Minister Balaraju
-
మంత్రి బాలరాజును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
విశాఖ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్ లో ఆమెదం పొందిన అనంతరం సీమాంధ్ర నేతలకు నిరసన సెగలు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేయడం, అనంతరం ఆ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించడంతో సీమాంధ్ర లో నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి . కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను విశాఖ నగరానికి తీసుకురావడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. బాలరాజును నగర కాంగ్రెస్ అధ్యక్షుడ్ని కార్యకర్తలు అడ్డుకుని సమైక్య ద్రోహి అయిన జైరాం రమేష్ ను విశాఖకు ఎందుకు తీసుకువచ్చారని నిలదీశారు. సమైక్య ద్రోహులకు సీమాంధ్రలో అడుగుపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
'ఒక్కోప్రాంతానికి ఒక్కో మాట మాట్లాడిస్తున్నారు'
హైదరాబాద్: విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడిఉన్నానని రాష్ట్ర మంత్రి బాలరాజు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించేముందు సీమాంధ్రులకు ఏం కావాలో అడిగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్కోప్రాంతానికి ఒక్కో మాట మాట్లాడిస్తున్న చంద్రబాబుది రాజకీయ కాంక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. తాము రెండు రాష్ట్రాలకూ సుముఖంగా ఉన్నామని చంద్రబాబు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. విభజన ప్రకటన వెలువడగానే కొత్త రాష్ట్రానికి చంద్రబాబు రూ. 5 లక్షల కోట్లు అడిగారంటే ఆయన విభజనకు అంగీకరించినట్టు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అడుగుతున్న న్యాయం ఏంటో చెప్పాలని బాలరాజు డిమాండ్ చేశారు. -
కిరణ్‌కుమార్‌పై మంత్రి బాలరాజు ఫైర్
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై మంత్రి పసుపులేటి బాలరాజు విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వివక్షత చూపుతోందని బాలరాజు ముఖ్యమంత్రిని విమర్శించారు. తన శాఖకు సంబంధించి తనను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సొంత జిల్లా విశాఖపట్నంలో ఇటీవల జరిగిన రచ్చబండ కార్యక్రమానికి కనీసం తనను ఆహ్వానించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. అదే జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు ముఖ్యమంత్రితో సన్నిహితంగా మెలుగుతుండగా, బాలరాజు కొంతకాలంగా సీఎంకు దూరంగా ఉంటున్నారు. -
విభజన ఆగదు-సమస్యలపైనే పోరాటం
-
విభజన ఆగదు-సమస్యలపైనే పోరాటం: మంత్రి బాలరాజు
హైదరాబాద్: రాష్ట్ర విభజన ఆగదని స్పష్టమవుతోందని, ఇక సీమాంధ్ర ప్రజల సమస్యలపై పోరాడతామని మంత్రి బాలరాజు చెప్పారు. ఢిల్లీకి వెళ్లి మంత్రుల బృందాన్ని కలుస్తామన్నారు. రాష్ట్రాన్ని విభజన చేయమని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బ్లాంక్‌గా రాసి ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మేవారు సిడబ్ల్యూసి చేసిన తెలంగాణ తీర్మానాన్ని గౌరవించాల్సిందేనన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశాలను చర్చిస్తామని మంత్రి బాలరాజు చెప్పారు. -
డీఈవో పోస్టుకు డిమాండ్!
సాక్షి, విశాఖపట్నం : జిల్లా విద్యాశాఖాధికారి పోస్టుకోసం నలుగురు అధికారులు పోటీపడుతున్నారు. వీరిలో ఇద్దరు గతంలో జిల్లా విద్యాశాఖలో పనిచేసినవారే. మిగిలిన ఇద్దరు చెరో మంత్రిని పట్టుకుని పైరవీలు సాగిస్తున్నట్టు సమాచారం. దీంతో జిల్లా మంత్రులు తమ బల నిరూపణకు సిద్ధమవుతున్నారు. నెలాఖరుతో డీఈవో కొనుకు కృష్ణవేణి పదవీ విరమణ చేయనున్నారు. ఆస్థానాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన బుచ్చన్న ముందంజలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన డెప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు మంత్రి బాలరాజు అండగా ఉన్నట్టు తెలిసింది. మరొకరు ఒంగోలు(ప్రకాశం జిల్లా) డీఈవో రాజేశ్వరరావు. ఇదే ప్రాంతానికి చెందినవారైన జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఈయన కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వీరి పేర్లను ఇద్దరు మంత్రులు ఇప్పటికే సీఎం పేషీకి సిఫారసు చేసినట్టు తెలిసింది. వీరితోపాటు గతంలో విశాఖ డీఈవోగా పనిచేసి ప్రస్తుతం పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ)గా వ్యవహరిస్తున్న ఎం.ఆర్.ప్రసన్నకుమార్ ఎఫ్ఏసీగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కొన్నేళ్లపాటు జిల్లాలో ఉప విద్యాశాఖాధికారిగా పనిచేసి, పదోన్నతిపై అనంతపురం డీఈవోగా వెళ్లిన మధుసూదనరావు కూడా బదిలీపై జిల్లాకు వచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. భలే డిమాండ్ : విశాఖ జిల్లా డీఈవో పోస్టు ఖాళీ అయిందంటే చాలు.. చాలా మంది ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. భారీ సంఖ్యలో ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు, డైట్, బీఈడీ కళాశాలలున్నాయి. వీటికి గుర్తింపు, ఏటా తనిఖీలు పేరిట ‘ఆదాయ’ వనరులు బోలెడు. దీంతో ఈ స్థానంలోకి వస్తే కాసుల వర్షమేనన్న వాదనలు ఉ న్నాయి. దీంతో ఈ స్థానానికి రూ.లక్షల్లో చెల్లించేందుకు కూడా కొందరు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం సమైక్యాం ధ్ర ఉద్యమ హోరు, ప్రభుత్వ పాలన దాదాపు స్తంభించినా.. విశాఖ డీఈవో పోస్టుకు మాత్రం నెల రోజుల ముందు ను ంచే ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. వీరి లో ఎవరికి ఆ అవకాశం దక్కుతుందో తెలియాలి. ఈ ప్రయత్నాలు కొలిక్కి వచ్చేలోగా ప్రస్తుతమున్న ఇద్దరు ఉప విద్యాశాఖాధికారుల్లో (బి.లింగేశ్వరరెడ్డి, సి.వి.రేణుక) సీనియార్టీ ఆధారంగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించనున్నారు. -
ఆగ్రహించిన ఉద్యమకారులు పోలీసులు
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం పదవికి రాజీనామా చేయాలని తన కారుకు అడ్డుపడ్డ ఉపాధ్యాయుల మీద మంత్రి బాలరాజు శివాలెత్తారు. ‘ఎవడ్రా నన్ను రాజీనామా చేయమన్నది?’ అంటూ ఉపాధ్యాయుల మీద చెయ్యెత్తి దాడి చేయబోయారు. చివరకు ఆగ్రహాన్ని అదుపులోకి తెచ్చుకుని ఆందోళనకు దిగిన వారి మీద కేసులు నమోదు చేయాలని సీఐని ఆదేశించి ఇద్దరిని అరెస్టు చేయించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో సోమవారం ఉదయం స్థానిక ఉపాధ్యాయులు, యువత ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో విశాఖ నుంచి నర్సీపట్నం వస్తున్న మంత్రి బాలరాజు కాన్వాయ్ వారి కంట పడింది. ఉద్యమకారులు కాన్వాయ్‌ను అడ్డగించి మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కోపోద్రిక్తుడైన మంత్రి తన అధికారికవాహనం దిగి ‘ఎవడ్రా నన్ను రాజీనామా చేయమన్నది?.. ఎవడంటూ గద్దించారు. ఆందోళనలో ఉన్న ఉపాధ్యాయులపై చెయ్యెత్తి దాడి చేసేంత పని చేశారు. చివరకు కోపాన్ని అణచుకుని తన వాహనాన్ని ఆపి గొడవ చేసినందుకు ఆందోళన కారులపై కేసులు నమోదు చేయాలంటూ అక్కడే వున్న టౌన్ సీఐ ప్రసాదరావును ఆదేశించారు. పరిస్థితి వేడెక్కడంతో సీఐ ప్రసాద్ మంత్రిని బతిమాలి అక్కడ నుంచి పంపించేశారు. మంత్రి హుకుంతో పోలీసులు ఆందోళనకారులమీద దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై ఆగ్రహించిన ఉద్యమకారులు పోలీసులు డౌన్‌డౌన్ అంటూ మంత్రి నివాసం వద్దకు వెళ్లి అరెస్టు చేసినవారిని విడిచిపెట్టాలంటూ డిమాండ్ చేశారు. తనను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ ఇద్దరు దుర్భాషలాడారని అందుచేతనే తాను ఆగ్రహించినట్టు తర్వాత మంత్రి చెప్పారు. సీమాంధ్రలోని కొంత మంది నాయకుల్లాగా తాను ఉత్తుత్తి రాజీనామాలు చేయనని కుండ బద్దలు కొట్టారు. కొంత మంది(రాజీనామాలు చేసిన వారు) లాగా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం తనకు చేతకాదని, అలా తాను నటించలేనని చెప్పారు. అందుకే రాజీనామా చేయడంలేదని బదులిచ్చారు.