కూడా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని జిన్నింగ్ మిల్స్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. -
వేలం పాటలో కోట్లు కుమ్మరించారు
-
కోట్లు కుమ్మరించారు
అంచనా నిజమైంది. ఆట ఉంటే చాలు అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేకపోయినా.. కోట్లు కుమ్మరించడానికి తాము సిద్ధమేనని ఫ్రాంచైజీలు మరోసారి నిరూపించాయి. సోమవారం బెంగళూరులో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ ఆటగాళ్ల వేలం పాటలో ఇంగ్లండ్ క్రికెటర్లతోపాటు ఇతర ఆటగాళ్లకు కాసుల పంట పడింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ. 14 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్‌కే చెందిన బౌలర్ టైమల్ మిల్స్‌ను రూ. 12 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. హైదరాబాద్ రంజీ క్రికెటర్లు మొహమ్మద్ సిరాజ్ (రూ. 2 కోట్ల 60 లక్షలు), తన్మయ్ అగర్వాల్ (రూ. 10 లక్షలు)లను డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది. వేలంలో మొత్తం 357 మంది క్రికెటర్లు పాల్గొనగా... 66 మంది అమ్ముడుపోయారు. కనీసం రూ. కోటి అందుకోనున్న వారిలో 22 మంది క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెటర్లు ఇషాంత్ శర్మ, చతేశ్వర్ పుజారా, ఇర్ఫాన్ పఠాన్లతోపాటు ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా)ను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఐపీఎల్ అంటే ఒకప్పుడు ఇంగ్లండ్ జట్టుకు అందనంత దూరం. మాకు జాతీయ జట్టే ముఖ్యం లీగ్ కాదంటూ వారంతా ప్రకటించుకోగా... అలా అయితే మాకూ మీ అవసరం లేదంటూ లీగ్ కూడా ఆ ఆటగాళ్లను పట్టించుకోలేదు. కానీ ఎట్టకేలకు పదో సీజన్‌కు వచ్చేసరికి ఇంగ్లండ్ ఆటగాళ్ల రాత మారిపోయింది. కేవలం ఆరుగురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఏకంగా రూ. 34.3 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తంగా ఐపీఎల్–2017 కోసం 357 మంది జాబితా నుంచి కేవలం 66 మంది మాత్రం లీగ్‌లో ఎంపికయ్యే అదృష్టం దక్కించుకున్నారు. కొన్ని అనూహ్య, మరికొన్ని అసాధారణ ఎంపికలతో ఈసారి కూడా ఐపీఎల్ వేలం అంచనాలకు అందకుండా సాగింది. ఇద్దరు అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లు కూడా లీగ్‌లో అడుగుపెడుతుండటం మరో విశేషం. బెంగళూరు: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ పంట పండింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం అతను రికార్డు మొత్తానికి అమ్ముడుపోయాడు. స్టోక్స్‌ను రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ రూ. 14 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో వేలంలో ఇది రెండో అత్యధిక మొత్తం కావడం విశేషం. గతంలో యువరాజ్ సింగ్‌కు ఢిల్లీ చెల్లించిన రూ. 16 కోట్లతో పోలిస్తే ఇది కోటిన్నర మాత్రమే తక్కువ. ప్రస్తుతం ఐపీఎల్లో ఉన్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లి (అధికారికంగా రూ. 15 కోట్లు) తర్వాత ఎక్కువ మొత్తం అందుకోబోయేది కూడా స్టోక్స్ కావడం విశేషం. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ టైమల్ మిల్స్ కోసం కూడా బెంగళూరు జట్టు ఏకంగా రూ. 12 కోట్లు ఖర్చు చేసింది. మిషెల్ స్టార్క్ అనూహ్యంగా తప్పుకోవడంతో అతని స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ కావాలని కోరుకున్న ఫ్రాంచైజీకి మిల్స్ రూపంలో ప్రత్యామ్నాయం కనిపిం చింది. టి20 స్పెషలిస్ట్‌గా గుర్తింపు ఉన్న ఇత ను, ఇంగ్లండ్ తరఫున 4 మ్యాచ్‌లే ఆడినా... ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతని బౌలింగ్ కోహ్లిని ఆకట్టుకోవడం మిల్స్‌కు కలిసొచ్చింది. ఐపీఎల్లో ఒక బౌలర్‌కు చెల్లిస్తున్న అత్యధిక మొత్తం కూడా ఇదే. జాగ్రత్తగా... గత ఏడాదిలాగే ఈసారి కూడా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం అత్యుత్సాహం ప్రదర్శించలేదు. పేరు ప్రఖ్యాతులకంటే కూడా తమ జట్టు అవసరం, ఆటగాడు నిర్వహించాల్సిన పాత్రను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వేలంలోకి వెళ్లాయి. కోల్‌కతా జట్టు అయితే తొలి 22 మంది ఆటగాళ్ల వరకు కనీసం స్పందించనే లేదు. బెంగళూరు మరింత అవకాశం ఉన్నా సరే... అందరికంటే తక్కువగా ఐదుగురు ఆటగాళ్లతోనే సరి పెట్టింది. అంతర్జాతీయ క్రికెట్లో చురుగ్గా కొనసాగుతున్న పలువురు విదేశీ ఆటగాళ్లను, సీనియర్లను పట్టించుకోని ఫ్రాంచైజీలు... జట్టుకు బలం కాగలడనిపించిన భారత యువ ఆటగాళ్లపైనే ఎక్కు వ నమ్మకముంచడం విశేషం. రబడ (రూ. 5 కోట్లు), బౌల్ట్ (రూ. 5 కోట్లు), ప్యాట్ కమిన్స్ (రూ. 4.5 కోట్లు), క్రిస్ వోక్స్ (రూ. 4.2 కోట్లు), రషీద్ ఖాన్ (రూ. 4 కోట్లు) భారీ మొత్తం గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు రూ. 2 కోట్లు మాత్రమే దక్కాయి. 2016లో రూ. 8.5 కోట్లతో సంచలనం సృష్టించిన పవన్ నేగి ఈసారి రూ. 1 కోటి ధర పలికాడు. ఆ ఇద్దరి కోసం... స్టోక్స్ కనీస ధర రూ. 2 కోట్ల వద్ద అందరికంటే ముందుగా ముంబై బరిలో నిలిచింది. ఆ తర్వాత ముంబైతో పోటీ పడిన ఢిల్లీ దీనిని రూ. 10.5 కోట్ల వరకు తీసుకుపోయింది. ఈ సమయంలో అడుగు పెట్టిన సన్‌రైజర్స్ కూడా రూ. 13 కోట్ల వరకు ఆసక్తి చూపించింది. అయితే వెనక్కి తగ్గని పుణే చివరకు రూ. 14.5 కోట్లకు స్టోక్స్‌ను గెలుచుకుంది. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన మిల్స్ కోసం ముందుగా ముంబై బిడ్ వేసిం ది. ఆ తర్వాత పంజాబ్ కూడా పోటీ పడి ఒక దశలో ఆగిపోయింది. కోల్‌కతా కూడా రూ.10.5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడినా... చివరకు చాలెంజర్స్దే పైచేయి అయింది. మరో వైపు 25 ఏళ్ల తమిళనాడు లెఫ్టార్మ్ పేసర్ తంగరసు నటరాజన్‌కు కూడా బిగ్ బొనాంజా లభించింది. కనీస ధర రూ. 10 లక్షలకు 30 రెట్లు ఎక్కువగా రూ. 3 కోట్లు చెల్లించి పంజాబ్ అతడిని సొంతం చేసుకుంది. రోజువారీ కూలీ కుమారుడు అయిన నటరాజన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. అందులో ఒక మ్యాచ్ సూపర్ ఓవర్లో అతను ఆరు అద్భుతమైన యార్కర్లు వేయడం విశేషం. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండా భారీ మొత్తం సొంతం చేసుకున్న భారత ఆటగాళ్లలో బాసిల్ తంపి (రూ. 85 లక్షలు), కృష్ణప్ప గౌతమ్ (రూ. 2 కోట్లు), అనికేత్ చౌదరి (రూ. 