MLA HANMANTH Shinde
-
ఈసారైనా పదవొచ్చేనా?
జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు అమాత్య యోగం అందని ద్రాక్షగానే ఉండిపోయింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఈ నియోజకవర్గంనుంచి గెలిచినవారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే హన్మంత్ సింధే వరుసగా మూడుసార్లు గెలిచి నియోజకవర్గంలో తొలి హ్యాట్రిక్ సాధించారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, వెనకబడిన ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరుతున్నారు. పిట్లం: జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ మూడు రా ష్ట్ర సంస్కృతులు పరిడవిల్లుతున్నాయి. 1957లో జుక్కల్ నియోజకవర్గం ఏర్పాటైంది. తొలి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థి మాధవరావు దేశాయి ఎన్నికయ్యారు. 1962లో కాంగ్రెస్ అభ్యర్థి నాగనాథ్రావు విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విఠల్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1972లోనూ ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1978లో జుక్కల్‌ను ఎస్సీ రిజర్వ్డ్గా మార్చారు. సౌదాగర్ గంగారాం కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1983లోనూ గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పండరి ఎమ్మెల్యే అయ్యారు. 1989లో జరిగిన ఎన్నికలలో తిరిగి సౌదాగర్ గంగారాం గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓటర్లు టీడీపీ అభ్యర్థి పండరిని గెలిపించారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరుణతార విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాం గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి హన్మంత్ సింధే గెలుపొందారు. ఆయన 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగానే పోటీ చేసిన సింధే.. వరుసగా మూడోసారి విజయబావుటా ఎగురవేశారు. తొలి హ్యాట్రిక్.. జుక్కల్ నియోజక వర్గం ఏర్పాటైనప్పటినుంచి 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొలి హ్యాట్రిక్ మాత్రం హన్మంత్ సింధేదే.. సౌదాగర్ గంగారాం నాలుగుసార్లు విజయం సాధించానా.. ఆయన వరుసగా మూడుసార్లు గెలుపొందలేదు. విఠల్‌రెడ్డి రెండుసార్లు మాత్రమే గెలిచారు. పండరి కూడా రెండు విజయాలే నమోదు చేశారు. హన్మంత్ సింధే మాత్రం 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. ఆయన మూడు దఫాలూ 30 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. 2004లో మొదటిసారి తెలుగుదేశం తరఫున పోటీ చేసిన సింధే.. 1,241 ఓట్ల తేడాతో సౌదాగర్ గంగారాం చేతిలో పరాజయం చవిచూశారు. 2009నుంచి వెనుదిరిగి చూడలేదు. 2009లో తెలుగుదేశం నుంచి రెండోసారి పోటీ చేసిన సింధే.. 34058 ఓట్ల మెజారిటీతో గంగారాంపై గెలుపొందారు. తరువాత తెలంగాణ ఉద్యమం ప్రభావంతో టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2014లో జరిగిన ఎన్నికల్లో గంగారాం సతీమణి సావిత్రిబాయిపై 35,007 వేల మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి గంగారాంపై 35,624 ఓట్ల తేడాతో గెలిచారు. అవకాశం దక్కేనా? జుక్కల్ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగినా.. ఒక్కసారి కూడా మంత్రి పదవి లభించలేదు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం జుక్కల్ నియోజక వర్గం. ఈ నియోజకవర్గంనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి మంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారైనా సింధేకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట
రూ. 25 వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ దే ఎమ్మెల్యే హన్మంత్‌షిండే నిజాంసాగర్ (జుక్కల్ ): ప్రపంచ దేశాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. వ్యవసాయరంగంతో పాటు సంక్షేమ రంగాలకు రాష్ట్ర బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు దక్కిందన్నారు. సీఎం కృషితో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియామకమైన తర్వాత మొదటి సారిగా మంగళవారం నిజాంసాగర్ మండలానికి వచ్చిన హన్మంత్‌షిండేకు మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అధక్షతన సన్మాన సభ నిర్వహించారు.షిండే మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు సన్నబియ్యంతో కూడిన పౌష్టిక ఆహారం వచ్చేనెల నుంచి అందిస్తామన్నారు. జడ్పీచైర్మన్ దఫేదార్ రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా చేయించిన సర్వేలో హన్మంత్‌షిండే కామారెడ్డి జిల్లాలో 69.3 శాతం పాయింట్లు సాధించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే మంత్రి పదవితో పాటు మరిన్ని ఉన్నత పదువులు పొందాలని ఆకాంక్షించారు. సమావేశంలో మాగి గాయత్రి కర్మాగారం సీడీసీ చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వినయ్‌కుమార్, నాయకులు గైని విఠల్, గడ్డం గంగారెడ్డి, వాజిద్‌అలీ, లింగాల రాంచెందర్, విఠల్, బేగరి రాజు, అహ్మద్ ఉస్సెన్, ఆనంద్‌కుమార్, నర్సింలు, సంఘమేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్లలో నిరంతర విద్యుత్
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ : మరో మూడేళ్లలో రాష్ట్రంలో 24 గంట లపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా ద్వితీయ వార్షికోత్సవం శుక్రవారం స్థానిక మీనా గార్డెన్స్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2018 చివరి నాటికి 500 కోట్ల రూపాయల వ్యయంతో 24,475 మెగావాట్ల విద్యుత్తును సిద్ధం చేస్తామని అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో విద్యుత్తు కోతే ఉండదని, గృహ.. వ్యవసాయ విద్యుత్తు పుష్కలం గా సరఫరా అవుతుందని అన్నారు. కేజీ టు పీజీ నిర్బంధ విద్యను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి విశ్వ బ్రాహ్మణులకు సంబంధించిన 18 డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యం గా ప్రత్యేకంగా టెండర్ల కేటాయింపు, పోలీసులు.. అటవీ శాఖ అధికారుల వేధింపుల నివారణ డిమాం డ్లను పుష్కరాల తరువాత పరిష్కరిస్తానని అన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు జంగం విజయ, సర్పంచ్ దోన్కంటి వాణి విఠ ల్, పీఏసీఎస్ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నార్ల సురేష్, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు నరహరి చారి, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌చారి, కోశాధికారి బాలవీర చారి, మండల అధ్యక్షుడు పుండరీకం చారి, ప్రధాన కార్యదర్శి బి.సత్యనారాయణ చారి, సభ్యులు అంజ య్య చారి, రామాచారి, గంగాధర చారి తది తరులు పాల్గొన్నారు.