మును‘గోడు’ తీర్చేందుకే బరిలో నిలిచా
సాక్షి, మునుగోడు : రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న మునుగోడులో నేటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఆ గోడును తీర్చేందుకు తాను ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు వదులుకొని ఎమ్మెల్యేగా బరిలో నిలిచానని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ మునుగోడు అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనకు టికెట్ రావడంపై చల్మడ గ్రామం నుంచి కొంపల్లి, చీకటిమామిడి గ్రామాల మీదుగా మునుగోడు వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక సత్య ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తాను పదవి కోసం పోటీ చేయడం లేదని, ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎమ్మెల్యేగా రావాలని కోరుకున్నందుకు పోటీ చేస్తున్నానన్నారు. గత రెండు నెలల కాలంగా నేను దేవుడిని ప్రతి రోజు నాకు మునుగోడు ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించాలని వేడుకున్నానన్నారు. డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ ప్రగతిభవనం ఖాళీ చేసి తన ఫామ్‌హౌజ్‌కి పోకతప్పదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని ఎవ్వరూ భయపడవద్దన్నారు. ఆ పథకాలు యధావిధిగా కొనసాగించడంతో పాటు రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, ఏడాదికి ఉచితంగా ఆరు ఉచిత సిలిండర్లతో పాటు ఇల్లు కట్టుకునేవారికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దిమ్మతిరిగే మెజార్టీ సాధించేందుకు ప్రతి కార్యకర్త 20 రోజుల పాటు ప్రతి గడప గడపకు వెళ్లి తనకు ఓటువేయాలని అభ్యర్ధించాలని కోరాడు. పార్టీ మండల అధ్యక్షుడు జాల వెంకన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వంగాల స్వామిగౌడ్, మైనార్టీ సెల్ నాయకుడు ఎండీ హఫీజ్‌ఖాన్, రాష్ట్ర కార్యదర్శి కుంభం శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్నేత, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు ముంగి చంద్రకళ, రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా కార్యదర్శి బూడిద లింగయ్య గౌడ్, జెడ్పీటీసీ జాజుల అంజయ్యగౌడ్, మాజీ ఎంపీపీ పోలగోని సత్యంగౌడ్, నన్నూరి విష్ణువర్ధన్‌రెడ్డి, వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, బొజ్జ శ్రీనివాస్‌రెడ్డి, మేకల రామస్వామి, పందుల భాస్కర్, మేకల ప్రమోద్‌రెడ్డి, పాల్వాయి జితేందర్‌రెడ్డి, ఎండీ అన్వర్, సాగర్ల లింగస్వామి, పోలగోని ప్రకాష్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, మేకల మల్లయ్య, పాలకూరి యాదయ్యగౌడ్, మాదగోని రాజేష్‌గౌడ్, మల్లయ్య పాల్గొన్నారు.