ఇక వజ్రాల వేట షురూ..
న్యూఢిల్లీ: దేశంలో మొదటి సారి వజ్రాల గనుల తవ్వకాల కోసం ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో విరివిగా వున్న వజ్రాల గనులకు వేలం పాటల్ని వచ్చే నెలలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చేవారం టెండర్లను ఆహ్వానిస్తూ నోటీసులు ఇవ్వనున్నట్టు మైన్స్ సెక్రటరీ బల్విందర్ కుమార్ పీటీఐకి తెలిపారు. ఫిబ్రవరిలో మొదటి సారి బంగారు గనులకు వేలం నిర్వహించిన ప్రభుత్వం ఇపుడు వజ్రాల అన్వేషణ కోసం నడుం బిగిస్తోంది.
ఈ గనుల లీజు ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేవారం నోటీసులు ఇస్తుందని బల్విందర్ కుమార్ తెలిపారు. సుమారు మూడువారాలలో టెండర్ల పరిశీలన పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి మాత్రమే మైనింగ్ నిర్వహిస్తోందని తెలిపారు. దేశంలో ఇది ఏటా 81,000 క్యారెట్ల పైగా ఉత్పత్తి చేస్తోందన్నారు. దీంతోపాటుగా పన్నా, శాంతా జిల్లాలో 400 క్యారెట్ల షాలో డైమండ్స్ ను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. మధ్యప్రదేశ్ లో 10,45,000 క్యారెట్ల వజ్రాల నిధులు ఉండగా, పన్నా 976,05 వేల క్యారెట్లవరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి దశలో మొత్తం 42 గనులను గుర్తించినట్టు తెలిపారు. ఇనుప ఖనిజం, బాక్సైట్, బంగారు, సున్నపురాయి నిక్షేపాలతో ఇవి నిండివున్నాయన్నారు. వీటిలో ఆరు గనుల విజయవంతంగా వేలం వేశారు.