ప్రజా సమస్యలపై నిత్యం పోరాడాలి
బొండపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాడాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పారు. బొండపల్లిలోని నాయుడు ఫంక్షన్ హాల్లో గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం జరిగిన నియోజకవర్గ పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నేతలు, కార్యకర్తలు రోజుకు కనీసం మూడు గంటలు పనిచేయాలని కోరారు.
ప్రతి గ్రామంలో కనీసం 16 మంది సభ్యులతో కమిటీలు, మండల స్థాయిలో పార్టీ అనుబంధ సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అమలు సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ప్రజలను మోసగించే స్థాయికి చేరుకున్నారని విమర్శించారు. రుణమాఫీ చేశామని మంత్రులు, టీడీపీ నేతలు మిఠాయిలు పంచుకుంటూ మీడియాలో ఆర్భాటం చేస్తున్నారని చెప్పారు. కానీ క్షేత్ర స్థాయిలో రుణమాఫీ జరగ కపోవటంతో రైతులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాల మాఫీ పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు.
కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని, అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటానని చెప్పారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెన్మత్స సాంబశివరాజు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు వరుదు కల్యాణి, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు బెల్లాన చంద్రశేఖర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, పార్టీ నాయకులు మామిడి అప్పలనాయుడు, ఆశపు వేణు, ఎం.సత్యనారాయణ, భూడి వెంకటరావు, కడుబండి రమేష్, ఈదుబిల్లి క్రిష్ణ, వర్రి నర్శింహమూర్తి, గెద్ద రవి, గెద్ద రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.