2 కోట్లు) ఉన్నారు. నంబర్వన్నూ పట్టించుకోలేదు! ఇమ్రాన్ తాహిర్... ప్రస్తుతం ఐసీసీ వన్డే, టి20 ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ బౌలర్. టి20 ఫార్మాట్లో 148 మ్యాచ్‌లు ఆడిన అతని కెరీర్ బౌలింగ్ రికార్డు చాలా మెరుగ్గా ఉంది. తన లెగ్‌స్పిన్‌తో మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం ఉన్న తాహిర్ (దక్షిణాఫ్రికా) మూడు రోజుల క్రితమే కివీస్‌పై 5 వికెట్లు తీశాడు. అయితే ఇవేవీ తాహిర్పై ఫ్రాంచైజీలకు నమ్మకాన్ని పెంచలేకపోయాయి. రూ. 50 లక్షల కనీస ధరతో మళ్లీ మళ్లీ వేలంలోకి అతని పేరు వచ్చినా ఎవరూ స్పందించలేదు. విదేశీ ఆటగాళ్ల వేలానికి ఇది అందరికంటే ఎక్కువగా ఆశ్చర్యపరచిన అంశం. మార్టిన్ గప్టిల్, జేసన్ రాయ్‌లాంటి హిట్టర్లను కూడా తొలి దశలో ఎవరూ తీసుకోలేదు కానీ ఆ తర్వాత మరోసారి వేలంలో పేరు వచ్చినప్పుడు వారు కనీస ధరకు అమ్ముడుపోయారు. రెండు సార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జట్టు కెప్టెన్ స్యామీని కేవలం రూ.30 లక్షలకే పంజాబ్ సొంతం చేసుకోగా... ఈ రెండు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్’ శామ్యూల్స్‌ను ఎవరూ పట్టించుకోలేదు. అంతర్జాతీయ క్రికెటర్లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నా ఐపీఎల్ లెక్కలోకి తీసుకోని విదేశీ క్రికెటర్లలో రాస్ టేలర్, అలెక్స్ హేల్స్, బెయిర్‌స్టో, జేసన్ హోల్డర్, తిసార పెరీరా, బెహర్దీన్, కుషాల్ పెరీరా, సాన్‌ట్నర్, గ్రాండ్‌హోమ్ ఉన్నారు. అఫ్ఘనాపాటీలు... అంతర్జాతీయ క్రికెట్లో తమ జట్టు ఇంకా ఓనమాల దశలోనే ఉన్నా ఇద్దరు అఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్లో అవకాశం దక్కించుకొని ఒక్కసారిగా తమ స్థాయిని పెంచుకున్నారు. 18 ఏళ్ల లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్ కోసం ఏకంగా రూ. 4 కోట్లు వెచ్చించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, వెటరన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీని రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. రషీద్ కోసం రైజర్స్‌తో పాటు ముంబై జట్టు కూడా వేలంలో పోటీ పడింది. ఏడాదిన్నర క్రితమే అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టి 18 వన్డేలు, 21 టి20లు ఆడిన రషీద్‌కు అప్పుడే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు. ఎనిమిదేళ్ల కెరీర్లో నబీ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఐపీఎల్లో వీరిద్దరి రాక అప్ఘన్ జట్టు వేగంగా ఎదుగుతోందనడానికి సంకేతంగా చెప్పవచ్చు. వీరితో పాటు యూఏఈ ఆటగాడు చిరాగ్ సూరిని గుజరాత్ రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. డస్కటే (నెదర్లాండ్స్) తర్వాత అసోసియేట్ జట్ల నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన ఆటగాళ్లు వీరు ముగ్గురే. పాపం ఇషాంత్... ‘ఇషాంత్ కనీస విలువ రూ. 2 కోట్లు చాలా ఎక్కువ’... ఐపీఎల్ వేలం సందర్భంగా అతని మాజీ సహచరుడు గంభీర్ చేసిన వ్యాఖ్య ఇది. భారత టెస్టు జట్టులో రెగ్యులర్ ఆటగాడైన ఇషాంత్... వన్డేలు, టి20ల్లో మాత్రం భాగం కాదు. అయితే టి20ల్లో అద్భుతమైన బౌలర్ కాకపోయినా... అతని అనుభవాన్ని బట్టి చూస్తే ప్రస్తుత భారత ఆటగాడిని ఫ్రాంచైజీలు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గంభీర్ మాటలను బట్టి చూస్తే అతనికి రూ. 2 కోట్లు ఇవ్వడం కూడా ఎక్కువ అని జట్లు భావించి ఉంటాయి. చాలా రోజులుగా భారత జట్టుకు దూరంగా ఉన్నా... తన కనీస ధరను రూ. 30 లక్షలుగా మాత్రమే నిర్ణయించుకున్న వరుణ్ ఆరోన్‌కు రూ. 2.8 కోట్ల భారీ మొత్తం దక్కడం విశేషం. ఆరోన్తో పోల్చుకుంటే తక్కువ ధర వద్ద మొదలైతే ఇషాంత్‌కు కూడా అవకాశం ఉండేదేమో! ఊహించినట్లుగానే మరో టెస్టు ఆటగాడు పుజారాను ఈసారి కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఇక దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం ఆఖరిసారిగా భారత్‌కు ఆడిన ఇర్ఫాన్ పఠాన్‌పై కూడా ఎవరూ ఆసక్తి చూపించలేదు. దేశవాళీలో అప్పుడప్పుడు కొన్ని మెరుపులు ప్రదర్శిస్తూ... తనను తాను టి20 స్పెషలిస్ట్‌గా ఇర్ఫాన్ చూపించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వేలంలో అమ్ముడుపోకుండా నిరాశకు గురైన ఇతర భారత ఆటగాళ్లలో ప్రజ్ఞాన్ ఓజా, ముకుంద్, పర్వేజ్ రసూల్, ఆర్పీ సింగ్ ఉన్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించకపోయినా... ఇటీవల కొన్ని ప్రత్యేక ప్రదర్శనలతో వార్తల్లో నిలిచి లీగ్‌కు ఎంపికవుతామని ఆశించిన అనేక మంది కుర్రాళ్లపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. టి20ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన మోహిత్ ఆహ్లావత్, 17 ఏళ్ల పృథ్వీ షా, రంజీ టాప్ స్కోరర్ ప్రియాంక్ ఈ జాబితాలో ఉన్నారు. ఎవరికెంత వచ్చిందంటే... -
చేదెక్కిన చక్కెర షేర్లు
* మార్కెట్ పరుగులు పెడుతున్నా ఈ షేర్లది పతనబాటే * 2014 జూన్‌తో పోలిస్తే సగానికి పడిన ధర * డిమాండ్‌ను మించిన ఉత్పత్తితో చక్కెర కంపెనీలకూ నష్టాలే * రూ.3000 కోట్ల నష్టాల్లో మిల్లులు * రైతులకు రూ.5,500 కోట్ల మేర బకాయిలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చక్కెర తియ్యగా ఉంటుందన్నది ఎంత నిజమో... ఆ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్న మదుపరులకది భరించలేనంత చేదుగా మారిందన్నది కూడా అంతే నిజం. ఒకవంక గడిచిన ఏడాదిగా స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతూ ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తుండగా... చక్కెర కంపెనీల షేర్లు మాత్రం చతికిలబడ్డాయి. ప్రభుత్వ ప్యాకేజీపై ఆశలతో ఈ ఏడాది జూన్ వరకూ ఓ మాదిరిగా పెరిగిన ఈ షేర్లు... జూన్ నుంచి అడ్డూ అదుపూ లేకుండా పతనమవుతూనే ఉన్నాయి. అందుకే మార్కెట్లు జీవితకాల గరిష్ట స్థాయిల్లో ఉండగా... ఈ షేర్లు మాత్రం కనిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు చక్కెర రంగంలో ప్రధాన కంపెనీగా చెప్పుకునే శ్రీ రేణుక షుగర్ ఇండస్ట్రీస్‌నే చూస్తే గతేడాది జూన్‌లో దీని ధర రూ.31.80. కానీ ఇపుడు 16 రూపాయలకు చేరి దాదాపు సగం నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పతనానికి కారణమేంటి? డిమాండ్‌ను మించిన సరఫరాతో చక్కెర నిల్వలు ఏటికేడాది పెరిగిపోతున్నాయి. మరుసటేడాది మరింత ఉత్పత్తి జరుగుతోంది. దీంతో కొన్నేళ్లుగా చక్కెర ధర పెద్దగా పెరగలేదు. మరోవంక ఉత్పత్తి వ్యయాలు తడిసి మోపెడవుతుండటంతో కంపెనీలు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. కంపెనీలు చెబుతున్నదాని ప్రకారం... ప్రస్తుతం 100 కిలోల బస్తా చక్కెరను ఉత్పత్తి చేయడానికి రూ.3,250 నుంచి 3,400 అవుతోంది. మిల్లుల విక్రయ ధర మాత్రం రూ.2,400-2,500 మధ్య ఉంది. దీంతో కిలో చక్కెరపై రూ.9 దాకా కోల్పోతున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా చక్కెర ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బ్రెజిల్... చమురు ధరల పతనం నేపథ్యంలో ఇథనాల్ బదులు చక్కెరనే ఉత్పత్తి చేసే అవకాశం ఉండటం కూడా భారత్‌కు సమస్యగా మారనుంది. అంతర్జాతీయ మార్కెట్లోకి మార్చి నుంచి బ్రెజిల్ చక్కెర వస్తుంది. అంతర్జాతీయ ధరల ఒత్తిడితో చెరకు రైతుకు సమయానికి డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉందని భారత చక్కెర మిల్లుల సంఘం(ఐఎస్ఎంఏ) డెరైక్టర్ జనరల్ అవినాశ్ వర్మ ఇటీవల చెప్పారు కూడా. పెరుగుతున్న నష్టాలు... చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో ఏటా వినియోగం 230 లక్షల టన్నులుంది. ప్రస్తుత చక్కెర సీజన్లో (2014 అక్టోబరు-2015 సెప్టెంబరు) 260 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. దీనికితోడు అక్టోబరు 1 నాటికే దేశంలో 65 లక్షల టన్నుల చక్కెర నిల్వలున్నాయని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సీవోవో జి.వెంకటేశ్వరరావు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అననుకూల పరిస్థితులతో దేశంలోని చక్కెర మిల్లులు రూ.3,000 కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయి. ఇవి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు మరో 5.500 కోట్ల వరకూ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బకాయిలు రూ.250 కోట్ల వరకూ ఉన్నాయని వెంకటేశ్వరరావు చె ప్పారు. చెరకు విషయానికొస్తే ఏపీ, తెలంగాణల్లో 2006-07లో 260 లక్షల టన్నులున్న ఉత్పత్తి ఇపుడు 100 లక్షల టన్నులకు పడిపోయింది. 2015-16 సీజన్లో సాగు విస్తీర్ణం 30-35 శాతం తగ్గే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చక్కెర పరిశ్రమకు మరో ఒకటిరెండేళ్లు కష్టకాలమే. ఎందుకంటే దేశీయంగా చక్కెర నిల్వలు భారీగా ఉన్నాయి. క్రూడ్ ధర పడిపోవడంతో బ్రెజిల్ చక్కెర ఉత్పత్తిపై దృష్టిపెడుతోంది. ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్మెంట్లలో 5 శాతం లోపు చక్కెర కంపెనీల షేర్లు ఉంటే వాటిని కొనసాగించొచ్చు. ఎక్కువ మొత్తంలో ఉంటే వైదొలిగి మంచి పనితీరు కనబరుస్తున్న సిమెంటు, ఫార్మా, ఎంపిక చేసిన ఆర్థిక సేవలు, మీడియా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. -సతీష్ కంతేటి, జెన్ మనీ. ఇవీ... పరిశ్రమ సూచనలు * రంగరాజన్ కమిటీ సూచించినట్టుగా చక్కెర ధరతో చెరకు ధరను ముడిపెట్టాలి. * చక్కెర దిగుమతుల కట్టడికి సుంకం పెంపుతోపాటు ఎగుమతులను ప్రోత్సహించాలి. * ముడి చక్కెర ఎగుమతిపై ఉపసంహరించిన సబ్సిడీని పునరుద్ధరించాలి. * చమురు కంపెనీల నుంచి ఇథనాల్ కొనుగోళ్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలి.