
చేదెక్కిన చక్కెర షేర్లు
* మార్కెట్ పరుగులు పెడుతున్నా ఈ షేర్లది పతనబాటే
* 2014 జూన్‌తో పోలిస్తే సగానికి పడిన ధర
* డిమాండ్‌ను మించిన ఉత్పత్తితో చక్కెర కంపెనీలకూ నష్టాలే
* రూ.3000 కోట్ల నష్టాల్లో మిల్లులు
* రైతులకు రూ.5,500 కోట్ల మేర బకాయిలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చక్కెర తియ్యగా ఉంటుందన్నది ఎంత నిజమో... ఆ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్న మదుపరులకది భరించలేనంత చేదుగా మారిందన్నది కూడా అంతే నిజం. ఒకవంక గడిచిన ఏడాదిగా స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతూ ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తుండగా... చక్కెర కంపెనీల షేర్లు మాత్రం చతికిలబడ్డాయి. ప్రభుత్వ ప్యాకేజీపై ఆశలతో ఈ ఏడాది జూన్ వరకూ ఓ మాదిరిగా పెరిగిన ఈ షేర్లు... జూన్ నుంచి అడ్డూ అదుపూ లేకుండా పతనమవుతూనే ఉన్నాయి.
అందుకే మార్కెట్లు జీవితకాల గరిష్ట స్థాయిల్లో ఉండగా... ఈ షేర్లు మాత్రం కనిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు చక్కెర రంగంలో ప్రధాన కంపెనీగా చెప్పుకునే శ్రీ రేణుక షుగర్ ఇండస్ట్రీస్‌నే చూస్తే గతేడాది జూన్‌లో దీని ధర రూ.31.80. కానీ ఇపుడు 16 రూపాయలకు చేరి దాదాపు సగం నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
పతనానికి కారణమేంటి?
డిమాండ్‌ను మించిన సరఫరాతో చక్కెర నిల్వలు ఏటికేడాది పెరిగిపోతున్నాయి. మరుసటేడాది మరింత ఉత్పత్తి జరుగుతోంది. దీంతో కొన్నేళ్లుగా చక్కెర ధర పెద్దగా పెరగలేదు. మరోవంక ఉత్పత్తి వ్యయాలు తడిసి మోపెడవుతుండటంతో కంపెనీలు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. కంపెనీలు చెబుతున్నదాని ప్రకారం... ప్రస్తుతం 100 కిలోల బస్తా చక్కెరను ఉత్పత్తి చేయడానికి రూ.3,250 నుంచి 3,400 అవుతోంది. మిల్లుల విక్రయ ధర మాత్రం రూ.2,400-2,500 మధ్య ఉంది.
దీంతో కిలో చక్కెరపై రూ.9 దాకా కోల్పోతున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా చక్కెర ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బ్రెజిల్... చమురు ధరల పతనం నేపథ్యంలో ఇథనాల్ బదులు చక్కెరనే ఉత్పత్తి చేసే అవకాశం ఉండటం కూడా భారత్‌కు సమస్యగా మారనుంది. అంతర్జాతీయ మార్కెట్లోకి మార్చి నుంచి బ్రెజిల్ చక్కెర వస్తుంది. అంతర్జాతీయ ధరల ఒత్తిడితో చెరకు రైతుకు సమయానికి డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉందని భారత చక్కెర మిల్లుల సంఘం(ఐఎస్‌ఎంఏ) డెరైక్టర్ జనరల్ అవినాశ్ వర్మ ఇటీవల చెప్పారు కూడా.
పెరుగుతున్న నష్టాలు...
చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో ఏటా వినియోగం 230 లక్షల టన్నులుంది. ప్రస్తుత చక్కెర సీజన్‌లో (2014 అక్టోబరు-2015 సెప్టెంబరు) 260 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా. దీనికితోడు అక్టోబరు 1 నాటికే దేశంలో 65 లక్షల టన్నుల చక్కెర నిల్వలున్నాయని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ సీవోవో జి.వెంకటేశ్వరరావు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
అననుకూల పరిస్థితులతో దేశంలోని చక్కెర మిల్లులు రూ.3,000 కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయి. ఇవి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు మరో 5.500 కోట్ల వరకూ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బకాయిలు రూ.250 కోట్ల వరకూ ఉన్నాయని వెంకటేశ్వరరావు చె ప్పారు. చెరకు విషయానికొస్తే ఏపీ, తెలంగాణల్లో 2006-07లో 260 లక్షల టన్నులున్న ఉత్పత్తి ఇపుడు 100 లక్షల టన్నులకు పడిపోయింది. 2015-16 సీజన్‌లో సాగు విస్తీర్ణం 30-35 శాతం తగ్గే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
చక్కెర పరిశ్రమకు మరో ఒకటిరెండేళ్లు కష్టకాలమే. ఎందుకంటే దేశీయంగా చక్కెర నిల్వలు భారీగా ఉన్నాయి. క్రూడ్ ధర పడిపోవడంతో బ్రెజిల్ చక్కెర ఉత్పత్తిపై దృష్టిపెడుతోంది. ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్లలో 5 శాతం లోపు చక్కెర కంపెనీల షేర్లు ఉంటే వాటిని కొనసాగించొచ్చు. ఎక్కువ మొత్తంలో ఉంటే వైదొలిగి మంచి పనితీరు కనబరుస్తున్న సిమెంటు, ఫార్మా, ఎంపిక చేసిన ఆర్థిక సేవలు, మీడియా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.
-సతీష్ కంతేటి, జెన్ మనీ.
ఇవీ... పరిశ్రమ సూచనలు
* రంగరాజన్ కమిటీ సూచించినట్టుగా చక్కెర ధరతో చెరకు ధరను ముడిపెట్టాలి.
* చక్కెర దిగుమతుల కట్టడికి సుంకం పెంపుతోపాటు ఎగుమతులను ప్రోత్సహించాలి.
* ముడి చక్కెర ఎగుమతిపై ఉపసంహరించిన సబ్సిడీని పునరుద్ధరించాలి.
* చమురు కంపెనీల నుంచి ఇథనాల్ కొనుగోళ్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలి.