ఆశల ఘోష
► కనీస వేతనం కోసం ఆశా కార్యకర్తల ఆందోళన
► డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట భారీ ధర్నా
► ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
► ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు
సీతమ్మధార(విశాఖ ఉత్తర): కనీస వేతనం కోసం ఆశా(ఆంధ్రప్రదేశ్ వాలంటరీ హెల్త్ వర్కర్స్) కార్యకర్తలు నినదించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా తమను పట్టించుకోని టీడీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు గురువారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు బి.రామలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్స్కు కనీస వేతనంగా నెలకు రూ.6 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణా రాష్ట్రం ఆశా కార్యకర్తలకు కనీస వేతనంగా రూ.6 వేలు ప్రకటించిందని, తక్షణమే ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేయాలన్నారు. మూడు నెలల బకాయి పారితోషకాలు, చంద్రన్న బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పీహెచ్సీలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, నాలుగు సంవత్సరాల యూనిఫాంలు, అలవెన్స్లను వెంటనే చెల్లించాలన్నారు. పీహెచ్సీలలో ఖాళీలను భర్తీ చేయాలని, ప్రజలకు అవసర మైన మందుల్ని ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లుగా గ్రామ స్థాయిలో గర్భిణులు, బాలింతలు, పిల్లల సంరక్షణతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూస్తున్నామని చెప్పారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామన్నారు. అయినా ప్రభుత్వం ఆశా కార్యకర్తలపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. నెలలు తరబడి బకాయిలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, చేసిన పనికి కూడా పారితోషకం పూర్తిగా చెల్లించకుండా కోతలు విధిస్తుందని ఆమె మండిపడ్డారు. వేతనాల కోసం ఆందోళనలు చేస్తే పోలీసులతో బెదిరించి కనీస వేతనం కాదు కదా అసలు ఎలాంటి చెల్లింపులు లేకుండా చేస్తుందని ఆరోపించారు. కేంద్రం మంజూరు చేసే యూనిఫాం అలవెన్స్ సంవత్సారానికి రూ.500ను గత నాలుగేళ్లుగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన కార్యదర్శి వి.సత్యవతి మాట్లాడుతూ ఆశా వర్కర్లపై పని భారం పెరిగిపోయిందని, వేతనాలు లేక తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడిలకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. తక్షణమే కనీసం వేతనం ప్రకటించాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి, బలవంతంగా జీపులు, ఆటోలు, బస్సులు, వ్యాన్లలోకి ఎక్కించారు. దీంతో ఆశా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఆందోళనకారులను నగరంలోని ద్వారకా, మూడో, నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లతో పాటు పీఎంపాలెం, ఆనందపురం పోలీస్స్టేషన్లకు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు కోటేశ్వరరావు, యూనియన్ గౌరవ అధ్యక్షురాలు ఎస్.అరుణ, అధ్యక్షులు బి.రామలక్షి, జిల్లాలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు.