అన్ని ప్రశ్నలకూ ఆయనే సమాధానం
► మంత్రుల్ని, చైర్‌పర్సన్‌ను ఓవర్టేక్ చేసే యత్నం
► అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు
► విస్మయపరచిన ఎమ్మెల్యే అప్పలనాయుడు తీరు
► మంత్రి మృణాళినికీ ఆగ్రహం తెప్పించిన వైనం
సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లా పరిషత్ సమావేశం మొత్తాన్ని ఆయన భుజస్కంధాలపైనే మోస్తున్నట్టు తెగ హడావుడి చేశారు. సభ్యుల ప్రశ్నలన్నింటికీ తానే సమాధానం చెప్పేందుకు యత్నించారు. అధికారులకూ వకాల్తా పుచ్చుకుని వారివ్వాల్సిన సమాధానాలనూ ఆయనే ఇచ్చేశారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఒక దశలో మంత్రి మృణాళిని సైతం ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేయడం విశేషం. ఆయనెవరో కాదు గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు.
అంగన్వాడీ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పోస్టుల్ని ఇష్టానుసారంగా అమ్ముకుని, అర్హులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతులు కూడా న్యాయబద్ధంగా జరగలేదని మరికొందరు నేతలు అధికారుల్ని ప్రశ్నించారు. దీనిపై ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ రాబర్ట్స్ సమాధానం ఇవ్వాల్సి ఉన్నా అప్పలనాయుడు అడ్డుతగిలి అంగన్వాడీ నియామకాలన్నీ పారదర్శకంగా జరిగాయని, ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదని వాదించారు.
అధికారుల్ని అడిగితే ఈయన సమాధానం చెప్పడమేంటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఏకాభిప్రాయం కుదరకుండానే బొబ్బిలి నియోజకవర్గంలో కొన్నిచోట్ల ఎన్నికలు జరిగిపోయినట్టు, తామే ఎన్నికైనట్టు కొందరు టపాసులు కాల్చుకుంటున్నారని ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు సభ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని, వాస్తవ పరిస్థితులేంటో చెప్పాలని ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. ఇరిగేషన్ అధికారి సమాధానం చెప్పే లోపు ఎమ్మెల్యే అప్పలనాయుడు జోక్యం చేసుకుని ఏకాభిప్రాయంతో ఎన్నికలు జరిగాయని, ఎమ్మెల్యే రంగారావు చెప్పినది సరికాదని ఖండించారు.
దీంతో ప్రతిపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బొబ్బిలి నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామంపై ఆయనకేం తెలుసని, అన్నీ తానై మాట్లాడటం సరికాదని అభ్యంతరం చెప్పారు. దీనిపై ఇరిగేషన్ అధికారి వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఆయన కూడా ఎమ్మెల్యే చెప్పినదే వల్లెవేసి కూర్చోవడంతో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడితే ఇరిగేషన్ అధికారులు గ్రామాల్లో తిరగలేరని, ఇబ్బంది పడతారని ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర హెచ్చరించారు.
మరొక సందర్భంలో మంత్రి మృణాళిని మాట్లాడుతుండగా జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణితో సైగలతో మాట్లాడే యత్నం చేశారు. దీంతో మంత్రి అసహనంతో ‘ అప్పలనాయుడూ... సైగలు చేసి మాట్లాడొద్దు.. మీరిద్దరూ అలా మాట్లాడటం వల్ల డిస్ట్రబెన్స్గా ఉంటుంది. సమావేశం తప్పుదారి పడుతుంది’ అని గట్టిగాచెప్పారు. అనుకోని ఝలక్‌తో అప్పలనాయుడు షాక్ తిని వెనక్కు తగ్గారు.