వెబ్‌డబ్
– వెంటాడుతున్న తప్పులు
– టీచర్ల బదిలీ దరఖాస్తుకు బోలెడు సమస్యలు
– రేపటి వరకు గడువు పెంపు
– లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు
అనంతపురం ఎడ్యుకేషన్ : పారదర్శకత అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ ప్రవేశ పెట్టింది. అయితే దరఖాస్తు మొదలుకొని స్కూల్‌కు బదిలీ అయ్యేవరకు వారిని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రారంభంలో సాంకేతిక లోపం కారణంగా చిన్నచిన్న సమస్యలు తలెత్తాయని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి మొదలు రాష్ట్రస్థాయిలో కమిషనర్ వరకు పలుమార్లు చెప్పారు. అయితే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునే గడువు సమీపిస్తున్న కొద్దీ కొత్తకొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి తప్ప పరిష్కారం కావడంలేదు. దరఖాస్తుకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో... తప్పులను సరిదిద్దే విషయంలో చిక్కుముడి వీడకపోతే వందలాది మంది ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరగనుంది.
చక్రం తిప్పుతోన్న ఉద్యోగి
రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించిన ప్రక్రియ సైన్స్ సెంటర్లో జరుగుతోంది. వచ్చిన సమస్యల్లో ప్రాధాన్యతను గుర్తించిæ పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కేవలం ఒక వర్గానికి చెందిన టీచర్ల సమస్యలను మాత్రం పరిగణలోకి తీసుకుంటున్నారని తెలిసింది. ఈ ప్రక్రియలో కీలకంగా మారిన ఓ ఉద్యోగి చక్రం తిప్పుతున్నారు. ఓ మంత్రితో కొందరు ఎమ్మెల్యేల సిఫార్సుతో వచ్చిన వాటికే ఈయన ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు. కొన్ని స్కూళ్లలో పోస్టులు కాపాడటం, ఇంకొన్ని స్కూళ్లలో పోస్టులు తొలగించడంలో సదరు ఉద్యోగి పాత్ర అధికంగా ఉందని తెలిసింది. అధికారులు సైతం ఈయనపైనే ఆధారపడటంతో ఎవరూ నోరు మెదపడం లేదు.
మారిన షెడ్యూలు
బదిలీలకు సంబంధించిన షెడ్యూలు మారింది. ఈనెల 16వ తేదీన యాజమాన్యాలు, కేటగిరి, సబ్జెక్టులు, మీడియం వారిగా ఉపాధ్యాయుల ఖాళీలలను ప్రకటిస్తారు. 17 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకుని హార్డ్‌కాపీలను సంబంధిత ఎంఈఓ, డెప్యూటీ డీఈఓలకు అందజేయాలి. 18 వరకు ఎంఈఓలు, డెప్యూటీ డీఈఓలు వాటిని పరిశీలించి తయారు చేసిన సీనియార్టీ జాబితాను డీఈఓ స్వీకరిస్తారు. 19న పెర్ఫార్మెన్స్, ఎన్టైటిల్మెంట్ పాయింట్ల ఆధారంగా తయారు చేసిన ప్రొవిజనల్ జాబితాను ప్రకటిస్తారు. 20,21 తేదీల్లో అభ్యంతరాలు చెప్పొచ్చు. ఆధారాలను డీఈఓ కార్యాలయంలో అందజేయాలి. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి 22న డీఈఓ ఓకే చేస్తారు. 22, 23 తేదీల్లో హెచ్ఎంలు, టీచర్లు ఆన్లైన్ దరఖాస్తుకు నిర్ధారణ చేయాలి.
24న వెబ్సైట్లో సీనియార్టీ జాబితా ఉంచుతారు. 25 నుంచి 27 వరకు హెచ్ఎంలు, టీచర్లు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. 29న ప్రొవిజినల్ అలాట్మెంట్ స్థానాల జాబితా వెల్లడిస్తారు. దీనిపై అభ్యంతరాలను 30న స్వీకరిస్తారు. జూలై 1, 2 తేదీల్లో జిల్లా కమిటీ అభ్యంతరాలను పరిశీలిస్తుంది. 3న ఖాళీలకు సంబంధించి తుది జాబితా ప్రకటిస్తారు. 4, 5 తేదీల్లో వెబ్ ద్వారా బదిలీ అయిన వారి ఉత్తర్వులు వెల్లడిస్తారు. జూలై 6న కొత్త స్కూళ్లలో చేరాలి.
ఈ సమస్యలకు పరిష్కారమేదీ?
– సర్దుబాటు కింద డీఈఓ ఉత్తర్వుల మేరకు ఇతర స్కూళ్లలో పదో తరగతి బోధించి అక్కడ వందశాతం ఉత్తీర్ణత సాధించినా టీచర్లకు పాయింట్లు పడటం లేదు.
– పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ (1938), ఏపీటీఎఫ్ (257), హెచ్ఎం అసోసియేషన్, ఆపస్... ఇవీ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలు. వీటిని ధ్రువీకరిస్తూ స్వయంగా కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆన్లైన్లో మాత్రం మరో మూడు సంఘాల పేర్లు దర్శనమిస్తున్నాయి.
– ఆన్లైన్లో నమోదు చేసిన సమయంలో అధికారులు చేసిన తప్పిదానికి టీచర్లు బలవుతున్నారు. ఉదాహరణకు కొత్తచెరువు మండలం బండ్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో సోషల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వెంకటాద్రి పుట్టిన తేదీ 4.8.1962. అయితే అధికారులు ఆన్లైన్లో 7.4.1962గా నమోదు చేశారు. ఈయన దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నిమార్లు ప్రయత్నించినా ‘డిటైల్స్ నాట్ ఫౌండ్’ అని వస్తోంది. ఇలాంటి బాధితులు వందలాది మంది ఉన్నారు.
– బదిలీలకు అర్హత లేదంటూ రేషనలైజేషన్ ప్రభావంతో స్థానాలు కోల్పోయిన టీచర్లకు ఆన్లైన్లో దరఖాస్తు ఉంచలేదు.
చేతులు దులుపుకొన్న ప్రభుత్వం
- రామకృష్ణారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు
టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూలు ఇచ్చిన ప్రభుత్వం చేతులు దులుపుకొంది. క్షేత్రస్థాయిలో అనేక లోపాలున్నా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదు. దీంతో వేలాది మంది టీచర్లకు అన్యాయం జరుగుతోంది. ఆన్లైన్ విధానం వల్ల సామాన్య టీచర్లకు న్యాయం జరగాలి తప్ప అన్యాయం జరగకూడదు. అలాంటçప్పుడు ఈ వెబ్ కౌన్సెలింగ్ విధానం దండగే.