ministry expansion
-
సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు
పాట్నా: 2020లో అత్యంత విషాదం నింపిన ఘటన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య. అతడి ఆత్మహత్య అనంతరం జరిగిన పరిణామాలు మరింత ఆవేదనకు గురి చేశాయి. అయితే ఇప్పుడు సుశాంత్ సింగ్ బంధువు బిహార్ మంత్రిగా నియమితులయ్యారు. ఈ వార్తపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు నీరజ్ సింగ్ బబ్లూ సుశాంత్‌కు చుట్టం అవుతారు. బిహార్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంగళవారం చేపట్టారు. కొత్తగా 17 మంది మంత్రులుగా నియమితులు కాగా వారిలో సుశాంత్ కజిన్ నీరజ్ సింగ్ బబ్లూ ఉన్నారు. సీఎం నితీశ్ కుమార్ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. రాఘోపూర్ స్థానం నుంచి 2005లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2010, 2015, 2020 ఎన్నికల్లో ఉంబర్‌పూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. బీహార్ బీజేపీ అగ్రనేతల్లో నీరజ్ సింగ్ బబ్లూ ఒకరు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ‘సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు’ అని ప్రకటించిన వ్యక్తి నీరజ్ సింగ్ బబ్లూ. సోషల్ మీడియాలో ‘జస్టిస్ ఫర్ ఎస్ఎస్ఆర్’ అనే ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. సుశాంత్ మరణం తర్వాత అతడి కుటుంబానికి నీరజ్ సింగ్ బబ్లూ అండగా నిలిచారు. -
కన్నడ మంత్రులకు శాఖల కేటాయింపు
బెంగళూరు: తర్జన భర్జనల అనంతరం కర్ణాటక సర్కారులో మంత్రులకు శాఖలను కేటాయించారు. సీఎం కుమారస్వామి ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకోగా.. డిప్యూటీ సీఎం పరమేశ్వర హోం బాధ్యతలు నిర్వహించనున్నారు. కుమారస్వామి సోదరుడు రేవణ్ణకు ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ), కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు భారీ, మధ్య నీటిపారుదల, వైద్య విద్య శాఖలను కేటాయించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆర్వీ దేశ్‌పాండేకు రెవెన్యూ, కేజే జార్జ్‌కు భారీ, మధ్యతరహా పరిశ్రమలు అప్పగించారు. ఏకైక మహిళామంత్రి జయమాలకు మహిళా, శిశుసంక్షేమ శాఖ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కృష్ణ బైర గౌడకు గ్రామీణాభివృద్ధి, శివ శంకర రెడ్డికి వ్యవసాయం, ప్రియాంక్ ఖర్గేకు సాంఘిక సంక్షేమæ శాఖ బాధ్యతలను అప్పగించారు. -
కొలువుదీరిన కుమారస్వామి కేబినెట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్ నేతలతో విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం రూపొందించిన తన కేబినెట్లో మొత్తం 25 మందికి చోటు కల్పించారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ వాజూభాయ్ వాలా కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. జేడీఎస్ నుంచి 8 మందికి, కాంగ్రెస్ నుంచి 15 మందికి, బీఎస్పీ, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పక్ష(కేపీజేపీ)లకు ఒక్కోటి చొప్పున పదవులు కల్పించారు. జేడీఎస్‌తో బీఎస్పీ ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకోగా, సంకీర్ణ సర్కారుకు కేపీజేపీ మద్దతు పలికింది. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఎంబీ పాటిల్, దినేశ్ గుండూ రావు, రామలింగ రెడ్డి, ఆర్.రోషన్ బైగ్, హెచ్‌కే పాటిల్, శ్యాంనూర్ శివశంకరప్ప, తన్వీర్ సేఠ్, సతీశ్ జార్ఖిహోలిలకు ఈసారి అవకాశం దక్కలేదు. సీఎం వర్గానికి పెద్దపీట.. కుమారస్వామి సామాజికవర్గం ఒక్కలిగలకు మంత్రివర్గంలో పెద్దపీట దక్కింది. మొత్తం 9 మంది ఒక్కలిగలు, నలుగురు లింగాయత్‌లు, ముగ్గురు దళితులు, ముగ్గురు మైనార్టీలు, ఇద్దరు– కురుబలు, ఈడిగ, ఉప్పర, గిరిజన తెగ, బ్రాహ్మణ కులాల నుంచి ఒక్కొక్కరికి స్థానం లభించింది. చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్దరామయ్యను ఓడించిన జేడీఎస్ నాయకుడు జీటీ దేవెగౌడ, కుమారస్వామి సోదరుడు రేవణ్ణలకు కేబినెట్లో చోటు దక్కింది. కాంగ్రెస్ నుంచి ప్రమాణం చేసిన వారిలో డీకే శివకుమార్, కేజే జార్జ్, ఆర్వీ దేశ్‌పాండే, ప్రియాంక్ ఖర్గే, ఆర్బీ పాటిల్ తదితరులున్నారు. బీఎస్పీ, కేపీజేపీలకు ఉన్న ఏౖకైక ఎమ్మెల్యేలు వరసగా ఆర్ఏ మహేశ్, ఆర్. శంకర్లకు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఈ కేబినెట్లో అలనాటి నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జయమాల ఏకైక మహిళా మంత్రి కాగా, 83 ఏళ్ల మనాగుళి(జేడీఎస్) అత్యంత పెద్ద వయస్కులు. కొత్త మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించాల్సి ఉంది. అసంతృప్తుల నిరసనలు.. మంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హెచ్‌కే పాటిల్ బెంగళూరులోని చాళుక్య సర్కిల్లో 200 మంది మద్దతుదారులతో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సేఠ్‡ అభిమానులు కూడా మైసూరులో నిరసనకు దిగారు. దీనిపై సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. సంకీర్ణ ప్రభుత్వంలో కేబినెట్ కూర్పు చేసేటప్పుడు ఇలాంటి అసంతృప్తులు రావడం సహజమేనని అన్నారు. సంయమనంతో ఉండాలని, అందరికీ న్యాయం చేస్తాననని హామీ ఇచ్చారు. -
కర్ణాటకలో ఎట్టకేలకు శాఖలపై ఏకాభిప్రాయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముందడుగు పడింది. సంకీర్ణ ప్రభుత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్‌ల మధ్య శాఖల పంపకంపై సయోధ్య కుదిరింది. జూన్ 6న కొత్త మంత్రులు ప్రమాణంచేస్తారని ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వరతో కలసి కుమారస్వామి శుక్రవారం గవర్నర్‌తో భేటీ అయిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. కర్ణాటకలో సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేసి పది రోజులు పూర్తయినా కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకంపై ప్రతిష్టంభన నెలకొనడంతో మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం తెలిసిందే. అటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్.. కుమారస్వామి, మాజీ సీఎం సిద్దరామయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు. సంకీర్ణ ప్రభుత్వమే ముఖ్యం తప్ప మంత్రిత్వ శాఖలు కాదనీ, ఆర్థిక శాఖను జేడీఎస్‌కే ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారని వేణుగోపాల్ తెలిపారు. కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ మాకంటే మాకే కావాలంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లు ఇన్నాళ్లూ పట్టుబట్టడం తెలిసిందే. ఈ అంశంపై మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడతో రాహుల్ ఫోన్లో మాట్లాడినట్లు వేణుగోపాల్ చెప్పారు. అలాగే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేయాలని ఇరు పార్టీలూ నిర్ణయం తీసుకున్నట్లు వేణుగోపాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు దక్కే శాఖలు హోం, రెవెన్యూ, నీటి పారుదల, విద్య, వైద్యం, ఆరోగ్యం, బెంగళూరు నగరాభివృద్ధి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం, అటవీ–పర్యావరణం, పరిశ్రమలు, కార్మిక, గనులు, భూ విజ్ఞాన శాస్త్రం మంత్రిత్వ శాఖలు దక్కనున్నాయి. వీటితోపాటు మహిళా–శిశు సంక్షేమం, ఆహార–పౌర సరఫరాలు, హజ్, వక్ఫ్, మైనారిటీ వ్యవహారాలు, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, విజ్ఞాన సాంకేతికత, సమాచార సాంకేతికత, యువజన–క్రీడలు, కన్నడ సంస్కృతి శాఖలు కాంగ్రెస్ వద్దే ఉంటాయి. జేడీఎస్‌కు దక్కే శాఖలు ఆర్థిక, ఎక్సైజ్, విద్యుత్తు, నిఘా, సమాచార, ప్రణాళిక–గణాంకాలు, ప్రజా పనులు, సహకారం, పర్యాటకం, మత్స్య పరిశ్రమ, పశు సంవర్ధక శాఖ, ఉద్యాన, పట్టు పురుగుల పెంపకం, చిన్న తరహా పరిశ్రమలు, రవాణా, సూక్ష్మ నీటి పారుదల శాఖలు జేడీఎస్‌కు దక్కాయి. -
మరోసారి క్యాబినెట్ విస్తరణ
లక్నో: సమాజ్ వాదీ పార్టీ లో అంతర్గత సంక్షోభం ముగియడంతో మరోసారి మంత్రి వర్గాన్ని సీఎం అఖిలేష్ యాదవ్ విస్తరించన్నారు. సోమవారం ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రెండువారాల క్రితం అవినీతి ఆరోపణలపై మైనింగ్ శాఖ మంత్రి గాయత్రి ప్రజాపతి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజ్ కిషోర్ ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. వీరికి కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడంతో తిరిగి మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు. జులైలో మంత్రివర్గ విస్తరణలో ప్రమాణ స్వీకారం చేయలేకపోయిన జియాజుద్దీన్ రిజ్వీ ఈ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మరోవైపు అవినీతి ఆవినీతి ఆరోపణలపై పదవులు కోల్పోయిన వారి చేత తిరిగి ప్రమాణ స్వీకారం చేయించరాదని గవర్నర్ కు సామాజిక కార్యకర్త నూతన్ ఠాకూర్ ఫిర్యాదు చేశారు. యూపీ క్యాబినెట్ లో ప్రస్తుతం 60 మంత్రులున్నారు. మంత్రి మండలిని విస్తరించడం ఇది ఎనిమిదోసారి. -
రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ!
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గాన్ని ఈనెల ఐదో తేదీ.. శుక్రవారం విస్తరించనున్నారు. శివసేనతో పొత్తు కుదిరిందని వస్తున్న కథనాల నేపథ్యంలో ఈ విస్తరణ ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 20 మంది వరకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. వాళ్లలో సగం మందికి పైగా శివసేన సభ్యులే ఉంటారంటున్నారు. అసెంబ్లీ భవనం ప్రాంగణంలో 5వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఢిల్లీలో కలిసిన దేవేంద్ర ఫడ్నవిస్.. కొత్త మంత్రుల జాబితాను ఆయనకు చూపించారని, విస్తరణకు అనుమతి కూడా తీసుకున్నారని సమాచారం. బీజేపీ సీనియర్ నాయకులు గిరీష్ బాపట్, గిరీష్ మహాజన్, బాబన్‌రావు లోనికర్, శంభాజీ పాటిల్ నీలంగేకర్ పదవులు పొందొచ్చని అంటున్నారు.