'మ్యాథ్స్, సైన్స్‌లో గ్రేస్ మార్కులు కలపాలి'
హైదరాబాద్ : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే పదో తరగతి ఫలితాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి తెలంగాణ సర్కారే కారణమని టీడీపీ ఎమ్మెల్యే వివేక్ మండిపడ్డారు. సీసీఈ విధానంపై అధ్యాపకులకు అవగాహన లేకపోవటం వల్లే టెన్త్‌లో మ్యాథ్య్, ఫిజిక్స్‌లో ఫెయిల్ అయ్యారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు.
సీసీఈ విధానం మంచిదే అని, అయితే విద్యా సంవత్సరం మధ్యలో ప్రవేశపెట్టడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. మ్యాథ్స్, సైన్స్‌లో గ్రేస్ మార్కులు కలిపి విద్యార్థులకు న్యాయం చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. సప్లిమెంటరీలోగా కొత్త విధానంపై అవగాహన కల్పించి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చూడాలని ఆయన కోరారు. పరీక్ష లోపాల అన్నింటితో టీడీపీఎల్పీ తెలంగాణ సర్కార్‌కు లేఖ రాస్తుందని వివేక్ తెలిపారు.
విద్యారంగం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేదని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. కేజీ టు పీజీపై రెండో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నా ఇంకా స్పష్టత లేదన్నారు. తెలంగాణలో 10 యూనివర్శిటీలకు ఒక్క వైస్ ఛాన్సులర్ లేరని సండ్ర విమర్శించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా యూనివర్శిటీలపై గవర్నర్ అధికారాలను సీఎం లాక్కోవాలని చూస్తున్నారని, అటామస్ బాడీలా ఉండే యూనివర్సిటీలపై సీఎం ఎలా పెత్తనం చేయాలని చూస్తారని ప్రశ్నించారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టివ్వాలని, యూనివర్సిటీ భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని సండ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు.