అవసరమైతే మార్పులు చేస్తాం..!
న్యూఢిల్లీ: ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ విషయంలో తమ ప్రభుత్వానికి, గత యూపీఏ ప్రభుత్వానికి పోలిక లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘భావప్రకటన స్వేచ్ఛ హక్కుకు కట్టుబడి ఉన్నామని మేం లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపాం. యూపీఏ ప్రభుత్వం మాత్రం తమను వ్యతిరేకిస్తున్నవారిపై, వ్యంగ్యంగా చిత్రిస్తున్నవారిపై కక్షసాధింపునకు మార్గంగా ఈ చట్టాన్ని ఉపయోగించుకుంది’ అన్నారు.
‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కానీ ఈ తీర్పు నేపథ్యంలో చట్టంలో ఏమైనా మార్పులు అవసరమని భద్రతా సంస్థలు భావిస్తే.. చట్టపరంగా, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలగకుండా.. అవసరమైన చర్యలు చేపడతాం’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ముందు ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ రాజ్యాంగబద్ధతను కేంద్రప్రభుత్వం సమర్ధించిన విషయం తెలిసిందే.