ఆదోని మార్కెట్‌యార్డులో నిల్వ ఉన్న వేరుశనగ బస్తాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఏర్పాటు చేసిన ఆరు వేరుశనగ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతో 75,120.8 క్వింటాళ్ల వేరుశనగ కొనుగోలు చేశారు. సరుకును నిల్వ చేయడానికి గోదాములు లేకపోవడంతో ఇందుల్లో 45 వేల క్వింటాళ్లకు పైనే కొనుగోలు కేంద్రాల్లో ఉండిపోయింది. మరోవైపు వేరుశనగ కొనుగోలుకు ఖాళీ సంచుల కొరత వేధిస్తోంది. గోదాములు, సంచులు లేకపోవడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. శనివారం నుంచి ఏ కేంద్రంలోనూ కొనుగోళ్లు జరగలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకముందే గోదాములను సిద్ధం చేయాల్సిన ఆయిల్‌పెడ్, నాఫెడ్ హడావుడిగా కొనుగోళ్లు ప్రారింభించడం వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా చోట్ల వీరి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు.
ఆదోనిలో తీసుకున్న గోదాములు సరిపోకపోవడంతో రైతులు అమ్మిన సరుకుకు కాపలా ఉంటున్నారు. కొన్నదానిలో 60శాతం పైగా సెంటర్లలోనే నిలిచిపోయిందంటే అధికారుల నిర్లక్ష్యాన్ని చాటుతోంది. డోన్, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, ప్యాపిలిలో వేరుశనగ బస్తాలు గుట్టలు, గుట్టలుగా పేరుకపోయాయి. కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పేరుకపోయిన నిల్వలను ఎప్పటికి తరలిస్తారు... ఎప్పటి నుంచి కొనుగోలు పునః ప్రారంభిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయలేదని, తగ్గించామని ఆయిల్‌ఫెడ్ జిల్లా ఇన్‌చార్జ్ అంకిరెడ్డి తెలిపారు. సరుకును తరలించే పనులు ఊపందుకున్నాయని, త్వరలోనే పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment