నర్సీపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం పదవికి రాజీనామా చేయాలని తన కారుకు అడ్డుపడ్డ ఉపాధ్యాయుల మీద మంత్రి బాలరాజు శివాలెత్తారు. ‘ఎవడ్రా నన్ను రాజీనామా చేయమన్నది?’ అంటూ ఉపాధ్యాయుల మీద చెయ్యెత్తి దాడి చేయబోయారు. చివరకు ఆగ్రహాన్ని అదుపులోకి తెచ్చుకుని ఆందోళనకు దిగిన వారి మీద కేసులు నమోదు చేయాలని సీఐని ఆదేశించి ఇద్దరిని అరెస్టు చేయించారు.
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో సోమవారం ఉదయం స్థానిక ఉపాధ్యాయులు, యువత ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో విశాఖ నుంచి నర్సీపట్నం వస్తున్న మంత్రి బాలరాజు కాన్వాయ్ వారి కంట పడింది. ఉద్యమకారులు కాన్వాయ్‌ను అడ్డగించి మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కోపోద్రిక్తుడైన మంత్రి తన అధికారికవాహనం దిగి ‘ఎవడ్రా నన్ను రాజీనామా చేయమన్నది?.. ఎవడంటూ గద్దించారు. ఆందోళనలో ఉన్న ఉపాధ్యాయులపై చెయ్యెత్తి దాడి చేసేంత పని చేశారు. చివరకు కోపాన్ని అణచుకుని తన వాహనాన్ని ఆపి గొడవ చేసినందుకు ఆందోళన కారులపై కేసులు నమోదు చేయాలంటూ అక్కడే వున్న టౌన్ సీఐ ప్రసాదరావును ఆదేశించారు. పరిస్థితి వేడెక్కడంతో సీఐ ప్రసాద్ మంత్రిని బతిమాలి అక్కడ నుంచి పంపించేశారు.
మంత్రి హుకుంతో పోలీసులు ఆందోళనకారులమీద దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై ఆగ్రహించిన ఉద్యమకారులు పోలీసులు డౌన్‌డౌన్ అంటూ మంత్రి నివాసం వద్దకు వెళ్లి అరెస్టు చేసినవారిని విడిచిపెట్టాలంటూ డిమాండ్ చేశారు. తనను రాజీనామా చేయమని డిమాండ్ చేస్తూ ఇద్దరు దుర్భాషలాడారని అందుచేతనే తాను ఆగ్రహించినట్టు తర్వాత మంత్రి చెప్పారు. సీమాంధ్రలోని కొంత మంది నాయకుల్లాగా తాను ఉత్తుత్తి రాజీనామాలు చేయనని కుండ బద్దలు కొట్టారు. కొంత మంది(రాజీనామాలు చేసిన వారు) లాగా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం తనకు చేతకాదని, అలా తాను నటించలేనని చెప్పారు. అందుకే రాజీనామా చేయడంలేదని బదులిచ్చారు.
ఆగ్రహించిన ఉద్యమకారులు పోలీసులు
Published Tue, Aug 6 2013 2:54 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement