ప్రకాశం టీడీపీలో ‘మినీ’రణం
- కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య ఘర్షణ
- మంత్రులు, పార్టీ పరిశీలకుని ముందే రచ్చ రచ్చ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోడ్డెక్కాయి. శనివారం ఒంగోలులో నిర్వహించిన మినీ మహానాడు వేదికగా.. అధికారపార్టీ పాత నేత కరణం బలరాం, కొత్తగా పార్టీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాలమధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రులు రావెల కిషోర్‌బాబు, శిద్దా రాఘవరావు, పార్టీ పరిశీలకుడు బుచ్చయ్యచౌదరి.. సమక్షంలోనే ఇరువర్గాలవారు బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులకు దిగి సమావేశంలోనే కొట్టుకున్నారు.అడ్డొచ్చిన పోలీసులను తోసేశారు.
ఈ నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలు రావడంతో గొడవ సర్దుమణిగింది. అనంతరం గొట్టిపాటి మాట్లాడుతుండగా మళ్లీ గొడవ చెలరేగింది. దాంతో ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి సమావేశం నుంచి గొట్టిపాటి వె ళ్లిపోయారు. తర్వాత ప్రసంగించిన కరణం బలరాం బహిరంగంగానే గొట్టిపాటిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాకేజీలకోసం వచ్చినవారు అదే చూసుకోవాలితప్ప తమ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తే సహించేది లేదన్నారు. కొత్తగా వచ్చినవారు తమ మెడలపెకైక్కి స్వారీ చేయాలని చూస్తే.. బే ఆఫ్.. బెంగాల్(బంగాళాఖాతం)లో వేస్తామని వ్యాఖ్యానించారు.
చాల్లే... మూసుకుని కూర్చో..
టీడీపీ జిల్లా మినీ మహానాడు కార్యక్రమాన్ని శనివారం ఉదయం 11.30 గంటలకు ఒంగోలులో నిర్వహించారు. తొలుత గొట్టిపాటిని వేదికపై కూర్చోనివ్వద్దంటూ కరణం వర్గీయులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల సహకారంతో గొట్టిపాటి వేదికపైకి చేరుకున్నారు. తర్వాత గొట్టిపాటి ప్రసంగిస్తుండగా.. ‘చాల్లే.... మూసుకొని కూర్చో... టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీశావు. పదేళ్లు కేసులు భరించాం... ఇప్పుడు అధికారంకోసం పార్టీలో చేరతావా?’ అంటూ కరణం వర్గీయులు దూషించారు. ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా గొట్టిపాటి వర్గీయులూ నినాదాలకు దిగారు. దీంతో మరలా ఘర్షణ వాతావరణం నెలకొంది. మంత్రులతోపాటు బుచ్చయ్యచౌదరి ఎంత వారించినా గొడవ సద్దుమణగలేదు. మరోమారు పోలీసులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. తర్వాత గొట్టిపాటి సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు.
స్వారీ చేస్తే సహించం: అనంతరం కరణం బలరాం మాట్లాడారు. గతంలో అధికారం అనుభవించి తమను ఇబ్బంది పెట్టిన గొట్టిపాటి.. ఇప్పుడు అధికారంకోసం సీఎం కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగి పార్టీలో చేరారని మండిపడ్డారు. తమపై స్వారీచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతేగాక పార్టీ పెద్దలు అధిష్టానానికి వాస్తవాలు చెప్పాలంటూ ఆయన మంత్రులనుద్దేశించి వ్యాఖ్యానించారు. గొట్టిపాటి.. నియోజకవర్గంలో పోలీసులతోపాటు అధికారుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసు బలగాల్లేకుండా ఆయన బయట తిరగలేరన్నారు.